సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం తర్వాత పర్యాటక రంగానికి నూతన టూరిజం పాలసీ (2020–2025) కొత్త ఊపు ఇచ్చింది. గత పాలసీ కంటే మెరుగ్గా.. పెట్టుబడిదారులను ఆకర్షించే రాయితీలతో సుమారు రూ.2,600 కోట్లకు పైగా ప్రాజెక్టులను సమీకరించింది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆతిథ్య రంగ సంస్థలైన ఒబెరాయ్, తాజ్ వరుణ్, హయత్ సంస్థలు రాష్ట్రంలో ఏడు, ఐదు నక్షత్రాల హోటళ్లు, అత్యాధునిక వసతులతో విల్లాలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చాయి. వీటి ద్వారా దాదాపు 48 వేల మందికి ఉపాధి దక్కనుంది.
చదవండి: చిన్నారులకు టీకా.. జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలోని బీచ్‌లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే విశాఖపట్నంలోని రిషికొండకు ప్రతిష్టాత్మక బ్లూఫ్లాగ్ గుర్తింపు రాగా.. గుంటూరు జిల్లాలోని సూర్యలంక, ప్రకాశం జిల్లాలోని రామాపురం బీచ్‌లను కూడా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా తొలిదశలో అభివృద్ధి చేయనున్నారు. ఈ క్రమంలోనే రూ.10 కోట్లతో స్టేట్ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ యూనిట్ ఏర్పాటుకు అనుమతులు లభించాయి. ఇక వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోటను పర్యాటక సిటీగా అభివృద్ధి చేసేందుకు సుమారు 4,300 ఎకరాల భూమిని గుర్తించారు. మరోవైపు.. రాష్ట్రంలో పాడేరు, జంగారెడ్డిగూడెం, పట్టిసీమ ప్రాజెక్టు ప్రాంతంలో అగ్రి టూరిజాన్ని ప్రోత్సహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
పక్కా ప్రణాళిక ప్రకారం..
సుదీర్ఘకాలం తర్వాత నవంబర్ 7న అత్యంత భద్రతా ప్రమాణాలతో పాపికొండలు బోటు యాత్ర ప్రారంభమైంది. ఈ క్రమంలోనే కృష్ణా నదిపై కూడా జల విహారం సందడి చేసింది. ప్రస్తుతం పోచమ్మగండి, పోచవరం నుంచి పాపికొండలుకు బోటింగ్ పాయింట్ ఉండగా.. పోచవరం నుంచి భద్రాచలానికి ఏపీ పర్యాటక బోటును తిప్పేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సింగనపల్లి బోటింగ్ పాయింట్ నీటిలో మునిగిపోగా కొత్త పాయింట్ కోసం టూరిజం అధికారులు జలవనరుల శాఖకు విన్నవించారు. మరోవైపు.. పర్యాటక సంస్థలకు చెందిన 33 హోటళ్లు, రెస్టారెంట్లు, స్థలాలను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) కింద ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా ఏడాదికి సుమారు రూ.2 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించేందుకు టెండర్లు పిలిచారు. పాత టెండర్లలో ఎనిమిది ప్రాజెక్టులు త్వరలో ఒప్పందం చేసుకోనున్నాయి.
పర్యాటకుల సందడి.. ఆదాయం ఇలా..
ఈ ఏడాది ఇప్పటివరకు 5.81 కోట్ల మంది దేశీయ, 33 వేల మంది విదేశీ పర్యాటకులు రాష్ట్రంలోని పర్యాటక స్థలాలను సందర్శించినట్లు టూరిజం గణాంకాలు చెబుతున్నాయి. గతంలో పోలిస్తే ఇందులో 16 శాతం తగ్గుదల కనిపించినప్పటికీ ఆదాయంలో మాత్రం పెరుగుదల ఉంది. ముఖ్యంగా పర్యాటక రంగానికి ఎక్కువ ఆదాయం హోటల్ రంగం నుంచి వస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్ల ద్వారా గతేడాది రూ.29.76 కోట్లు రాగా ఈ ఏడాది 59.95 కోట్లు ఆదాయం గడించింది. మరోవైపు.. వాటర్ ఫ్లిట్ (గుహలు, సౌండ్ అండ్‌లైట్స్, రోప్‌పే, బోటింగ్) విభాగం ద్వారా గతేడాది రూ.6.45 కోట్లు రాగా ఈ ఏడాది ఇప్పటివరకు 12.68 కోట్లు వచ్చింది. ఈ రెండింటిలో 50 శాతం మేర వృద్ధిరేటు కనిపించడం ఊరటనిచ్చే అంశం.
సాంకేతిక ఒరవడి..
►ఇక పర్యాటకాభివృద్ధికి ఆ శాఖ సాంకేతికతను జోడిస్తోంది. ఇప్పటికే హరిత హోటళ్లలో సాంప్రదాయ మెనూ కార్డు స్థానంలో క్యూఆర్ కోడ్ మెనూను పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తోంది. కొత్త ఏడాదిలో వీటిని అన్ని హోటళ్లలో ప్రవేశపెట్టనుంది.
►రాష్ట్ర పర్యాటక గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు డిజిటల్ ప్రచారానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల ప్రత్యేక మార్కెటింగ్ స్ట్రాటజీని రూపొందించింది.
►అలాగే, రాజమండ్రిలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ అందుబాటులోకి తీసుకురాగా విజయవాడ బెరం పార్కులో రెండు భారీ జెట్టీలతో మరో తేలియాడే రెస్టారెంట్‌ను నిర్మిస్తున్నారు.
►సుమారు రూ.వెయ్యి కోట్లతో చేపట్టే విశాఖ బీచ్ కారిడార్ ప్రాజెక్టు పర్యాటక శాఖ నుంచి పురపాలక శాఖకు బదిలీ చేశారు. ఇందులో భాగంగా భీమిలి–భోగాపురం సీప్లేన్ (సముద్ర విమానయానం)కు అవసరమైన జెట్టీని, బీచ్‌లలో మౌలిక వసతులను కల్పించేందుకు పర్యాటక శాఖ కసరత్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment