కొబ్బరికాయ భూగర్భ జలాల జాడను కనిపెట్టగలదా? | Coconut Find Ground Water What Does Science Say | Sakshi
Sakshi News home page

కొబ్బరికాయ భూగర్భ జలాల జాడను కనిపెట్టగలదా? సైన్స్‌ ఏం చెబుతోంది..?

Published Fri, Sep 22 2023 1:34 PM | Last Updated on Fri, Sep 22 2023 3:02 PM

Coconut Find Ground Water What Does Science Say - Sakshi

మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడే రైతులు తమ పొలాల్లో నీటి జాడలను కనిపెట్టేందుకు జియాలజిస్ట్‌లను పిలిపించలేరు. ఎందుకంటే వారు అంత డబ్బు వెంచ్చించలేరు. పైగా అంత సమయం కూడా ఉండదు. అందుకని రైతులు నీటి జాడలను కనిపెట్టే వారిపై ఆధారపడుతుంటారు. అయితే ఇది శాస్త్రీయమేనా? దీని గురించి సైన్సు ఏం చెబుంతుంది తదితరాల గురించే ఈ కథనం.

చాలమంది రైతులు తమ పొలాల్లో బోర్లు వేయడానికి ఫీల్డ్‌ సర్వేయర్లను పిలుస్తారు. వారు చేతిలో కొబ్బరికాయ, వేప పుల్ల, నీళ్ల చెంబు తదితరాలను ఉపయోగించి నీటి జాడలను చెబుతారు. దీన్నే విశ్వసించి రైతులు వారు చెప్పిన చోట బోర్లు వేయించుకుంటారు. ఇటువంటి పద్ధతులు నిజానికి శాస్త్రీయమా? దీని గురించి రైతులు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం అంటున్నారంటే..

మూడు పద్ధతుల్లో నీటి జాడను..
తనకు తెలిసిన పద్ధతుల్లో నీటిజాడలను గుర్తిస్తున్న వారిలో సురేందర్‌ రెడ్డి ఒకరు. ఆయన చిత్తూరు, తిరుపతి జిల్లాలో పలువురు రైతులకు వాటర్‌ పాయింట్లను ఈ పద్ధతిని అనుసరించే ఏర్పాటు చేశారు. ఆయన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పొలవరానికి చెందిన వారు. సుబ్బారెడ్డి నీటిని కనుగొనడానికి కొబ్బరికాయ లేదా వై ఆకృతిలోని వేప కర్ర లేదా కానుగ కర్ర, వాటర్‌ బాటిల్‌ని ఉపయోగిస్తారు. కొబ్బరి పీచులు వేళ్ల వైపు ఉండేలా కొబ్బరికాయను అరచేతిలో ఉంచుతారు. పొలంలో అలా చేతిలో కొబ్బరికాయ పెట్టకుని వెళ్తున్నప్పుడూ ఎక్కడ కొబ్బరికాయ నిటారుగా నిలబడితే అక్కడ నీటి జాడ ఉందని నమ్ముతారు.

అదికాకపోతే అరచేతిలో వై ఆకారంలో ఉన్న వేప ఆకులతో ముందుకు వెళ్తారు. నీటి జాడ ఉన్న చోట పుల్ల పైకి లేస్తుంది లేదా మరీ ఎక్కువగా ఉంటే గిరిగిర తిరుగుతుంది. అదే నీళ్ల చెంబు పద్ధతి అయితే నీరు ఎక్కడ పక్కకు ఒరిగితే అక్కడ నీళ్లు వస్తాయని సురేందర్‌ రెడ్డి చెబుతున్నారు. ఇలానే ఎన్నో బోర్లు వేయించానని, ఈ పద్ధతిని తానే సొంతంగా నేర్చుకున్నట్లు తెలిపారు. కొబ్బరికాయను బట్టి నీరు ఎన్ని అడుగుల్లో ఉందో చెప్పేయొచ్చు అని అన్నారు. జియాలజిస్టులు యంత్రాల సాయంతో తనిఖీ చేసినా ఎంత నీరు పడుతుందనేది కచ్చితంగా చెప్పలేరని అన్నారు.

తాను నీటి జాడను గుర్తించిన ప్రతి చోటు 99 శాతం విజయవంతమయ్యాయని సురేందర్‌ రెడ్డి ధీమాగా చెబుతున్నారు. నీళ్లు ఉన్నప్పుడు ఇన్ని అడుగుల దగ్గర పుల్ల లేస్తుంది అనుకుంటాం. పుల్ల కానీ, టెంకాయ గానీ పైకి లేస్తుంది. రెండు మూడు లైన్లు కలిసే చోట ఎక్కువ తిరుగుతుంది. ఒక లైను పోయే చోట లేచి నిల్చుకుంటుంది. దీంతో ఇక్కడ జంక్షన్ ఉంది. ఏ వైపు ఎక్కువ నీళ్లు వస్తాయని అంచనాకు వస్తాం. మరీ ఫోర్స్‌గా లేస్తే ఎక్కువ నీళ్లు ఉంటాయి. మూడు లేదా నాలుగు అంగుళాలు పడతాయి. ఒక్కో చోట ఒకే లైన్ అయినా కూడా ఎక్కువ నీళ్లు వస్తాయన్నారు సురేందర్ రెడ్డి.

శాస్త్రీయ పద్ధతిలోనే కనిపెట్టగలం..
కొబ్బరి వేపపుల్ల, వాటర్‌ బాటిళ్లతో నీటి జాడలను గుర్తించే పద్ధతులను అశాస్త్రీయమైనవని తిరుపతికి చెందిన జియాలజిస్టు, భూగర్భ జల మైనింగ్‌ కన్సల్టెంట్‌ సుబ్బారెడ్డి చెబుతున్నారు. టెంకాయ కాకుండా ఉత్తరేణిపుల్ల, వేప పుల్ల, రేగి చెట్టు పుల్ల, లాంటి వాటితో కూడా నీటిజాడలను గుర్తిస్తారు. వీటిని అశాస్త్రీయమైనవిగా పరిగణించాలన్నారు. అంతేగాదు కొందరి చేతుల్లో నీటి రేఖ ఉందని, తమ కలలో దేవుడు కనిపించి చెప్పాడని అంటుంటారు కానీ అవన్నీ సరైన పద్ధతులు కావని తేల్చి చెప్పారు.

కేవలం శాస్త్రీయ పద్ధతుల్లోనే నీటి జాడను కచ్చితంగా కనిపెట్టగలమని చెప్పారు. నీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పుడూ ఏ పద్ధతిలోనైనా నీరు పడుతుంది. ఛాలెంజింగ్‌ ఏరియాల్లో..వెయ్యి అడుగులు బోరు వేసినా పడని ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి చోట్ల ఈ పద్ధతులు విఫలమయ్యే అవకాశం ఉందని సుబ్బారెడ్డి అన్నారు. అలాంటి చోట భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు బోర్లు వేసి డబ్బులు వృథా చేసుకొవద్దని రైతులకు సూచిస్తామని చెప్పారు. 

శాస్త్రీయ పద్ధతుల్లో కచ్చితత్వం..
భూగర్భంలో నీటి జాడలను కనిపెట్టడంలో శాస్త్రీయ పద్ధతులు సమర్థవంతంగా పనిచేస్తాయని సుబ్బారెడ్డి చెబుతున్నారు. భూగర్భ జలాల జాడను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నా శాస్త్రీయ పద్ధతుల్లో ఎలక్ట్రికల్‌ రెసిస్టివిటీ సర్వే ఒకటి అని సుబ్బారెడ్డి చెబుతున్నారు. ఎలక్ట్రికల్‌ రెసిస్టివిటీ మీటర్‌ ద్వారా పరిశీలిస్తే..భూమి పొరలుగా ఉన్నట్లు కనిపిస్తుంది. రాళ్లు మట్టి కలిసి ఉంటాయి.

భూమి పొరల రెసిస్టివిటీని  అంచనావేసి నీటి జాడను నిర్థారిస్తాం అని సుబ్బారెడ్డి తెలిపారు. పూర్వీకుల నుంచే నీటి జాడలు కనిపెట్టే ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు. భూమి భౌగోళిక లక్షణాల ప్రకారం కొందరూ నీటి జాడను అంచనా వేయగలరని చెప్పారు. 

వరహ మిహరుడు గ్రంథంలో నీటి అన్వేషణ..
భూగర్భ జల వనరులను ఎలా గుర్తించాలో వరాహ మిహిరుడు ఒక గ్రంథాన్ని రాశాడు. నీటి అన్వేషణ కోసం చెప్పిన టెక్నిక్‌లో బయో ఇండికేటర్లు గురించి కూడా ప్రస్తావించారు. నీరు ఉన్నచోట ఉడగ, రెల్ల, మద్ది, తంగేడు వంటి చెట్లు గుంపులుగా ఉంటాయని పూర్వీకులు ప్రగాఢంగా నమ్మేవారు. దీన్ని ఆధారం చేసుకునే భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు సైతం నీరు పడే అవకాశాలను చెబుతారని అన్నారు. నీటి కుంటలు ఉండే చోట కూడా నీరు పడుతుందని నిరూపితమైంది. జియాలజిస్ట్‌లు సైంటిఫిక్‌ పద్ధతుల తోపాటు వీటిని కూడా పరిగణలోని తీసుకుంటారని చెప్పారు. 

ఇక్కడ అనుభవం కీలకం...
చిత్తూరు జిల్లాలో ఒక ప్రాంతంలో బోర్ పాయింట్‌ని గుర్తించాలంటే.. జిల్లాలో ఎంత లోతులో నీరు పడుతుందో, ఏ వైపు సర్వే చేస్తే బాగుంటుందో అవగాహన ఉండాలి. నేను పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి, అది నాకు సులభం. అదే కొత్త ప్రాంతమైతే.. అక్కడి జియాలజిస్ట్ కమాండింగ్ చేస్తున్నాడు. అక్కడ నాకంటే ఆయనే ఎక్కువ విజయాలు సాధిస్తారు అని సుబ్బారెడ్డి అన్నారు.

కొన్నిసార్లు ఆయా ప్రాంతాల్లో ఏపుగా పెరిగిన వేప చెట్లను కూడా పరిగణలోనికి తీసుకుని చెబుతారు. దీన్ని జీవ సూచికగా పరిగణిస్తారు. “వేప చెట్టు ఆరోగ్యంగా ఉండి, దాని కొమ్మలు మరియు ఆకులు ఒక వైపుకు వంగి ఉంటే... అటువంటి ప్రాంతాల్లో ఎక్కడో ఒక నీటి కాలువ ఉందని సూచిస్తుంది. అటువంటి ప్రాంతంలో పరికరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ముఖ్యం. ఇది ఆ ప్రాంతంలోని జియాలజిస్ట్ పరిజ్ఞానం, అనుభవంపై ఆధారపడి ఉంటుంది, ”అని సుబ్బారెడ్డి చెబుతున్నారు.

కొన్నిసార్లు రాతి నిర్మాణాలు చాలా సవాలుగా ఉంటాయని, అలాంటి చోట భూగర్భ శాస్త్రవేత్తలు మాత్రమే నీటి వనరులను గుర్తించగలరని ఆయన అన్నారు. భూగర్భ జలాలను గుర్తించే సాంకేతికత 1910 నుంచి అభివృద్ధి చెందుతోందని, విమానంలో ప్రయాణిస్తూ కూడా నీటి జాడలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి సర్వేలు అందుబాటులో ఉన్నాయని సుబ్బారెడ్డి చెబుతున్నారు. 

(చదవండి: 130 వేల ఏళ్ల నుంచే మానవుల ఉనికి! వెలుగులోకి విస్తుపోయే విషయాలు!)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement