వేదాల్లో సైన్సుకు అందని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని ప్రముఖ వేద పండితులు డాక్టర్ చిర్రావూరి శ్రీరామశర్మ తెలిపారు.
- మానవాళికి వేదాలు ఎంతో అవసరం
- డాక్టర్ చిర్రావూరిశ్రీరామశర్మ
- ఘనంగా వేద పండిత సభ
- 80 మంది ఘనాపాఠీలకు సత్కారం
గోపాలపట్నం: వేదాల్లో సైన్సుకు అందని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని ప్రముఖ వేద పండితులు డాక్టర్ చిర్రావూరి శ్రీరామశర్మ తెలిపారు. ప్రహ్లాదపురంలో శనివారం నిర్వహించిన వడలి ఆంజనేయశర్మ వేద థార్మిక ట్రస్ట్ సప్తమ వార్షిక వేద విద్వాంసుల సభలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన 80 మంది ఘనాపాఠీలను ఘనంగా సత్కరించారు. సభలో శ్రీరామశర్మ మాట్లాడుతూ మానవాళికి, శాస్త్రసాంకేతికాభివృద్ధికి వేదాలు అవసరమన్న వాస్తవాన్ని శాస్త్రవేత్తలే చెబుతున్నారని, ఇది ఎవరూ కాదనలేని సత్యమన్నారు.
ఆయురారోగ్యాలతో సమాజం బాగుండాలంటే వేదాన్ని కచ్చితంగా పోషించాల్సిందేనని స్పష్టం చేశారు. వివాహాలు, ఆలయాల్లో శంకుస్థాపనలకు మాత్రమే వేదాలు పరిమితం కాకూడదని, యావత్ జగత్తుకు ఉపయోగపడాలన్నారు. డాక్టర్ విశ్వనాథ గోపాలకృష్ణ ప్రసంగిస్తూ వేదాలు సమస్త లోకానికీ ప్రధానమని, దీన్ని తెలుసుకుంటే జీవితాన్ని అధిగమించవచ్చని చెప్పారు.
ఆది శంకరాచార్య వేదాల వల్లే భగవంతుని శక్తి పొందారని తెలిపారు. తన తర్క వ్యాకరణాన్ని ఘనాపాఠీలకు వివరించారు. ఘనాపాఠీ దువ్వూరి సర్వేశ్వర సోమయాజులు వేదస్వస్తి, ఘనస్వస్తి, మహదాశీర్వచనం చేశారు. సభలో రిటైర్డు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పిట్ల రామారావును సత్కరించారు.
వేదశాస్త్ర థార్మిక ట్రస్ట్ వ్యస్థాపకులు వడలి ఆంజేయశర్మను పండితులు అభినందించా రు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి వి.సూర్యనారాయణ, కోశాధికారి ఎస్.శ్రీధర్, గాయత్రీ గ్రూప్ సంస్థల చైర్మన్ కె.వి.బాలసుబ్రహ్మణ్యం, సిహెచ్.లక్ష్మీనారాయ ణ, కె.వి.రమణశర్మ, ఎ.ఎ.ఎస్.సత్యనారాయణ పాల్గొన్నారు.