మీకు మీరే బాస్
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. ఎంటర్ప్రెన్యూర్ సెల్.. ఈసెల్.. ఇంక్యుబేషన్ సెంటర్.. స్టార్ట్ అప్స్.. సీడ్ ఫండింగ్... ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న మాటలు. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఐఐటీలు, ఐఐఎంలలో వీటి గురించి విస్తృత చర్చ జరుగుతోంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే స్వయం ఉపాధి దిశగా ఆలోచించి సొంతంగా ఒక సంస్థను ఏర్పాటు చేయడం.
ఆ కంపెనీ ద్వారా తాను ఉపాధిని పొందడమే కాకుండా తనతోపాటు మరికొంతమందికి జీవనోపాధిని కల్పించడం. ఇలా సొంతంగా సంస్థను ఏర్పాటు చేయడాన్నే స్టార్ట్ అప్స్ అంటున్నారు! వ్యాపార, వాణిజ్య రంగాల్లో శరవేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తున్న మన దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. ముఖ్యంగా యువత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై ఎంతో ఉత్సాహం చూపిస్తోంది.
‘మీ కలల సౌధాలను మీరే నిర్మించడం మొదలు పెట్టండి..! లేకుంటే వేరే వాళ్లు తమ కలల సౌధాల నిర్మాణం కోసం మిమ్మల్ని నియమించుకుంటారు.!!’
దేశంలోని యువత స్టార్ట్-అప్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదిగేందుకు అవకాశం ఉందని చెప్పడానికి ఫణీంద్ర సామ, సచిన్ బన్సాల్‌ల విజయాలే ప్రత్యక్ష నిదర్శనాలు. ఇక్కడ గమనించాల్సిన అంశం వీళ్లు తమ బిజినెస్ స్టార్ట్ అప్స్ కోసం రూ.కోట్లు కుమ్మరించలేదు. తెల్లారేసరికల్లా రూ.కోట్ల టర్నోవర్ సాధించాలనీ కోరుకోలేదు. కానీ నిర్దిష్టమైన ఆలోచన, స్పష్టమైన లక్ష్యంతో, పూర్తి ఆత్మవిశ్వాసంతో, ఎంతో ముందు చూపుతో ముందుకు కదిలారు. రాత్రింబవళ్లు శ్రమించి అనుకున్నది సాధించారు. తాము ఉన్నతంగా ఎదగడమే కాకుండా వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. స్వయం ఉపాధి దిశగా ఆలోచించే యువత వీళ్లను స్ఫూర్తిగా తీసుకుంటే అద్భుత లక్ష్యాలు సాధించడం తేలికే. కార్యక్షేత్రంలో అడుగుపెట్టేముందు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవి..
1 ఆలోచన.. ఆసక్తి
.
ఒక వ్యాపారాన్ని, కంపెనీని ప్రారంభించాలనుకునే వ్యక్తులకు స్పష్టమైన ఆలోచన, అమితమైన ఆసక్తి, మార్కె ట్ అవకాశాలపై దూరదృష్టి ఉండాలి. ముందుగా ఏ రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నారు? అనే అంశంపై పూర్తి అవగాహన ఎంతో అవసరం. అంతేకాకుండా ప్రారంభించాలనుకుంటున్న బిజినెస్ తమ అభిరుచులకనుగుణంగా ఉండాలి. వ్యాపార ఆలోచనలకు, వ్యక్తిగత ఆసక్తి ఆయుధంగా నిలుస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తనకు అవగాహన ఉన్న రంగంపై దృష్టి సారిస్తే కార్యక్షేత్రంలో కలిసొచ్చే ఎన్నో అవకాశాలున్నాయి. ఈ క్రమంలో.. మూడు అంశాలు ప్రామాణికంగా నిలుస్తున్నాయి. అవి..
మీరు ఎంచుకునే రంగంలో సమస్యలను గుర్తించి ఒక సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా వాటిని పరిష్కరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించడం.అలాంటి అవకాశాలను గుర్తించాక, వాటిని అమలు చేసే దిశగా ఆలోచించడం.
అవకాశాలు, ఆలోచనలపై స్పష్టమైన అవగాహన వచ్చాక, తాను ప్రారంభించాలనుకునే వ్యాపారానికి సంబంధించి బిజినెస్ ప్లాన్ రూపొందించుకుని, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవడం. ఈ రిపోర్ట్ దీర్ఘకాలిక లక్ష్యాలు, ఆ రంగంలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాలు, అసలైన వినియోగదారులు ఎవరు? అనే అంశాలతో సమగ్రంగా ఉండాలి.
2 పెట్టుబడులపై దృష్టి
ఆలోచన, ఆసక్తి, అవకాశాలు వంటి ప్రాథమిక అంశాలపై అవగాహన వచ్చాక తక్షణం దృష్టి సారించాల్సిన అంశం పెట్టుబడులు. స్టార్ట్ అప్స్ ఏర్పాటులో ఎదురవుతున్న ప్రధాన సమస్య కూడా ఇదే. ఎందుకంటే ఇన్వెస్టర్లను సంతృప్తిపరిచే విధంగా తమ వ్యాపార ఆలోచనను వివరించడం, వారిని ఒప్పించడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. ప్రస్తుతం చక్కటి వ్యాపార ఆలోచనలతో ముందుకొచ్చేవారికి వ్యాపారవేత్తలు, సంస్థల నుంచి చేయూత లభిస్తోంది. ఉదాహరణకు దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రతి ఏటా ఐడియా చాలెంజ్ పేరుతో ఔత్సాహిక యువత నుంచి వ్యాపార ఆలోచనలను సేకరించి, టాప్ టెన్‌లో నిలిచిన ఐడియాలకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. అంతేకాకుండా వ్యాపారం ప్రారంభం దిశగా తోడ్పాటునూ అందిస్తోంది. అదేవిధంగా ఇటీవల కాలంలో ఐఐఎంలు, ఐఐటీలు కూడా భవిష్యత్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించి ఆర్థిక చేయూతనిచ్చే విధంగా కృషి చేస్తున్నాయి.
ఏటా క్రమం తప్పకుండా పోటీలు నిర్వహిస్తూ మంచి వ్యాపార ఆలోచనలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఇలాంటి అవకాశాలను ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్స్ అన్వేషించి అందిపుచ్చుకుంటే పెట్టుబడుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. పెట్టుబడులను సాధించాలంటే చక్కటి ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించడం, మెచ్చే విధంగా ప్రజెంటేషన్ ఇవ్వగలిగే నైపుణ్యం ఎంతో అవసరం.
3 బెస్ట్ వర్క్ టీం
ఆలోచనలు కలిసొచ్చాయి.. పెట్టుబడులు లభించాయి.. ఇక తదుపరి దశ కార్యోన్ముఖులు కావడం. ఈ దశలో ముందుగా దృష్టి సారించాల్సిన అంశం చక్కటి వర్క్ టీంను ఎంచుకోవడం. సంబంధిత వ్యాపారం సుస్థిరాభివృద్ధి సాధించాలంటే పనిచేసే బృందం కూడా అంతే నిబద్ధతతో ఉండాలి. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న సంస్థల విషయంలో లీడ్ చేసే మొదటి 20 మంది వ్యక్తులను తీసుకునే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసు బాయ్ నుంచి సీఈవో వరకు ప్రతి హోదా, వారు నిర్వహించే విధులు, ప్రతి ఒక్కరి పనితీరు స్టార్ట్ అప్ విజయంలో కీలకపాత్ర పోషిస్తాయి.
అంతేకాకుండా ఒక వ్యక్తిగా రూపొందించిన ఆలోచనల అమలుకు నిపుణులైన బృందం సహకారం ఎంతో అవసరం. కాబట్టి వ్యాపార నిర్వహణకు సంబంధించి చక్కటి వ్యూహాలను అమలు చేసే నిపుణులను నియమించుకోవాలి. కొన్ని సందర్భాల్లో తమకంటే అనుభవజ్ఞులైన వారిని ఒప్పించే విషయంలో సవాళ్లు ఎదురవుతాయి. ఇక్కడ కూడా కలిసొచ్చే మంత్రం ఒకటే. అదే ప్రాజెక్ట్ ప్రజెంటేషన్. దీని ద్వారా ఎంతటి వారినైనా మెప్పించవచ్చు.
4 టార్గెట్ కస్టమర్స్
ముఖ్యమైన అంశం వినియోగదారులను ఆకట్టుకోవడం. తమ వ్యాపారానికి తగిన కస్టమర్స్ సెగ్మెంట్‌ను గుర్తించి వారిని ఆకర్షించేలా తమ ఉత్పత్తులు, లేదా సేవల గురించి తెలియజేయడం. ఈ విషయంలో ప్రసార సాధనాల ద్వారా ప్రకటనలు కీలకంగా మారతాయి. కొత్తగా ఏర్పాటైన సంస్థలు కేవలం ప్రసార సాధనాలకే పరిమితం కాకుండా తమ టార్గెట్ వినియోగదారుల వద్దకు నేరుగా వెళ్లడం మరింత లాభిస్తుంది. అప్పటికే ఆ రంగంలో నిలదొక్కుకున్న సంస్థల పోటీని తట్టుకోవాలంటే ప్రారంభంలో ఫీల్డ్ వర్క్ తప్పనిసరి. పోటీదారుల ఉత్పత్తులు లేదా సేవల కంటే తమవి ఎంత నాణ్యమైనవో, ఎంత త్వరగా ఆ సేవలు అందించగలం అనే అంశాలను వివరించడం ద్వారా వినియోగదారులను ఆకర్షించే వీలుంటుంది.
5 పోటీని తట్టుకునే విధంగా
కొత్త కంపెనీల ఏర్పాటులో ప్రధాన సమస్య, సవాలు.. మార్కెట్ పోటీ! చాలామంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఈ పోటీ కారణంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ దశలోనే వెనుకంజ వేస్తున్నారనేది నిపుణుల అభిప్రాయం. ఈ పోటీని తట్టుకునే విధంగా మానసిక సంసిద్ధత ఉండాలి. పోటీ ఉంటేనే కొత్త ఆలోచనలు, సృజనాత్మకత వెలుగులోకి వస్తాయి. తద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా తమ ఉత్పత్తులను వృద్ధి చేయొచ్చు.
6 భవిష్యత్ సవాళ్లపై అంచనా
సమీప పోటీదార్ల మార్కెట్‌తోపాటు కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ దృష్టి సారించాల్సిన మరో ప్రధాన అంశం.. భవిష్యత్ సవాళ్లను అంచనా వేయడం. కేవలం తాము వ్యాపారం ప్రారంభించే సమయానికి ఆ రంగంలో ఉన్న సమస్యలను గుర్తించడమే కాకుండా.. రానున్న కాలంలో ఆ రంగంలో ఎదురవనున్న ఇబ్బందులపై అవగాహన పెంచుకోవాలి. అంతేకాకుండా తమ సంస్థ పరంగా ఎదురయ్యే సమస్యలను గుర్తెరగాలి. అప్పుడే ప్రాజెక్ట్ రిపోర్ట్ సమయంలోనే దీర్ఘకాలిక లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవడానికి వీలవుతుంది. ఈ క్రమంలో గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు.. సంస్థ కోణంలో ఆలోచిస్తే.. వస్తువులు లేదా సేవల డిమాండ్ - సప్లై అంశాలు మొదలు భవిష్యత్ లాభనష్టాలు, ఊహించని వ్యయాల అంచనా. ఇక మార్కెట్ కోణంలో చూస్తే.. నియంత్రణ సంస్థల విధానాలు, వ్యూహాల వరకు అన్ని అంశాలపై స్పష్టత అవసరం. ఇందుకోసం స్పష్టమైన విధివిధానాలు రూపొందించుకోవాలి.
7 మార్పులతోపాటు మారేలా
మరో ప్రధాన వ్యూహం.. మార్పులకు వెంటనే స్పందించడం. తమ వ్యాపార రంగంలో సంభవిస్తున్న మార్పులకు అనుగుణంగా మారి, అందుకు తగిన రీతిలో సేవలు లేదా ఉత్పత్తుల రూపకల్పనకు ఉపక్రమించడం. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఇప్పుడే వ్యాపారం ప్రారంభించదలుచుకున్న ఔత్సాహిక వ్యాపారవేత్తలు.. గత కొన్నేళ్లుగా సంబంధిత రంగంలో వచ్చిన మార్పులను పరిశీలిస్తే ప్రాథమిక అంచనాను రూపొందించుకోవచ్చు. తద్వారా భవిష్యత్ మార్పులను ఊహించే అవకా
8 నిరంతర నిర్వహణ, శ్రమించేతత
మానవ వనరుల నుంచి మార్కెట్ పోటీలో నిలదొక్కుకోవడం వరకు.. అన్ని రకాలుగా సుస్థిరత సాధి ంచినా..ఎన్నడూ మ రిచిపోకూడని అంశా లు.. నిరంతర నిర్వహణ, శ్రమించేతత్వం. చాలామంది వ్యాపారవేత్తలు సంస్థకు ఒక గుర్తింపు లభించాక కొంత విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనతో బాధ్యతలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టరు. ఇది సరికాదు. సంస్థ ఏ స్థాయికి చేరుకున్నా.. ఎంతటి లాభాలను ఆర్జిస్తున్నా.. వ్యాపారవేత్త నిత్యం కార్యక్షేత్రంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. లేదంటే.. నిర్వహణ లోపాలు తలెత్తి సంస్థ మనుగడే ప్రమాదంలో పడే ఆస్కారముంటుంది. సంస్థను ప్రారంభించే ముందు ఇలాంటి దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకోవాలి.
9 సక్సెస్‌కు లేదు ప్రామాణికం
ఔత్సాహిక వ్యాపారవేత్తలు గుర్తుంచుకోవాల్సిన అంశం.. సక్సెస్‌కు నిర్దిష్ట ప్రామాణికం అంటూ ఏదీ ఉండదు అని. లాభా లు గడించడం, మా ర్కెట్లో సుస్థిర
స్థానం సంపాదించడమే సక్సెస్ అనుకోవడం సరికాదు. వ్యాపారపరంగా విజయం అంటే.. నిత్యనూతనంగా వినియోగదారులను ఆకట్టుకోవడం. అందుకు తగిన రీతిలో వ్యాపారాభివృద్ధి చేసే విధంగా వ్యూహాలు రూపొందించడం.
10 ఎగ్జిట్ పాలసీ
సంబంధిత వ్యక్తులు తమ దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగంగా ఆలోచించుకోవాల్సిన అంశం ఎగ్జి ట్ పాలసీ. అంటే.. వ్యాపారం నుంచి విరమించుకోవడం. దేశంలో చాలా సంస్థలు.. లాభాల బాటలో పయనిస్తూ కూడా యజమాని తప్పుకున్నాక మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితులను కూడా ముందుగానే ఊహించి తగిన ఎగ్జిట్ పాలసీని రూపొందించుకోవాలి. అంతేకాకుండా మరెన్నో లాభదాయక సంస్థలు తమకున్న గుడ్‌విల్ ద్వారా మరో సంస్థకు మేజర్ స్టేక్‌ను విక్రయించి కొన్ని ఏళ్ల తర్వాత లభించే ఆదాయాన్ని ముందుగానే పొందుతున్నాయి. ఇందుకు మంచి ఉదాహరణ ‘రెడ్‌బస్ ఆన్లైన్ పోర్టల్’. కేవలం కొన్ని లక్షల వ్యయంతో ప్రారంభమైన ఈ సంస్థను గతేడాది భారీ మొత్తానికి ఇబిబో గ్రూప్ కొనుగోలు చేసింది.
ఔత్సాహికులకు ఎన్నో ప్రోత్సాహకాలు
ప్రైవేటీకరణ, సరళీకరణలో భాగంగా ఇప్పుడు ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రైవేటు రంగం నుంచి.. ప్రభుత్వం తరపున ఎన్నో ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంఎస్ఎంఈ సంస్థ ద్వారా పలు పథకాల కింద యువ వ్యాపారవేత్తలకు ఆర్థిక చేయూత నందిస్తున్నాం. ఇది రూ.2 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు ఉంటోంది. అదేవిధంగా ప్రైవేట్ రంగం నుంచి, ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు, వాటి అలుమ్ని అసోసియేషన్ల నుంచి కూడా ఆర్థికంగా తోడ్పాటు లభిస్తోంది. కావాల్సిందల్లా చక్కటి ఆలోచన, ఫండింగ్ మెంటార్స్‌ను మెప్పించే ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించడం. వీటితోపాటు వాటికి సమర్థవంతంగా కార్యరూపం ఇచ్చే విధంగా వ్యవహరించడం. - సాక్షి కులకర్ణి,
డెరైక్టర్,
ఎస్ఎంబీడీ చాంబర్ ఆఫ్ ఇండియా