ఇక నేరగాళ్ళను త్వరగా పట్టెయ్యచ్చు..!
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్...ఇస్రో సహాయంతో ఢిల్లీ పోలీసులు మరో అడుగు ముందుకేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని నగరంలో హింసను అరికట్టేందుకు స్పేస్ టెక్నాలజీని వాడకంలోకి తెస్తున్నారు. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సూచనా విధానాన్ని అనుసరించి నేరాలను ప్రత్యక్షంగా కొనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.
దేశ రాజధాని నగరంలో నేరాల రేటు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో నివారణ చర్యలకు పోలీసులు రాకెట్ సైన్స్ ను వినియోగించనున్నారు. స్పేస్ టెక్నాలజీ ద్వారా లైవ్ క్రైమ్ మ్యాపింగ్ ను అమల్లోకి తెచ్చి... క్రిమినల్స్ ఆట కట్టించనున్నారు. క్రైమ్ మ్యాపింగ్ ఎనలిటిక్స్ అండ్ ప్రెడిక్టివ్ సిస్టమ్ (CMAPS) ద్వారా స్పేస్ టెక్నాలజీ ఆధారిత టూల్స్ ను వినియోగించి హింసను అరికట్టేందుకు కృషి చేస్తున్నారు. ఇస్రో భాగస్వామ్యంతో తాము అంతర్గత భద్రత, భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఢిల్లీ పోలీసు అధికారులు చెప్తున్నారు. అందుకు పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ డివైజ్ (PDA) ను వాడకంలోకి తెస్తున్నారు. సెంట్రల్ డేటాబేస్ సిస్టమ్ తో అనుసంధానం చేసిన ఈ వ్యవస్థ.. శాంతి భద్రతల నిర్వహణకు, ఎనలిటిక్స్ ద్వారా నేరాల నియంత్రణకు సహాయపడుతుంది. ప్రస్తుతం ప్రతి 15 రోజులకోసారి ఎలక్ట్రానిక్ డేటా సేకరించడం ద్వారా క్రైమ్ ను గుర్తిస్తున్నారు.
కొత్తగా ప్రవేశ పెట్టనున్న ఈ ప్రెడెక్టివ్ పోలీసింగ్ విధానం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిశీలనలో ఉంది. కాగా భారతదేశంలో ఈ విధానాన్ని కీలక సమాచారాన్ని సరైన సమయంలో పోలీసులకు అందించేందుకు వినియోగించనున్నారు. దీని వాడకంతో సిబ్బంది నివేదికలు అందించేందుకు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఈ వ్యవస్థలో జీపీఎస్ ద్వారా కాలర్ ఉన్న ప్రాంతాన్నిడిజిటల్ మెసేజ్ రూపంలో తెలియజేస్తుంది. దీంతో పోలీసులు సరైన సమయంలో ఆ వ్యక్తిని చేరుకోగల్గుతారు. అధిక నేర రేటు ఉన్న ప్రాంతాలను మానిటర్ చేసేందుకు ఈ వ్యవస్థను వినియోగించనున్నారు. దీంతో నేరాలను అరికట్టడం సులభమౌతుందని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు.