అధికారులకు సీఎం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 31 నాటికి రాష్ట్రానికి ప్రత్యేకంగా పర్యాటక విధానాన్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దానిని తదుపరి శాసనసభ సమావేశాల్లో చర్చకు ఉంచి సమగ్రంగా చర్చించనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఆయన పర్యాటక శాఖపై సమీక్షించారు. తెలంగాణలో వాతావరణపరంగా అనుకూల పరిస్థితి ఉండటం, శాంతిభద్రతలు మెరుగ్గా ఉండటం పర్యాటక రంగ పురోగతికి కలిసొచ్చే అంశాలని, వీటిని వినియోగించుకుంటూ పర్యాటకులు అధికంగా రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పర్యాటకశాఖ స్వయంసమృద్ధి సాధించేలా చూడాలని, ఇందుకోసం కాన్సెప్ట్ టూరిజంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. దుబాయ్, సింగపూర్, చైనాల్లో పర్యాటకరంగం వృద్ధి చెందేందుకు అనుసరించిన పద్ధతులను అధ్యయనం చేసి స్థానికంగా అనువైన అంశాలను అనుసరించాలని చెప్పారు. తమిళనాడు తరహాలో ఆటోమొబైల్ రంగం స్థానికంగా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. టైగర్ రిజర్వ్ ఫారెస్టులు పర్యాటకులను బాగా ఆకట్టుకుంటాయని, ఇందుకోసం మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి తెలంగాణకు పులులు వచ్చేలా చూడాలని సూచించారు. పులులు తిరిగే ప్రాంతాలకు చేరువగా ఉన్న దేవాలయాలను అనుసంధానిస్తూ ఎకో టూరిజం–టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేయాలని సూచించారు
మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల దేవాలయాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగిందని, ఇది కూడా పర్యాటకాభివృద్ధికి దోహదమయ్యే అంశమేనన్నారు. ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 20 నిమిషాల్లో దానికి చేరుకునేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు అనువైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాలన్నారు. పర్యాటకాభివృద్ధి సంస్థ నుంచి లీజుకు తీసుకున్న స్థలాలను గడువు ముగిసినా ఖాళీ చేయని సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆయా స్థలాలపై ఉన్న కోర్టు స్టేలను ఎత్తివేసేలా అడ్వొకేట్ జనరల్‌తో చర్చించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉస్మానియా ఆస్పత్రిని ఖాళీ చేసిన తర్వాత ఆ భవనాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. చార్మినార్ ను మరింత మంది సందర్శించాలంటే ఏం చేయాలో తేల్చి ఆమేరకు చర్యలు తీసుకోవాలన్నా రు. సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎండీ ప్రకాశ్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment