శాస్త్రీయతకు చోటెక్కడ? | Editorial Column On Science | Sakshi
Sakshi News home page

శాస్త్రీయతకు చోటెక్కడ?

Published Sat, Jan 12 2019 1:09 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Editorial Column On Science - Sakshi

జగదీశ్‌ చంద్రబోస్, సీవీ రామన్, విక్రమ్‌ సారాభాయ్, హోమీ జే భాభా వంటి దిగ్దంతులను వైజ్ఞానిక ప్రపంచానికి అందించి మురిసిన మన దేశం కొన్నేళ్లుగా ఆ రంగంలో వెలవెలబోతోంది. పంజాబ్‌లోని జలంధర్‌లో ఇటీవల ముగిసిన 106వ భారత సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సు ఆ దుస్థితినుంచి దేశాన్ని రక్షించడానికి, శాస్త్ర సాంకేతిక రంగాలను పటిష్టపరచడానికి  ఏమేరకు దోహదపడిందో అనుమానమే. వాస్తవానికి ఏటా జరిగే ఆ సదస్సులు ఆ రంగాల్లో సాధించిన విజయాల గురించి మదింపు వేసుకుని, పరిశోధనా రంగంలో మన స్థానం ఎక్కడుందో నిర్ధారిం చుకుని లక్ష్య నిర్దేశం చేసుకోవాలి. ఆ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలేమిటి... కారకులెవరు అన్న అంశాలపై దృష్టి పెట్టాలి.

స్వీయ లోపాలను సైతం నిష్కర్షగా, నిర్మొహ మాటంగా చర్చించుకుని చక్కదిద్దుకోవాలి. ప్రాథమిక విద్య మొదలుకొని కళాశాల స్థాయి వరకూ విజ్ఞాన శాస్త్రానికి ఇస్తున్న ప్రాముఖ్యత ఏ పాటిదో ఆరా తీసి దాన్ని మెరుగుపరచమని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం కూడా శాస్త్రవేత్తల బాధ్యత కావాలి.  మన రాజ్యాంగం ఆశించినట్టు దేశంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఇవన్నీ చాలా అవసరం. ఈ ప్రక్రియంతా విజ్ఞాన శాస్త్ర అధ్యయనంవైపు నవతరం దృష్టి సారించేలా చేయగలుగుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఉండటం మాట అటుంచి  కనీసం ఇప్పుడున్న స్థితిని దాటి ముందుకెళ్లాలంటే శాస్త్రవేత్తల్లో, పరిశోధకుల్లో ఆ విచికిత్స తప్పనిసరి. 

కానీ దురదృష్టమేమంటే మన సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సులు నానాటికీ తిరునాళ్లను తలపిస్తున్నాయి. ఉద్దండులనుకున్నవారు సైతం వేదికనెక్కి ఉబుసుపోని కబుర్లు చెబుతున్నారు. ఆ వేదికపై మాట్లాడే ప్రతి మాటకూ శాస్త్రీయ ప్రాతిపదిక ఉండాలన్న కనీస స్పృహ లేకుండా ప్రవ ర్తిస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ జి. నాగేశ్వరరావు అంతక్రితం ఎన్ని సదస్సుల్లో పాల్గొన్నారో... ఏం మాట్లాడారో, అక్కడ ప్రతిపాదించిన అంశాలేమిటో ఎవరికీ తెలియవు. కానీ ఈసారి ఆయన పేరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది. కౌరవులు టెస్ట్‌ట్యూబ్‌ బేబీలనీ, మన పూర్వీకుల వద్ద గైడెడ్‌ మిస్సైళ్లు ఉండేవని, రావణుడికి 24 రకాల విమానాలున్నా యని ఆయన వాక్రుచ్చారు. మరో శాస్త్రవేత్త అల్బర్ట్‌ ఐన్‌స్టీన్, ఐజాక్‌ న్యూటన్‌లు ప్రతి పాదించిన సిద్ధాంతాలన్నీ తప్పుల తడకని, గురుత్వాకర్షణ తరంగాలపై తాను ప్రతిపాదిస్తున్న సిద్ధాంతానికి ‘నరేంద్రమోదీ తరంగాల’ని నామకరణం చేశానని చెప్పారు.

పంజాబ్‌ యూనివర్సిటీకి చెందిన మరో శాస్త్రవేత్త గత 25 ఏళ్లుగా తాను భారత్‌లో డైనోసార్ల పుట్టుక, వాటి ఉనికి గురించి పరిశోధి స్తున్నానని సదస్సులో తెలియజేశారు. సృష్టికర్త బ్రహ్మకు తెలియనిదంటూ ఉండదని, డైనోసార్ల గురించి వేదాల్లో ఆయన ప్రస్తావించారని తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో శాస్త్రవేత్తలకుండే వ్యక్తిగత విశ్వాసాలేమిటని ఎవరూ ప్రశ్నించరు. సైన్స్‌ కాంగ్రెస్‌ వంటి వేదిక లెక్కినప్పుడు ఆ విశ్వాసాల ఆధారంగా మాట్లాడితే నిలదీస్తారు. భిన్న అంశాలపై  శాస్త్రవేత్తల అభిప్రాయాలేమిటో తెలుసుకుని తమ విజ్ఞానానికి పదును పెట్టుకోవాలని వచ్చేవారికి ఈ ధోరణి ఏమాత్రం దోహ దపడేలా లేదు. ఇప్పుడే కాదు... గత మూడు నాలుగేళ్లుగా ఇదే వరస కొనసాగుతోంది. సైన్స్‌ సద స్సులు కాల్పనిక గాథలకు వేదికలైతే, అవి వినోద ప్రధానంగా మారితే అంతర్జాతీయంగా మనం నవ్వులపాలవుతాం.

ముంబైలో 2015లో జరిగిన సైన్స్‌ కాంగ్రెస్‌కు ముఖ్య అతిథిగా వచ్చి ఆ తంతును గమనించాక నోబెల్‌ గ్రహీత వెంకటరామన్‌ రామకృష్ణన్‌ దాన్నంతటినీ ఒక సర్కస్‌గా అభివర్ణించారు. ఇకపై భారత సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సుల్లో తాను పాల్గొనబోనని ప్రకటించారు. కనీసం అప్పుడైనా సదస్సు నిర్వాహకులు మేల్కొని, వక్తల ఎంపికకు నిర్దిష్టమైన విధానాలను రూపొందించుకోవాల్సింది. అలాగే పిలిచినవారి నుంచి ప్రసంగ పాఠాలను ముందే తెప్పించుకుని వాటి ప్రామాణికతను నిర్ధారించుకునే ప్రక్రియ అమల్లోకి తీసుకురావాల్సింది. కానీ నిర్వాహకులు ఆ పని చేయలేదు. కనీసం ఆ శాస్త్రవేత్తల ప్రసంగాల అనంతరం అయినా వాటిని ఖండించలేదు. కనుకనే కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైజ్ఞానిక సలహాదారు కె. విజయరాఘవన్‌ ఆ బాధ్యత తీసుకోవాల్సివచ్చింది.

ఆ ప్రసంగాలు శాస్త్రవేత్తల వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప ప్రభుత్వానికి సంబంధం లేదని... సదస్సు ఎక్కడ నిర్వహించాలో, దాని ఎజెండా ఏమిటో, వక్తలుగా ఎవరిని పిలవాలో నిర్వాహకులే చూసుకుంటారని ఆయన చెప్పారు. సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సులకు దేశ దేశా లనుంచి ఏటా వందలాదిమంది శాస్త్రవేత్తలు హాజరవుతారు. ఇందులో భాగంగా బాలల సైన్స్‌ కాంగ్రెస్, మహిళా సైన్స్‌ కాంగ్రెస్‌ జరుగుతాయి. మొత్తంగా దాదాపు 20,000మంది ప్రతినిధులు పాల్గొంటారు. విజ్ఞాన శాస్త్ర రంగంలో, ముఖ్యంగా పరిశోధనల్లో వాస్తవ స్థితిగతులేమిటన్న విషయాన్ని శాస్త్రవేత్తలతో పోలిస్తే కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ బాగా చెప్పగలిగారు. మీ రంగంలో లింగ వివక్ష వేళ్లూనుకున్నదని, దాన్ని చక్కదిద్దడానికి ప్రయత్నించమని ఆమె నిష్కర్షగా చెప్పారు.

దేశంలోని వివిధ పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో 2,80,000 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పని చేస్తుంటే వారిలో కేవలం 14 శాతంమంది అంటే... 39,200 మంది మాత్రమే మహిళలని తెలి పారు. ఐఐటీల్లో సైతం మహిళల శాతం నానాటికీ తగ్గిపోతున్నదని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న మహిళల్లో 81 శాతంమంది తమ పనితీరు మదింపులో లింగ వివక్ష కొట్టొ చ్చినట్టు కనబడుతున్నదని చెప్పిన సంగతిని ఆమె ప్రస్తావించారు. ప్రపంచంలోని ఉత్తమోత్తమ సైన్స్‌ పత్రికల్లో వచ్చే వ్యాసాలను, పరిశోధనా విశేషాలను విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో అను వదించి వారిలో ఆ రంగంపై మక్కువ పెంచాలని సూచించారు. స్మృతి ప్రసంగం విన్నాకైనా తమ కర్తవ్యమేమిటో శాస్త్రవేత్తలు, సదస్సు నిర్వాహకులు బోధపరుచుకుంటారని ఆశించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement