శుభ 'గడి'యలొస్తున్నాయ్ | Telangana tourism policy: old forts will be tourist spots | Sakshi
Sakshi News home page

శుభ 'గడి'యలొస్తున్నాయ్

Published Mon, May 16 2016 3:11 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

శుభ 'గడి'యలొస్తున్నాయ్

శుభ 'గడి'యలొస్తున్నాయ్

- పర్యాటక కేంద్రాలుగా తెలంగాణ గడిలు, చారిత్రక కోటలు
- రాష్ట్ర టూరిజం పాలసీ ముసాయిదా సిద్ధం
- జూన్ రెండో వారంలో ఆవిష్కరించనున్న ప్రభుత్వం
- సీఎం సారథ్యంలో తెలంగాణ టూరిజం ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు
- పర్యాటకులను ఆకట్టుకోవటం.. ఉపాధి కల్పనే లక్ష్యాలు
- పర్యాటక ప్రాజెక్టులకు భారీగా పన్ను రాయితీలు, స్టాంప్ డ్యూటీ మాఫీ
- లగ్జరీ ట్యాక్స్, వినోదపు పన్ను, విద్యుత్తు చార్జీల్లో రాయితీలు

 
సాక్షి, హైదరాబాద్

తెలంగాణ ప్రాంతంలోని పురాతన గడిలు, చారిత్రక కోటలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ప్రవేశపెట్టబోయే ‘నూతన తెలంగాణ పర్యాటక విధానం 2016-2020’లో భాగంగా వీటికి ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ముసాయిదాను పర్యాటక శాఖ సిద్ధం చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పర్యాటక విధానాల కంటే మెరుగైన రీతిలో ఈ విధానాన్ని రూపకల్పన చేసింది. కొత్త పారిశ్రామిక విధానం, కొత్త ఐటీ పాలసీతో రాష్ట్రానికి విశేషంగా పెట్టుబడులను ఆకర్షించిన ప్రభుత్వం.. ఇదే క్రమంలో పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా పెట్టుబడులను ఆకర్షించటంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగేలా కొత్త విధానానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేశారు.

ఈ కొత్త విధానంలో సీఎం చైర్మన్‌గా తెలంగాణ టూరిజం ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (టీటీపీబీ) ఏర్పాటు చేస్తారు. పర్యాటక శాఖ, రెవెన్యూ, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ బోర్డులో సభ్యులుగా ఉంటారు. పర్యాటక కేంద్రాలకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సమీకరణపై ఈ బోర్డు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. జూన్ మొదటి లేదా రెండో వారంలో టూరిజం పాలసీని ప్రకటించే అవకాశాలున్నాయి. దేశ విదేశాల నుంచి ముఖ్య అతిథులు, విదేశాలకు చెందిన పర్యాటక మంత్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు.

గడీలకు కొత్త సొబగులు
కొత్త విధానంలో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతమున్న పర్యాటక కేంద్రాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ చరిత్రకు అద్దం పట్టే గడీలు, కోటలపై దృష్టి కేంద్రీకరించింది. గడీలకు చారిత్రక ప్రాధాన్యముంది. రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా పెద్ద గడీలు, వివిధ జిల్లాల్లో పెద్దపెద్ద కోటలున్నాయి. రాచకొండ, దోమకొండ, దేవరకొండ, భువనగిరి, ఖమ్మం, ఎలగందుల, జగిత్యాల, నగునూరు, మెదక్, రామగిరి కోటలు చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వీటితోపాటు కొల్లాపూర్, వనపర్తి, గద్వాల, విస్నూరు, దోమకొండ తదితర ప్రాంతాల్లో ఉన్న గడీలు నిజాం కాలం నాటి నుంచి చరిత్రకారులందరి దృష్టిని ఆకర్షించాయి.

ఉద్యమాలతో పాటు చారిత్రక నేపథ్యమున్న తెలంగాణలోని గడీలు సాయుధ పోరాట సమయంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వీటిలో కొన్ని ఇప్పటికే శిథిలమయ్యాయి. కొన్ని ఆనాటి దేశ్‌ముఖ్‌లు, దొరల వారసుల చేతిలో ఉన్నాయి. వీటిలో కొన్ని గడీలను సందర్శనకు వీలుగా తీర్చిదిద్దితే పర్యాటకులను అమితంగా ఆకర్షించే వీలుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఎక్కడెక్కడగడీలున్నాయి.. వాటిలో శిథిలమైనవెన్ని.. వేటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశాలున్నాయి? అనే వివరాలపై తుది ప్రతిపాదనలు తయారు చేస్తోంది.

విదేశీ పర్యటకులపై దృష్టి..
కొత్త విధానంలో విదేశీ పర్యాటకులను ఆకర్షించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఏటా రాష్ట్రానికి సుమారు లక్షన్నర మంది విదేశీ పర్యాటకులు వస్తున్నారు. ఈ సంఖ్యను రానున్న పదేళ్లలో పది లక్షలకు పెంచాలని లక్ష్యంగా ఎంచుకుంది. గతానికి భిన్నంగా జిల్లా స్థాయి, మున్సిపల్, మండల స్థాయిల్లో లోకల్ టూరిజంను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. స్థానిక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను సైతం గుర్తించి వాటిని టూరిజం ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. ఈ బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించి ఆదాయం పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

రాయితీలు వరాలు..
కొత్త విధానంలో స్టార్ హోటళ్లు, రిస్టార్ట్స్, హెరిటేజ్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, మోటళ్లు, టెంటెడ్ అకమడేషన్స, అమ్యూజ్‌మెంట్ పార్క్‌లు, థీమ్ పార్క్‌లు, టూరిజం శిక్షణ కేంద్రాలు, వాటర్ స్పోర్ట్స్, అడ్వంచర్ స్పోర్ట్స్ యూనిట్లకు ప్రభుత్వం భారీగా రాయితీలు కల్పించనుంది. ప్రభుత్వ స్థలాల కేటాయింపుతోపాటు కనీసం 15 నుంచి 20 శాతం పెట్టుబడి సాయం అందించనుంది. దీంతోపాటు మెగా టూరిజం ప్రాజెక్టులకు స్టాంప్ డ్యూటీ మాఫీ చేయటంతో పాటు ఏడేళ్ల పాటు లగ్జరీ టాక్స్, వినోదపు పన్నును మినహాయించనుంది. మూడేళ్ల పాటు విద్యుత్ చార్జీల్లో సగం రాయితీ ఇవ్వనుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా పెట్టుబడిదారులకు అదనపు రాయితీలివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో టూరిజం యూనిట్లను నెలకొల్పేందుకు మరింత ప్రోత్సాహకాలను ప్రకటించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement