పర్యాటకానికి కొత్త కళ | New Look For Tourism Sector | Sakshi
Sakshi News home page

పర్యాటకానికి కొత్త కళ

Published Sun, Sep 19 2021 4:53 AM | Last Updated on Sun, Sep 19 2021 4:53 AM

New Look For Tourism Sector - Sakshi

సాక్షి, అమరావతి: పర్యాటక రంగంలో మౌలిక వసతుల కల్పన, మెరుగైన సేవలే లక్ష్యంగా ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ టీడీసీ) ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) కింద హోటళ్లు, కాటేజీలు, బీచ్‌ రిసార్ట్‌లు, రవాణా, కమ్యూనికేషన్‌ సౌకర్యాలను అభివృద్ధి చేయనుంది. పర్యాటక ఆస్తుల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తోంది. 

16 ప్రాజెక్టుల అభివృద్ధి 
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద 16 ప్రాజెక్టులను అభివృద్ధి చేయనుంది. వీటిలో విజయనగరం జిల్లా తాతిపూడి (రిసార్ట్‌), విశాఖ జిల్లా నక్కపల్లి (వే ఎమినిటీస్‌), రేవు పోలవరం, శ్రీకాకుళం జిల్లాలోని మొఫస్‌ బందర్, నెల్లూరు జిల్లా తుమ్మలపెంట, తుపిలిపాలెం (బీచ్‌ రిసార్ట్స్‌), ప్రకాశం జిల్లా సింగరాయకొండ పాలెం, చిత్తూరు జిల్లా నాగపట్ల, తిమ్మసముద్రం, తానపల్లె (హోటల్, వే ఎమినిటీస్‌) కడప టౌన్‌ (బాంకెట్‌ హాల్‌), కర్నూలులోని వెంకటరమణ కాలనీ, అనంతపురం జిల్లాలోని హిందూపూర్‌ (ఫుడ్‌ కోర్టు, గేమింగ్‌ జోన్లు), సజ్జలదిన్నె (వే ఎమినిటీస్‌) ఉన్నాయి. అగ్రి టూరిజంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల, పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోని 130 ఎకరాల్లో నర్సరీల పెంపకాన్ని ప్రోత్సహించనుంది. 

వే ఎమినిటీస్‌ ఇలా.. 
వే ఎమినిటీస్‌ కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లో జాతీయ రహదారులపై ప్రయాణికుల కోసం పార్కింగ్‌ సౌకర్యాలు (కార్లు, బస్సులు, ట్రక్కుల కోసం విడివిడిగా), రెస్టారెంట్లు, టెలిఫోన్‌ బూత్‌/వైఫై, ఏటీఎం, పెట్రోల్‌ బంకులు, చిన్నపాటి మరమ్మతు దుకాణాలు, విశ్రాంతి గదులను నిర్మిస్తారు. వీటితోపాటు 15 హరిత హోటళ్లు, రెస్టారెంట్‌లను రూ.47 కోట్లతో ఆధునికీకరించనుంది. 

పెట్టుబడులను ఆకర్షించేలా.. 
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టూరిజం పాలసీ–2025 పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ప్రోత్సాహకాలను అందిస్తూ పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. పాత పాలసీ ప్రకారం పీపీపీ కింద అభివృద్ధి చేసే స్థలాల లీజు అద్దె అక్కడి మార్కెట్‌ విలువలో 2 శాతంగా ఉండేది. దీనికి తోడు ఏటా 5శాతం లీజు పెరుగుతూ వచ్చేది. దీంతో పెట్టుబడి పెట్టేందుకు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపేవారు కాదు. పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లీజును ఒక శాతానికి తగ్గించింది. ప్రతి మూడేళ్లకు ఒకసారి 5 శాతం అద్దెను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. భూ బదలాయింపు రుసుంలో వంద శాతం మినహాయింపు ఇస్తోంది. అగ్రిమెంట్‌లో భాగంగా స్టాంపు డ్యూటీ మొత్తాన్ని, ఎస్‌జీఎస్టీని పూర్తిగా రీయింబర్స్‌ చేసుకునే అవకాశం కల్పించింది. విద్యుత్‌ వినియోగంలో యూనిట్‌కు రూ.2 చొప్పున ఐదేళ్ల పాటు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం ఇచ్చింది.  

మెరుగైన సేవల కోసం.. 
పెరుగుతున్న పర్యాటకులకు అనుగుణంగా మెరుగైన సేవలు అందించేందుకు ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌ (ఓ అండ్‌ ఎం)లో భాగంగా వివిధ రకాల పర్యాటక ఆస్తుల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనుంది. ఇప్పటికే 25 ఆస్తుల్లో ప్రైవేటు వ్యక్తులు కార్యకలాపాలు కొనసాగిస్తుండగా.. ఇటీవల 12 ఆస్తుల నిర్వహణకు అగ్రిమెంట్లు చేసుకున్నారు. తాజాగా కొత్త పాలసీ ప్రకారం 28 ఆస్తులను 15 ఏళ్ల చొప్పున లీజుకు ఇచ్చి తద్వారా ఏడాదికి సుమారు రూ.1.30 కోట్ల మేర ఆదాయం ఆర్జించేలా ప్రణాళికలు రూపొందించారు. వీటిల్లో హోటళ్లు, కాటేజీలు, రెస్టారెంట్లు, బీచ్, లేక్‌ రిసార్ట్స్, గెస్ట్‌హౌస్‌లు, ఎకో పార్కులు, వే ఎమినిటీస్‌ సెంటర్లు ఉన్నాయి.  

పర్యాటక వనరుల అభివృద్ధిపై దృష్టి 
పర్యాటక వనరుల అభివృద్ధిపై దృష్టి పెట్టాం. అన్ని ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. పీపీపీ విధానంలో హోటళ్లు, రిసార్టులు, ఇతర సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నాం. మెరుగైన సేవల కోసమే టూరిజం ఆస్తుల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నాం. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తాం. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే మా లక్ష్యం. 
– ఎస్‌.సత్యనారాయణ, ఎండీ, ఏపీ టీడీసీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement