
హైదరాబాద్ వారసత్వ సంపదను కళ్లకుకట్టేలా తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ) హోప్ ఆన్.. హోప్ ఆఫ్ సర్వీస్ బస్సులను తీసుకొచ్చింది. ఇప్పుడు ఇదే తరహాలో ‘హెరిటేజ్ ఆన్ ఆటోస్’ పేరుతో బ్యాటరీతో నడిచే ఆటోలను ప్రవేశ పెట్టనుంది. ఈ నెల 15వ తేదీ తర్వాత ఇవి సిటీలో చక్కర్లు కొట్టనున్నాయి. ఇందుకు సంబంధించిన ఆటోలను ఢిల్లీకి చెందిన స్మార్ట్ సంస్థ అందిస్తోంది.
మ్యూజియంనుంచి ప్రారంభం..
నగర చరిత్రను చాటే సాలార్జంగ్ మ్యూజియం అందరూ సందర్శించే ప్రదేశం. ఈ ఆటో టూర్ ఇక్కడి నుంచే ప్రారభమవుతుంది. నిజాం అధికారక నివాసం పురానీ హవేలీ. అసఫ్ జాహీ వంశస్తుడైన సికందర్ జా నివాసం కోసం దీన్ని నిర్మించారు. ‘యు’ ఆకారంలో ఉన్న ఈ రాజసౌధంలో ప్రస్తుతం పలు విద్యాలయాలు కొనసాగుతున్నాయి. వీటిలో ఒక భాగాన్ని మ్యూజియంగా మార్చారు. ఏడో నిజాం సిల్వర్‌జూబ్లీ వేడుకల సందర్భంగా అతిథులు అందించిన బహుమతులు, ఆ వేడుకల్లో నిజాం ఆశీనుడైన సింహాసనంతో సహా అనేక వెండి, బంగారు వస్తువులతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిజాం ‘వార్డ్‌రోబ్’, మ్యాన్యువల్ లిఫ్ట్‌ను ఈ ప్రదర్శనశాలలో ఉంచారు. వీటిని చూసేందుకు ఆటోలు ఇక్కడ ఆగుతాయి.
చార్మినార్..మక్కా మసీదు..
పురానీహవేలీ నుంచి నిజాం మంత్రుల నివాసం ‘దివాన్ దేవిడీ’కి ఆటోలో ప్రయాణం చేయోచ్చు. చార్మినార్, మక్కా మసీద్, యునానీ ఆస్పత్రుల మీదుగా చౌమహల్లా ప్యాలెస్‌కు బయలుదేరతాయి. చార్మినార్ వద్దకు పెద్ద వాహనాలు ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఈ స్మార్ట్ ఆటోలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.
రాయల్ ట్రీట్..హైదరాబాదీ టేస్ట్
చౌమహల్లా ప్యాలెస్‌లో నిజాం ధరించిన దుస్తులు.. వింటేజ్ కార్లు ప్రత్యేక ఆకర్షణ. ఏస్ బైక్ హార్లీ డేవిడ్‌సన్ సిరీస్‌లో తొలితరం బైక్‌ని ఇక్కడ చూడవచ్చు. అడుగడుగునా రాజసం ఉంట్టిపడే ప్యాలెస్ నాలుగు మహళ్ల సముదాయం. అఫ్జల్ మహల్, మహతబ్, తహ్‌నియత్, అఫ్తబ్ మహల్. నిజాం అతిథులకు విందు ఈ మహల్‌లోనే ఇచ్చేవారు. ప్రస్తుతం సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలకు వేదికగా ఉంది.
స్మార్ట్ ఆటోలు..
టీఎస్‌టీడీసీ ఢిల్లీకి చెందిన ‘స్మార్ట్’ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తొలుత 20 స్మార్ట్ ఆటోలను నగరంలో ప్రవేశపెట్టనున్నారు. అన్ని హేరిటేజ్ ప్రాంతాల ఎంట్రీ టికెట్ కలిపి ఒక్కొక్కరు రూ.200 చెల్లించాలి. సాలార్జంగ్ మ్యూజియం నుంచి ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఆరు, ఏడు వారసత్వ ప్రాంతాలను ఈ టూర్‌లో చుట్టిరావచ్చు. సాలార్జంగ్ మ్యూజియం వద్ద ప్రతి పది నిమిషాలకు ఓ ఆటో బయలుదేరేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఆటోల్లోనే ఆయా ప్రాంతాల విశిష్టతను తెలియజేసే బోర్డులు సైతం ఏర్పాటు చేస్తారు. డ్రైవర్లకు గైడ్‌ల తరహా శిక్షణ ఇస్తారు.
అసౌకర్యాలపై ఫిర్యాదు చేయండి
టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో నడిచే టూర్స్, హరిత హోటల్స్, బుకింగ్ రిజర్వేషన్ సెంటర్లు, సెంట్రల్ రిజర్వేషన్స్ సెంటర్లలో టూరిస్టులకు ఏ విషయంలోనైనా అసౌకర్యం కలిగితే 180042546464(టోల్ ఫ్రీ), 92460 10011 నంబర్లలో ఫిర్యాదు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment