ఆకట్టుకుంటున్న స్పైడర్ మ్యాన్ టీచర్!
మెక్సికోః విద్యార్థులకు అర్థమయ్యేట్టు పాఠాలు బోధించడం అంటే అంత సులభం కాదు. అందులోనూ సైన్స్ పాఠాలు బోధించడం ఉపాధ్యాయులకు కత్తిమీద సామే. అందుకే ఓ టీచర్ పాఠాలు చెప్పేందుకు సింపుల్ సొల్యూషన్ కనిపెట్టాడు. విద్యార్థులు పాఠాలు శ్రద్ధగా వినేందుకు, వారిలో అవగాహన పెంచడంతోపాటు పాఠం వినడంలో పిల్లలు నిమగ్నమయ్యేందుకు సైన్స్ ను చక్కగా వివరించేందుకు కొత్త మార్గాన్ని అవలంబించాడు. పాఠం చెప్పేందుకు క్లాస్ రూం కు స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించి వెళ్ళాడు.
క్లాసులో పిల్లలు పాఠాలు శ్రద్ధగా, ఇష్టంగా వినాలంటే టీచర్ చెప్పే విధానం బాగుండాలి. అయితే ఎంతో అనుభవం ఉన్న టీచర్లు కూడ ఒక్కోసారి విద్యార్థులను ఆకట్టుకోవడంలో విఫలమౌతుంటారు. అయితే పిల్లలకు పుస్తకాలంటే బోర్ కొట్టకుండా, పాఠం శ్రద్ధగా వినేందుకు మెక్సికోకు చెందిన 26 ఏళ్ళ సైన్స్ టీచర్.. మోజెస్ వాజ్ క్వెజ్ వినూత్న పద్ధతిలో ప్రయత్నించాడు. వాస్తవ జీవితంలో సూపర్ హీరోలా విద్యార్థులముందు స్పైడర్ మ్యాన్ దుస్తులు ధరించి ప్రత్యక్షమయ్యాడు. కంప్యూటర్ సైన్స్ పట్ల వారిలో ఆసక్తిని రేకెత్తించాడు. మోజెస్ మెక్సికో నేషనల్ అటానమస్ విశ్వవిద్యాలయం (యుఎన్ ఏఎమ్) లో సైన్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ పాఠాలపట్ల విసుగు చెందకుండా ఉండేందుకు మోజెస్ పలు స్పైడర్ మ్యాన్ కామిక్స్ ను ప్రయోగించి పాఠాలు బోధిస్తున్నాడు. పార్ట్ టైం సైన్స్ టీచర్, ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ పీటర్ పార్కర్ స్ఫూర్తితో విద్యార్థులు సూపర్ హీరోగా భావించే స్పైడర్ మ్యాన్ సూట్ ధరించి పాఠాలు చెప్పేందుకు నిర్ణయించుకున్నాడు. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనో, ఉత్తమ శ్రేణి ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకోవాలనో తాను ప్రయత్నించడం లేదని, నిజాయితీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించి, క్లాస్ రూం అంటే బెటర్ ప్లేస్ అన్న ఫీలింగ్ విద్యార్థుల్లో కలిగేట్లు ప్రయత్నిస్తున్నానని మోజెస్ చెప్తున్నాడు.
తూర్పు మెక్సికోలో తన తల్లితోపాటు నివసిస్తున్న మోజెస్... స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించి ప్రజారవాణా వాహనాల్లోనే యూనివర్శిటీకి వెడుతుంటాడు. తోటి ప్రయాణీకులు అతన్ని సూపర్ హీరోగా భావించినప్పటికీ తాను విశ్వవిద్యాలయంలో సైన్స్ టీచర్ ను మాత్రమే అని వివరిస్తుంటాడు. స్పైడర్ మ్యాన్ ఆలోచనపై మోజెస్ కుటుబం మొదట్లో అతడి కెరీర్ కు హాని కలిగిస్తుందేమోనని భయపడింది. కానీ మోజెస్ తనదైన రీతిలో స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించి తరగతులకు వెళ్ళి విద్యార్థుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించాడు. తన ఆలోచనతో ఒక్క విద్యార్థులనే కాక వర్శిటీలోని ఇతర ఉపాధ్యాయులనూ ఆకట్టుకున్నాడు. మొదటి రోజు వారంతా స్పైడర్ మ్యాన్ డ్రెస్ లో చూసి ఆశ్చర్యపోయినా... తర్వాత సంతోషంగా నవ్వుతూ ఆహ్వానించారని, చేసే పనిపట్ల బాధ్యత కలిగి ఉంటే, శక్తి అదే వస్తుందని మోజెస్ చెప్తున్నాడు.