శాస్త్రమా.. చిత్రమా..?
విశ్వం అంచుల్ని చూసే టెలిస్కోపులున్నాయి... సుదూర గ్రహాలను చేరే రాకెట్లూ నడుపుతున్నాం...! గంటల్లో భూమి ఒక చివరి నుంచి మరో అంచుకు చేరుకోగలుగుతున్నాం...! సైన్స్ టెక్నాలజీ అంతగా అభివద్ధి చెందింది.. చెందుతోంది! అయితే.. మనిషి ఇప్పటికీ విప్పలేని మిస్టరీలు ఇంకా మిగిలే ఉన్నాయని... అవి కూడా గ్రహాలు, నక్షత్రాలవి కాకుండా...మన శరీరానికి సంబంధించినవని అంటే...మీరు ఆశ్చర్యపోరా...ముక్కున వేలేసుకోరా?
జీవితంలో మూడొంతుల కాలం నిద్రలోనే గడిచిపోతుంది. కొందరు రోజుకు తొమ్మిది గంటలు నిక్షేపంగా నిద్దరోతే... ఇంకొందరు నాలుగు గంటలు కళ్లుమూసుకున్నా... రోజంతా హుషారుగా గడిపేస్తారు. ఐన్‌స్టీన్ లాంటి మేధావి... నిద్దర దండగమారి పని అని నిష్టూరమాడినా... మనకు మాత్రం కునుకుతీయనిదే తెల్లారదు. ఎందుకిలా? రోజూ ఎందుకు నిద్రపోవాలి? పోకపోతే ఏమవుతుంది? మనిషి సరే.. జంతువులన్నీ మనలాగే నిద్దరోతున్నాయా? ఈ ప్రశ్నల సమాధానాలు మనకే కాదు... శాస్త్రవేత్తలకూ తెలియవు. శరీరం తనను తాను మరమ్మతు చేసుకునేందుకు నిద్ర పనికొస్తుందని కొందరు అంటూంటే... ఎప్పుడో జంతువుల్లా ఉన్నప్పుడు శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఇది ఒక సాధనంగా ఉపయోగపడిందని మరికొందరు అంటారు. ఏది ఏమైనప్పటికీ ఏరోజైనా మనం పడుకోవడం గంట ఆలస్యమైందనుకోండి. కళ్లు మూతలు పడటం మొదలవుతుంది. ఒకదాని వెంట ఒకటి ఆవలింతలూ పలకరించడం మొదలవుతుంది. నిద్ర తక్కువైతే ఆవలింతలు వస్తాయా? ఆవలింతలు వచ్చినప్పుడు నిద్ర వస్తుందా? ఇదీ ఓ మిస్టరీనే!
11 రోజుల 24 నిమిషాలు...
కాలిఫోర్నియాకు చెందిన రాండీ గార్డనర్ నిద్రలేకుండా గడిపిన సమయమిది. 1965లో ఇది గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. అంత సుదీర్ఘ కాలం మేలుకున్న తరువాత కూడా గార్డనర్ కేవలం 14 గంటల 40 నిమిషాలు మాత్రమే నిద్రపోయి మామూలుగా నిద్రలేచాడు.
మీకు తెలుసా...?
కంటినిండా కునుకుతీస్తే ఒళ్లు నాజూకుగా ఉంటుంది. ఆకలి, బరువు పెరగడాన్ని నియంత్రించే హార్మోన్లు, రసాయనాలు నిద్రలోనే విడుదలవడం దీనికి కారణం!
బుర్ర వేడెక్కితే... ఆవలింత!
కడుపులో ఉన్న పసిగుడ్డు కూడా అప్పుడప్పుడూ నోరు బార్లా తెరిచి ఆవలిస్తుందట! నిద్రముంచుకు వస్తున్నా... బోర్ కొడుతున్నా ఒకట్రెండు ఆవలింతలు పలకరించడం కద్దు. ఇవి మనకే కాదు... కుక్కలు, పిల్లులతోపాటు, చేపలు, పాములకూ అలవాటైన విషయమే. చిత్రమైన విషయమేమిటంటే.. దీనికి కారణమేమిటన్నది తెలియకపోవడం. నిన్నమొన్నటివరకూ ఒక అపోహ ఉండేది.. ఆవలిస్తే మెదడుకు ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ లభిస్తుందని, తద్వారా మనం పూర్తి మెలకువ సాధిస్తామని అనుకునేవారు. తాజాగా శాస్త్రవేత్తలు చెబుతున్నదేమింటే.. ఇదంతా ఒట్టిదేనని. వేడెక్కిపోయిన మెదడును కొంతవరకూ చల్లబరచడం ఆవలింతల పరమార్థమని వీరు అంటున్నారు. ఆవలింతకు ముందు ఎలుకల మెదడు ఉష్ణోగ్రతలు కొద్దిగా ఎక్కువగా ఉండటం.. ఆ తరువాత వెంటనే తగ్గిపోవడం తాము గమనించామని స్టీఫెన్ పాటెక్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. 2007లో గాలప్ అనే శాస్త్రవేత్త ఇంకో ప్రయోగం చేశారు. నుదుటిపై చల్లటి ప్యాకెట్‌ను ఉంచుకున్న వారికంటే.. వేడి ప్యాకెట్ ఉంచుకున్న వారు... ఎక్కువ సార్లు ఆవలించారన్నది దీని సారాంశం.
మీకు తెలుసా...?
- 20 వారాల పిండం కూడా ఆవలించగలదు.
- ఆవలింతకు పట్టే సమయం 6 సెకన్లు మాత్రమే!
- వయసు పెరిగే కొద్దీ ఆవలింతల సంఖ్య తగ్గుతుంది!
- ఆవలించే వారిని చూస్తే మనకూ ఆవలింతలు వస్తాయి!
వేలిముద్రల మతలబు ఏంటి?
ఏక చక్రం మహాభోగే... ద్విచక్రే రాజపూజిత.. త్రి చక్రే లోక సంచారి.. ఎప్పుడో చిన్నప్పుడు విన్న మాటలివి. నిజం కాదనీ తెలుసు. వేలిముద్రల్లోని చక్రాలు మన లక్షణాలను నిర్ధారించగలిగితే కష్టపడకుండానే అన్నీ దక్కేస్తాయి కదా! మరి... చేతులు, కాళ్ల వేళ్లపై మాత్రమే కనిపించే ముద్రలు మనకెందుకున్నట్లు? ఏమో... మాకేం తెలుసు? అన్నది శాస్త్రవేత్తల సమాధానం. మాంఛెస్టర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఐదేళ్ల క్రితం జరిపిన ఓ ప్రయోగం ప్రకారం.. వేలిముద్రలు పట్టు కోసం కాకుండా రాపిడిని తగ్గించేందుకు పనికొస్తాయిట! వేలిముద్రల మధ్య ఉండే తగ్గు ప్రాంతాలు.. మనం పట్టుకునే వస్తువుకు నేరుగా తగలకుండా ఉంటాయి కాబట్టి రాపిడి తగ్గుతుందని వీరు కత్రిమ వేలిముద్రలతో చేసిన ప్రయోగం ద్వారా తెలిసింది. కొందరేమో స్పర్శ అనుభూతికి ఈ ముద్రలే కీలకమని అంటారు. వేలిముద్రల ద్వారా అందే సమాచారాన్ని నాడీవ్యవస్థ సులువుగా ప్రాసెస్ చేయగలదని వీరు అంటున్నారు. ఊహూ... వస్తువులను గట్టిగా పట్టుకునేందుకు ఇవి ఉపయోగపడతాయన్న పాతకాలం అంచనానే కరెక్ట్ అంటారా? ఏమో.. ఐతే కావచ్చు!
మీకు తెలుసా...?
- రంగు, రూపులన్నీ ఒకేలా ఉన్న కవలల్లోనూ
- వేలిముద్రలు మాత్రం భిన్నంగా ఉంటాయి.
- వేలిముద్రల్లేని వ్యక్తులు ఈ ప్రపంచం మొత్తమ్మీద
- కేవలం నాలుగు కుటుంబాల్లో మాత్రమే ఉన్నారు.
మీ 'చేతివాటం' ఏది?
సచిన్ టెండుల్కర్... బరాక్ ఒబామా... బిల్‌గేట్స్. ఈ ముగ్గురిలో కామన్ ఏమిటో తెలుసా? అందరూ ఎడమచేతి వాటమున్న వాళ్లే! ఆ మాటకొస్తే ఈ భూమ్మీద కనీసం 70 కోట్ల మంది అంటే.. పది శాతం మంది ఇలాంటివారే. జంతువుల లక్షణాల్లో కొన్ని మనకు వచ్చి ఉండవచ్చుగానీ... వాటిల్లా రెండు చేతులను సమంగా వాడటం మాత్రం మనకబ్బలేదు. దాదాపు అన్నిపనులకూ ఒక చేయిని వాడటం అలవాటైపోయింది. అయితే ఏంటి అంటున్నారా? ఎందుకిలా? అన్నదే ప్రశ్న. జన్యువుల్లోని తేడాల వల్ల ఇలా జరుగుతుందని కొందరు శాస్త్రవేత్తలు అంటారు. ఇదే నిజమని కాసేపు అనుకుంటే.. వచ్చే లాభమేమిటి? అన్న ప్రశ్న వస్తుంది. అది కూడా కేవలం పదిశాతం మంది మనుషుల్లోనే ఎందుకుంది? అన్నది మరో ప్రశ్న. అన్నీ సమాధానం లేని ప్రశ్నలే. అయితే... కొందరు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. చేతివాటానికి కారణమైన జన్యుమార్పు.. ఒక అవశేషం మాత్రమే. కాలక్రమంలో నెమ్మదిగా ఇది మరింత తగ్గిపోతుంది. అంటే.. ఓ వందేళ్ల తరువాత ఎడమ చేతివాటమున్న వాళ్లు మరింత తక్కువవుతారన్నమాట.
మీకు తెలుసా...?
- మేధావుల్లో 20 శాతం మంది ఎడమచేతి వాటం ఉన్నవారు.
- పసిపిల్లలు బోర్లా పడుకున్నప్పుడు తల ఎడమవైపు తిప్పితే వాళ్లు ఎడమచేతివాటమున్న వారిగా ఎదుగుతారు!
- ఆగస్టు 13.. ఎడమ చేతివాటం వారి ప్రత్యేకమైన రోజు!