ఠాణే: మధురై కామరాజు విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థికి కళాశాలకు చెందిన అన్ని రకాల సదుపాయాలను కల్పించడంలో విఫలం చెందినందుకు కన్జ్యూమర్ రీడ్రస్సల్ ఫోరమ్ ఫైన్ కింద రూ.20,000 చెల్లించాలంటూ ఆదేశించింది. స్నేహా మహత్రే సారధ్యం వహిస్తున్న ఫోరమ్ మెంబర్లు మాధురి విశ్వరూపే, ఎన్డీ కదమ్లు ముందు వచ్చే పరీక్షలకు విద్యార్థిని అనుమతించాలంటూ కేంద్రానికి సూచనలు చేసింది. మత్స్య శాస్త్రంపై 2013లో కులకర్ణి విశ్వవిద్యాలయంలో చేరి, ఫీజు కింద రూ.7,300లను చెల్లించాడు.
కానీ, అకడమిక్స్కు సంబంధించిన ఎటువంటి పుస్తకాలు విద్యార్ధికి చేరకపోవడంతో 2014లో కోర్సు పూర్తికావాల్సి ఉండగా కాలేదని, కోర్సు పూర్తయి ఉంటే నెలకు రూ.4000 జీతంతో తనకు ఉద్యోగం లభించి ఉండేదని ఫోరమ్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు నష్టపరిహారం కింద రూ.40,000 ఇప్పించాలని ఫోరమ్ను కోరాడు. ఫిర్యాదుపై ఫోరమ్ ముందు హాజరుకావాలని స్టడీ సెంటర్, మధురైలో ఉన్న యూనివర్సిటీకి నోటీసులు జారీ చేసింది.
గడువులోపు ఫోరమ్ ముందు హాజరుకాకపోవడంతో విద్యార్ధికి ఏప్రిల్లోగా ఇరవై వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. లేకపోతే అప్పటి నుంచి ఆరు శాతం వడ్డీతో చెల్లించాలని హెచ్చరించింది.