అసా‘ధారణ’ ప్రతిభ | Asadharana 'talent | Sakshi
Sakshi News home page

అసా‘ధారణ’ ప్రతిభ

Published Tue, Sep 23 2014 1:10 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

Asadharana 'talent

మనం ఫోన్‌లో మాట్లాడుతుంటే వెనక నుంచి ఎవరేం చెప్పినా గుర్తుండదు. మరి చుట్టూ ఎనిమిది మంది కూర్చుంటే... ప్రశ్నల వర్షం కురిపిస్తే సమాధానం చెప్పగలరా... అలా చెప్పగలగడాన్నే అష్టావధానం అంటారు. చినముషిడివాడకు చెందిన ఇరవై నాలుగేళ్ల రాంభట్ల పార్వతీశ్వర శర్మ మాత్రం పదహారేళ్ల వయసులోనే అష్టావధానిగా కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎందరో ప్రముఖుల శభాష్ అనిపించుకున్నారు. జ్ఞాపకశక్తితోనే ముడిపడిన అష్టావధాన ప్రక్రియలో అద్భుత ప్రావీణ్యం సంపాదించిన పార్వతీశ్వర శర్మ విజయ పరంపర ఆయన మాటల్లోనే చదవండి.    
- విశాఖపట్నం
 
మా తాతగారి పేరు రాంభట్ల పార్వతీశ్వర శర్మ. ఆయన పేరే నాకు పెట్టారు. ఆయన స్వతహాగా కవి, రచయిత కూడా. నా చిన్నప్పుడు ఆయనతో కవి సమ్మేళనాలు, అష్టావధానాలకు వెళ్లేవాడిని. మా ముత్తాత రాంభట్ల వెంకటరావు (కుప్పిలి డాక్టరు) కూడా కవి. మా యింట్లో చాలా మంది కవులున్నారు. అది నాకు కూడా అబ్బింది.
 
అష్టావధానంపై ఆసక్తి...

ఆరో తరగతి చదువుతున్నప్పుడు యతిప్రాసలు నేర్చుకున్నాను. పద్యం, ఛందస్సు అంటే ఏమిటో మా తాతగారు నేర్పించారు. ఒక విధంగా అష్టావధానానికి గురువు ఆయనే. 2002లో కట్టమూరి చంద్రశేఖర సిద్ధాంతి గారు శృంగవరపుకోటలో అష్టావధానం చేస్తునప్పుడు తొలిసారిగా ‘దత్తపది’కి పృచ్ఛకుడిగా ఉన్నాను. నాలుగు పదాలు, ఒక అంశం ఇచ్చి పద్యం చెప్పమనడాన్నే దత్తపది అంటారు. 2005లో శృంగవరపుకోటలోనే తొలి అష్టావధానం చేశాను. ధారగంగమ్మ గుడిలో, ఆ తర్వాత మాడుగుల నాగఫణిశర్మ, గరికపాటి నరసింహారావుగారు లాంటి ప్రముఖ అవధానుల ముందు కూడా చేశాను. ప్రపంచ తెలుగు మహాసభల్లో జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొన్నాను.
 
అష్టావధానంతో విజ్ఞానం, వినోదం

చుట్టూ ఎనిమిది మంది పృచ్ఛకులు (ప్రశ్నించేవారు)టారు. ఈ సందర్భంగా సమస్య పూరణం, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, వ్యస్తాక్షరి, గంటాగణనం, అప్రస్తుత ప్రసంగం, దత్తపది అంశాల్లో ప్రశ్నలు వేస్తారు. సినిమా చూసినా, సీరియల్ చూసినా విజ్ఞానం, వినోదం కోసమే. అష్టావధానం కూడా వాటిని అందిస్తుంది. పద్యం అర్థమైనా, కాకపోయినా అందులోని పదాలు బాగుంటే అందరూ ఆనందిస్తారు. అవధానంలో ధారణ అని ఒక ప్రక్రియ ఉంది. మొత్తం చెప్పిన పద్యాలన్నీ గుర్తుంచుకొని ఒకేసారి చివర్లో చెప్పాలి. దీనివల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది.
 
అవార్డులు : చిన్నప్పుడే రాష్ట్రస్థాయి పద్యాల పోటీల్లో మొదటి బహుమతి వచ్చింది. ఆ తర్వాత చాలా రకాల అవార్డులు వచ్చాయి. 2013లో ఉగాది సందర్భంగా విశాఖ సాహితీ వారు లలిత కళాపీఠంలో ‘అవధాన సుధాకర్’ బిరుదుతో సత్కరించారు. ఎస్‌వీబీసీ చానెల్‌లో శ్రీవారి సన్నిధిలో అష్టావధానం చేసే అవకాశం లభించింది.
 
రచనలు : మా ముత్తాత గారి గురించి రాంభట్ల వెంకటీయం (కుప్పిలి డాక్టరు గారి జీవిత చరిత్ర) రాశాను. అనేక అష్టావధానాల్లో చెప్పిన పద్యాలను సంకలన పుస్తకంగా ‘మొదటి మొగ్గలు’ రాశాను. వచన కవిత్వాల సంకలనంగా ‘ప్రతిభా స్వరాలు’ రాశాను. రాంభట్ల వెంకటరావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఏటా కొందరు కవులను సత్కరిస్తున్నాం. ప్రస్తుతం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగులో పీహెచ్‌డీ చేస్తున్నాను.
 
నిత్య సాధన

అష్టావధానం కోసం నిత్యం సాధన చేస్తూనే ఉంటాను. తెలుగు భాషకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలను చదువుతుంటాను. ఇతర భాషల్లో పద్యాలున్నా వాటికి యతులు, ప్రాసలు లేవు. కేవలం తెలుగులో ఉన్నాయి. కాబట్టి వాటిపై మంచి పట్టు సాధించేందుకు నిత్యం సాధన చేస్తాను. శతావధానం, సహస్రావధానం చేయాలన్నది నా కోరిక.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement