వాళ్లు ఆవలించరట..!
పరిపరి... శోధన
ఆవలింతకు అంటుకునే లక్షణం ఉందంటారు కానీ, వాళ్లకు అదేమీ అంటుకోదట! ఎదుటనున్న మనిషి ఎంతగా నోరారా ఆవలించినా, వాళ్లకు ఎలాంటి ఆవలింతలూ రావట! అందువల్ల వాళ్ల ఎదుట ఎంతమంది కునికిపాట్లు పడుతూ, ఆవలింతలు తీస్తున్నా, వాళ్లు మాత్రం నిక్షేపంగా నిర్నిమేషంగా ఉండగలరట! ఇంతకీ వాళ్లెవరనేనా మీ సందేహం? వాళ్లూ మనుషులే! కాకపోతే, లెక్కలకందని తిక్క మోతాదుకు మించి ఉన్నవాళ్లు వాళ్లు. మతిస్థిమితం సక్రమంగా లేనివారిపై ఎదుటివారి ఆవలింతలు ఎలాంటి ప్రభావం చూపలేవని టెక్సాస్‌లోని బేలర్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
కొన్నేళ్లుగా ఈ అంశంపై పరిశోధనలు సాగించిన ఈ పరిశోధకులు ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించారు. వివిధ మానసిక లక్షణాలు గల 135 మంది విద్యార్థులపై వరుస అధ్యయనాలు నిర్వహించి మరీ ఈ మేరకు నిర్ధారణకు వచ్చామని వారు చెబుతున్నారు. స్కిజోఫ్రీనియా వంటి తీవ్రమైన మానసిక వ్యాధులు ఉన్నవారు ఎదుటివారి ఆవలింతలకు ఏమాత్రం స్పందించలేదని వెల్లడించారు.