Yawn
-
నములుతూ నడిస్తే.. ప్రయోజనమెక్కువ!
వాకింగ్ చేస్తూ బబుల్ గమ్ నములుతూండటం ఆరోగ్యానికి కొంతవరకూ మేలు చేస్తుందని అంటున్నారు టోక్యోలోని వాసెడా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. నడుస్తూ బబుల్గమ్ తినడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరగడంతోపాటు శరీరంలో శక్తి ఎక్కువగా ఖర్చవుతుందని వీరు అంటున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు తాము 21 – 69 మధ్య వయస్కులతో ప్రయోగం నిర్వహించామని చెప్పారు. వీరికి రెండు బబుల్గమ్స్ ఇచ్చి ముందుగా గంటసేపు విశ్రాంతి కల్పించామని ఆ తరువాత పదిహేను నిమిషాలపాటు బబుల్గమ్స్ నములుతూ నడవమని సూచించామని.. ఇదే సమయంలో ఇంకొంతమందికి బబుల్గమ్ కాకుండా అదే పదార్థాలతో చేసిన ఇంకో తినుబండారం ఇచ్చామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు వివరించారు. రెండు గ్రూపుల్లోని వారిని పరిశీలించినప్పుడు బబుల్గమ్ తినేవారు నడిచే వేగం, దూరం పెరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఒక్కో అంగలో కొంచెం ఎక్కువ దూరం వేయడం వల్ల ఇలా జరిగిందని చెప్పారు. అలాగే గుండెకొట్టుకునే సగటు వేగం కూడా బబుల్గమ్ తినేవారిలో కొంచెం ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందన్నారు. వయసు, స్త్రీయా, పురుషుడా? వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నా ఫలితాల్లో మార్పులేమీ లేకపోవడంతో బబుల్‌గమ్‌లు నములుతూ నడవడం వల్లనే ఈ మార్పులు చోటు చేసుకున్నట్టు నిర్ధారించుకున్నామని వివరించారు. మధ్యవయసు వారిపై ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని.. ఈ నేపథ్యంలో ఆరోగ్యం కోసం వ్యాయామం చేసే వారు మరింత ఎక్కువ ఫలితాన్ని సాధించేందుకు తగిన బబుల్‌గమ్‌ను ఉపయోగించడం ఒక మార్గమవుతుందనేది తమ అంచనా అని చెప్పారు. ఆవలింతలు.. అంటుకుంటాయా? చిన్నప్పటి నుంచి చాలాసార్లు విని ఉంటాం.. చూసి ఉంటాం కూడా. ఒకరికి ఆవలింతలు వస్తే చాలు.. చుట్టూ ఉన్న వారు ఒకొక్కరికీ వెంటవెంటనే ఆవలింతలు వచ్చేస్తూంటాయి. ఇది అక్షరాలా నిజమే అయినప్పటికీ ఎందుకిలా జరుగుతుందో మాత్రం ఇప్పటికీ కచ్చితంగా తెలియదు. తెలుసుకునే ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయని అంటున్నారు టెక్సస్ ఏ అండ్ ఎమ్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన మెరిడిత్ విలియమ్సన్. బహుశా ఇది మాటల్లేని సమాచార ప్రసారం కావచ్చునని... అందుకే ఇది కేవలం మనుషుల్లోనే కాకుండా కొన్ని రకాల జంతువుల్లోనూ కనిపిస్తూంటుందని వివరించారు. ఇతరులపట్ల సహానుభూతి ఎక్కువగా ఉన్నవారు ఇతరుల ఆవలింతలకు ఎక్కువగా స్పందిస్తూంటారని.. మిగిలినవారు.. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం తక్కువగా స్పందిస్తారని ఆమె వివరించారు. అలాగే నాలుగేళ్లలోపు పిల్లలు, వయసుమళ్లిన వారు కూడా ఇతరుల ఆవలింతలకు స్పందించరని చెప్పారు. మద్యానికి.. గుండెపోటుకు ఇంకో కొత్త లింకు! అతిగా మద్యం తాగితే జబ్బులు గ్యారెంటీ. మిగిలిన వాటి సంగతేమోగానీ.. గుండెజబ్బుల విషయంలో మాత్రం మద్యంతోపాటు మన శరీరంలో ఉండే ఓ జన్యువు కీలకపాత్ర పోసిస్తున్నట్లు బ్రిటన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. టిటిన్ అని పిలిచే ఈ జన్యువు గుండె కండరం సంకోచ వ్యాకోచాలు సక్రమంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని.. మద్యం తాగినప్పుడు మాత్రం ఈ జన్యువు సక్రమంగా పనిచేయకుండా గుండెజబ్బులు వచ్చే అవకాశాలను పెంచుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆల్కహాలిక్ కార్డియో మయోపతీ వ్యాధికి గురైన కొంతమందిపై తాము పరిశీలన జరిపినప్పుడు టిటిన్ పాత్ర గురించి తెలిసిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ జేమ్స్ వేర్ తెలిపారు. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం వారానికి 70 కంటే ఎక్కువ యూనిట్ల వైన్ తాగే వారికి ఆల్కహాలిక్ కార్డియో మయోపతి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతూ కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంగానూ మారుతుందని జేమ్స్ చెప్పారు. తాము పరిశీలించిన వారిలో దాదాపు 13.5 శాతం మందిలో టిటిన్ జన్యువు మార్పులకు గురైనట్లు తెలిసిందని వివరించారు. దీన్నిబట్టి మద్యం జన్యువులపై ప్రభావం చూపుతుందని మరింత స్పష్టంగా అర్థమవుతోందని.. ఒకవేళ ముందుగానే కొన్ని జన్యుమార్పులున్న వారు మద్యానికి బానిసలైతే.. గుండెజబ్బులు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువవుతాయన్నది తమ పరిశోధనల సారాంశమని తెలిపారు. ఆల్కహాలిక్ కార్డియో మయోపతి వ్యాధికి గురైన వారి కుటుంబ సభ్యులు తమ పరిస్థితిని మరోసారి బేరీజు వేసుకోవాలని... జన్మతహా టిటిన్ జన్యువులో మార్పులు ఉంటే వీరు తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశముంటుందని వివరించారు. -
బ్రెయిన్ సైజ్‌కు దానికి సంబంధం!
న్యూయార్క్: బ్రెయిన్ సైజ్ ఎంతో తెలుసుకోవాలంటే ఎంతపెద్దగా(ఎంత ఎక్కువ సమయం) ఆవులింత వస్తుందో తెలుసుకుంటే సరిపోతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ శాస్త్రవేత్తలు సుమారు 29 రకాల క్షీరదాల ఆవులింతలను పరిశీలించి ఈ విషయాన్ని నిర్థారించారు. జీవుల్లో ఎంత అంతపెద్ద బ్రెయిన్ ఉంటే అంత ఎక్కువ సమయం ఆవులింత వస్తుందని వారు తెలిపారు. మెదడు బయటిపొరలోని నాడీకణాల సంఖ్య, బ్రెయిన్ సైజ్ ఈ రెండూ ఆవులింత పరిమాణాన్ని నిర్ణయిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉదాహారణకు గొరిల్లాలు, గుర్రాలు, ఆఫ్రికన్ ఏనుగుల ఆవులింతల పరిమాణం చిన్నగా ఉంటుందని, దీనికి కారణం శరీర పరిమాణంతో పోల్చినప్పుడు మన మెదడు పరిమాణం కంటే వాటి మొదడు పరిమాణం ఉండాల్సిన స్థాయిలో ఉండకపోవడమే అని వెల్లడించారు. ఆవులింత ఎంతపెద్దగా వస్తుందనే విషయం శరీరం ఎంతపెద్దగా ఉందనేదానిపై కాకుండా మెదడు ఎంతపెద్దగా ఉందనే విషయంపై ఆదారపడుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన ఆండ్రూ గాల్లప్ తెలిపారు. -
ఆవలింత పెద్దదైతే మెదడు కూడా పెద్దదే!
న్యూయార్క్: ఆవలింతలు, మెదడు పరిమాణాల మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 29 రకాల క్షీరదాలపై పరిశోధన చేసి వారు ఈ విషయం తేల్చారు. ఒక్కో ఆవలింత సమయం ఎక్కువగా ఉంటే, వాటి మెదడు పెద్దగా ఉన్నట్లట. అమెరికాలోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ వారు పరిశోధనలో క్షీరదాల ఆవలింతల సగటు సమయాన్ని నమోదు చేశారు. మెదళ్ల బరువును ముందుగానే తీసుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. మెదడు బరువుతోపాటు, వల్కలం అనే భాగంలోని నాడీ కణాల సంఖ్యమీద ఆధారపడి ఆవలింత సమయం ఉంటుందన్నారు. -
వాళ్లు ఆవలించరట..!
పరిపరి... శోధన ఆవలింతకు అంటుకునే లక్షణం ఉందంటారు కానీ, వాళ్లకు అదేమీ అంటుకోదట! ఎదుటనున్న మనిషి ఎంతగా నోరారా ఆవలించినా, వాళ్లకు ఎలాంటి ఆవలింతలూ రావట! అందువల్ల వాళ్ల ఎదుట ఎంతమంది కునికిపాట్లు పడుతూ, ఆవలింతలు తీస్తున్నా, వాళ్లు మాత్రం నిక్షేపంగా నిర్నిమేషంగా ఉండగలరట! ఇంతకీ వాళ్లెవరనేనా మీ సందేహం? వాళ్లూ మనుషులే! కాకపోతే, లెక్కలకందని తిక్క మోతాదుకు మించి ఉన్నవాళ్లు వాళ్లు. మతిస్థిమితం సక్రమంగా లేనివారిపై ఎదుటివారి ఆవలింతలు ఎలాంటి ప్రభావం చూపలేవని టెక్సాస్‌లోని బేలర్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా ఈ అంశంపై పరిశోధనలు సాగించిన ఈ పరిశోధకులు ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించారు. వివిధ మానసిక లక్షణాలు గల 135 మంది విద్యార్థులపై వరుస అధ్యయనాలు నిర్వహించి మరీ ఈ మేరకు నిర్ధారణకు వచ్చామని వారు చెబుతున్నారు. స్కిజోఫ్రీనియా వంటి తీవ్రమైన మానసిక వ్యాధులు ఉన్నవారు ఎదుటివారి ఆవలింతలకు ఏమాత్రం స్పందించలేదని వెల్లడించారు. -
శాస్త్రమా.. చిత్రమా..?
విశ్వం అంచుల్ని చూసే టెలిస్కోపులున్నాయి... సుదూర గ్రహాలను చేరే రాకెట్లూ నడుపుతున్నాం...! గంటల్లో భూమి ఒక చివరి నుంచి మరో అంచుకు చేరుకోగలుగుతున్నాం...! సైన్స్ టెక్నాలజీ అంతగా అభివద్ధి చెందింది.. చెందుతోంది! అయితే.. మనిషి ఇప్పటికీ విప్పలేని మిస్టరీలు ఇంకా మిగిలే ఉన్నాయని... అవి కూడా గ్రహాలు, నక్షత్రాలవి కాకుండా...మన శరీరానికి సంబంధించినవని అంటే...మీరు ఆశ్చర్యపోరా...ముక్కున వేలేసుకోరా? జీవితంలో మూడొంతుల కాలం నిద్రలోనే గడిచిపోతుంది. కొందరు రోజుకు తొమ్మిది గంటలు నిక్షేపంగా నిద్దరోతే... ఇంకొందరు నాలుగు గంటలు కళ్లుమూసుకున్నా... రోజంతా హుషారుగా గడిపేస్తారు. ఐన్‌స్టీన్ లాంటి మేధావి... నిద్దర దండగమారి పని అని నిష్టూరమాడినా... మనకు మాత్రం కునుకుతీయనిదే తెల్లారదు. ఎందుకిలా? రోజూ ఎందుకు నిద్రపోవాలి? పోకపోతే ఏమవుతుంది? మనిషి సరే.. జంతువులన్నీ మనలాగే నిద్దరోతున్నాయా? ఈ ప్రశ్నల సమాధానాలు మనకే కాదు... శాస్త్రవేత్తలకూ తెలియవు. శరీరం తనను తాను మరమ్మతు చేసుకునేందుకు నిద్ర పనికొస్తుందని కొందరు అంటూంటే... ఎప్పుడో జంతువుల్లా ఉన్నప్పుడు శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఇది ఒక సాధనంగా ఉపయోగపడిందని మరికొందరు అంటారు. ఏది ఏమైనప్పటికీ ఏరోజైనా మనం పడుకోవడం గంట ఆలస్యమైందనుకోండి. కళ్లు మూతలు పడటం మొదలవుతుంది. ఒకదాని వెంట ఒకటి ఆవలింతలూ పలకరించడం మొదలవుతుంది. నిద్ర తక్కువైతే ఆవలింతలు వస్తాయా? ఆవలింతలు వచ్చినప్పుడు నిద్ర వస్తుందా? ఇదీ ఓ మిస్టరీనే! 11 రోజుల 24 నిమిషాలు... కాలిఫోర్నియాకు చెందిన రాండీ గార్డనర్ నిద్రలేకుండా గడిపిన సమయమిది. 1965లో ఇది గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. అంత సుదీర్ఘ కాలం మేలుకున్న తరువాత కూడా గార్డనర్ కేవలం 14 గంటల 40 నిమిషాలు మాత్రమే నిద్రపోయి మామూలుగా నిద్రలేచాడు. మీకు తెలుసా...? కంటినిండా కునుకుతీస్తే ఒళ్లు నాజూకుగా ఉంటుంది. ఆకలి, బరువు పెరగడాన్ని నియంత్రించే హార్మోన్లు, రసాయనాలు నిద్రలోనే విడుదలవడం దీనికి కారణం! బుర్ర వేడెక్కితే... ఆవలింత! కడుపులో ఉన్న పసిగుడ్డు కూడా అప్పుడప్పుడూ నోరు బార్లా తెరిచి ఆవలిస్తుందట! నిద్రముంచుకు వస్తున్నా... బోర్ కొడుతున్నా ఒకట్రెండు ఆవలింతలు పలకరించడం కద్దు. ఇవి మనకే కాదు... కుక్కలు, పిల్లులతోపాటు, చేపలు, పాములకూ అలవాటైన విషయమే. చిత్రమైన విషయమేమిటంటే.. దీనికి కారణమేమిటన్నది తెలియకపోవడం. నిన్నమొన్నటివరకూ ఒక అపోహ ఉండేది.. ఆవలిస్తే మెదడుకు ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ లభిస్తుందని, తద్వారా మనం పూర్తి మెలకువ సాధిస్తామని అనుకునేవారు. తాజాగా శాస్త్రవేత్తలు చెబుతున్నదేమింటే.. ఇదంతా ఒట్టిదేనని. వేడెక్కిపోయిన మెదడును కొంతవరకూ చల్లబరచడం ఆవలింతల పరమార్థమని వీరు అంటున్నారు. ఆవలింతకు ముందు ఎలుకల మెదడు ఉష్ణోగ్రతలు కొద్దిగా ఎక్కువగా ఉండటం.. ఆ తరువాత వెంటనే తగ్గిపోవడం తాము గమనించామని స్టీఫెన్ పాటెక్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. 2007లో గాలప్ అనే శాస్త్రవేత్త ఇంకో ప్రయోగం చేశారు. నుదుటిపై చల్లటి ప్యాకెట్‌ను ఉంచుకున్న వారికంటే.. వేడి ప్యాకెట్ ఉంచుకున్న వారు... ఎక్కువ సార్లు ఆవలించారన్నది దీని సారాంశం. మీకు తెలుసా...? 20 వారాల పిండం కూడా ఆవలించగలదు. ఆవలింతకు పట్టే సమయం 6 సెకన్లు మాత్రమే! వయసు పెరిగే కొద్దీ ఆవలింతల సంఖ్య తగ్గుతుంది! ఆవలించే వారిని చూస్తే మనకూ ఆవలింతలు వస్తాయి! వేలిముద్రల మతలబు ఏంటి? ఏక చక్రం మహాభోగే... ద్విచక్రే రాజపూజిత.. త్రి చక్రే లోక సంచారి.. ఎప్పుడో చిన్నప్పుడు విన్న మాటలివి. నిజం కాదనీ తెలుసు. వేలిముద్రల్లోని చక్రాలు మన లక్షణాలను నిర్ధారించగలిగితే కష్టపడకుండానే అన్నీ దక్కేస్తాయి కదా! మరి... చేతులు, కాళ్ల వేళ్లపై మాత్రమే కనిపించే ముద్రలు మనకెందుకున్నట్లు? ఏమో... మాకేం తెలుసు? అన్నది శాస్త్రవేత్తల సమాధానం. మాంఛెస్టర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఐదేళ్ల క్రితం జరిపిన ఓ ప్రయోగం ప్రకారం.. వేలిముద్రలు పట్టు కోసం కాకుండా రాపిడిని తగ్గించేందుకు పనికొస్తాయిట! వేలిముద్రల మధ్య ఉండే తగ్గు ప్రాంతాలు.. మనం పట్టుకునే వస్తువుకు నేరుగా తగలకుండా ఉంటాయి కాబట్టి రాపిడి తగ్గుతుందని వీరు కత్రిమ వేలిముద్రలతో చేసిన ప్రయోగం ద్వారా తెలిసింది. కొందరేమో స్పర్శ అనుభూతికి ఈ ముద్రలే కీలకమని అంటారు. వేలిముద్రల ద్వారా అందే సమాచారాన్ని నాడీవ్యవస్థ సులువుగా ప్రాసెస్ చేయగలదని వీరు అంటున్నారు. ఊహూ... వస్తువులను గట్టిగా పట్టుకునేందుకు ఇవి ఉపయోగపడతాయన్న పాతకాలం అంచనానే కరెక్ట్ అంటారా? ఏమో.. ఐతే కావచ్చు! మీకు తెలుసా...? రంగు, రూపులన్నీ ఒకేలా ఉన్న కవలల్లోనూ వేలిముద్రలు మాత్రం భిన్నంగా ఉంటాయి. వేలిముద్రల్లేని వ్యక్తులు ఈ ప్రపంచం మొత్తమ్మీద కేవలం నాలుగు కుటుంబాల్లో మాత్రమే ఉన్నారు. మీ 'చేతివాటం' ఏది? సచిన్ టెండుల్కర్... బరాక్ ఒబామా... బిల్‌గేట్స్. ఈ ముగ్గురిలో కామన్ ఏమిటో తెలుసా? అందరూ ఎడమచేతి వాటమున్న వాళ్లే! ఆ మాటకొస్తే ఈ భూమ్మీద కనీసం 70 కోట్ల మంది అంటే.. పది శాతం మంది ఇలాంటివారే. జంతువుల లక్షణాల్లో కొన్ని మనకు వచ్చి ఉండవచ్చుగానీ... వాటిల్లా రెండు చేతులను సమంగా వాడటం మాత్రం మనకబ్బలేదు. దాదాపు అన్నిపనులకూ ఒక చేయిని వాడటం అలవాటైపోయింది. అయితే ఏంటి అంటున్నారా? ఎందుకిలా? అన్నదే ప్రశ్న. జన్యువుల్లోని తేడాల వల్ల ఇలా జరుగుతుందని కొందరు శాస్త్రవేత్తలు అంటారు. ఇదే నిజమని కాసేపు అనుకుంటే.. వచ్చే లాభమేమిటి? అన్న ప్రశ్న వస్తుంది. అది కూడా కేవలం పదిశాతం మంది మనుషుల్లోనే ఎందుకుంది? అన్నది మరో ప్రశ్న. అన్నీ సమాధానం లేని ప్రశ్నలే. అయితే... కొందరు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. చేతివాటానికి కారణమైన జన్యుమార్పు.. ఒక అవశేషం మాత్రమే. కాలక్రమంలో నెమ్మదిగా ఇది మరింత తగ్గిపోతుంది. అంటే.. ఓ వందేళ్ల తరువాత ఎడమ చేతివాటమున్న వాళ్లు మరింత తక్కువవుతారన్నమాట. మీకు తెలుసా...? మేధావుల్లో 20 శాతం మంది ఎడమచేతి వాటం ఉన్నవారు. పసిపిల్లలు బోర్లా పడుకున్నప్పుడు తల ఎడమవైపు తిప్పితే వాళ్లు ఎడమచేతివాటమున్న వారిగా ఎదుగుతారు! ఆగస్టు 13.. ఎడమ చేతివాటం వారి ప్రత్యేకమైన రోజు!