ప్రగతికి ఇంధనం..శాస్త్ర విజ్ఞానమే
ప్రగతికి ఇంధనం..శాస్త్ర విజ్ఞానమే
Published Mon, Feb 27 2017 11:05 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM
-మానవాళి దశ, దిశలను మార్చిన ఆవిష్కరణలు
-పాఠశాల నుంచే ప్రయోగాసక్తి వికసించాలి
-నేడు జాతీయ సైన్స్ దినోత్సవం
రాయవరం : మస్తిష్కాన్ని కదిలించాలి. మెదడులో రక్తం ఉరకలెత్తాలి. కళ్లు నిశితంగా పరిశీలించాలి. మనసులో జిజ్ఞాస మొదలవ్వాలి. నవతరాన్ని ఆసక్తి నుంచి ఒక ఆశయం దిశగా నడిపించాలి. ఇంతటి శక్తి కేవలం సైన్స్‌కు మాత్రమే ఉంది. విఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సీవీ రామన్ తన ఆవిష్కరణ రామన్ ఎఫెక్ట్‌ను ఫిబ్రవరి 28న కనుగొన్నారు. ఏటా ఆ రోజునే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో శాస్త్ర పరిశోధనల పట్ల జిజ్ఞాస పెరిగేలా చేయాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
ప్రశ్నలే పురోగతికి నాంది
‘ఏమిటి? ఎందుకు? ఎలా?’ అనే ప్రశ్నలు ఎన్నో విప్లవాత్మక మార్పులకు, ప్రయోగాలకు, మానవ జీవనశైలిని మార్చడానికి దోహదపడ్డాయి. నేటి విద్యార్థుల్లో పరిశీలన, పరిశోధనాసక్తి తగ్గిపోతున్నాయి. పుస్తకాలతో కుస్తీ పడుతూ, మార్కుల వేటలో తీరిక లేని వారిగా మారిపోతున్నారు. విద్యార్థుల్లో పరిశోధనాసక్తిని పెంపొందించేందుకు ప్రతి పాఠశాల ప్రయోగశాలగా మారాలి. ప్రతి అంశాన్నీ అనుభవ పూర్వకంగా చిన్నారులకు వివరించాలి. విని తెలుసుకున్న వాటి కంటే ప్రత్యక్షంగా, అనుభవ పూర్వకంగా తెలుసుకోవడం చిన్నారుల మెదడుల్లో చెరగని ముద్ర వేస్తుంది. శాస్త్ర అంశాలను సులభంగా వారి మనసుల్లో నాటుకోవడానికి సహకరిస్తుంది.
అరకొర వసతులు
పాఠశాల స్థాయి నుంచి సైన్స్ బోధనలో పరికరాల వినియోగం తక్కువగా ఉంటుంది. దీని వల్ల ఉన్నత తరగతులకు వెళ్లిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. గత కొన్నేళ్లుగా సర్వశిక్షాభియాన్ ద్వారా పాఠశాలల్లో సైన్స్ పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరవుతున్నా.. అవి పూర్తి స్థాయిలో సరిపోవడం లేదనే విమర్శలున్నాయి. ఈ విమర్శలు నిజమేనన్నట్లుగా చాలా పాఠశాలల్లోని ప్రయోగశాలల్లో అరకొర వసతులున్నాయి. జిల్లాలో 3,300 ప్రాథమిక, 414 ప్రాథమికోన్నత, 548 వరకు ఉన్నత పాఠశాలలున్నాయి. చాలా పాఠశాలల్లో ప్రయోగాలకు ఉండాల్సిన కనీస సౌకర్యాలు కూడా ఉండక పోవడం శోచనీయమని పలువురు పేర్కొంటున్నారు. చాలా మంది విద్యార్థులకు ప్రయోగశాలలో వినియోగించే పరికరాల పేర్లు కూడా తెలియక పోవడాన్ని బట్టి ప్రయోగాలు ఏ స్థాయిలో నిర్వహిస్తున్నారో అర్థమవుతుంది. పాఠశాలల్లో ప్రయోగాలు చేయడానికి రసాయన పదార్థాలు, పరికరాలు పూర్తి స్థాయిలో ఉండక పోవడం, ల్యాబ్‌కు ప్రత్యేకించి గదులు లేక పోవడం విచారించదగ్గ విషయంగా పలువురు పేర్కొంటున్నారు.
ఈ మూడు లక్షణాలూ ప్రధానం..
బోధన, అభ్యసనం, పరిశోధన ఉపాధ్యాయులకు, పరిశోధకులకు ఉండవలసిన మూడు ప్రధాన లక్షణాలు. బోధన ద్వారా తెలిసిన అంశాలను ఇతరులకు చెప్పడం, అభ్యసనం ద్వారా నూతన జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశోధన ద్వారా నూతన ఆవిష్కరణలకు ప్రాణం పోయడం జరుగుతుంది. వీటిలో ప్రధానమైనది పరిశోధన. ఈ రంగంలో రాణించాలనుకునే వారికి ప్రత్యేక శిక్షణ ఎంతో అవసరం. సందేహాల నుంచి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. నూతన ఆవిష్కరణలకు బీజం వేయాలి. సాంకేతిక రంగంలో అభివృద్ధి సాధించినా..వైజ్ఞానికపరంగా అభివృద్ధి చెందడం లేదని పలువురు భావిస్తున్నారు. 1930లో సర్ సీవీ రామన్ నోబెల్ బహుమతి పొందిన తర్వాత తిరిగి దేశంలో సైన్స్ రంగంలో భారతీయులకు నోబెల్ బహుమతి లభించక పోవడం బాధాకరమని పలువురు సైన్స్ అభిమానులు భావిస్తున్నారు.
ఏడాదికి రూ.100 కోట్లు ఇస్తే..
నోబెల్ బహుమతి సాధించిన విద్యార్థులకు ఏడాదికి రూ.100 కోట్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. అయితే నోబెల్ బహుమతి సాధించిన తర్వాత ఇవ్వడం కాదని, ఏడాదికి రూ.100 కోట్లు ఇస్తే పాఠశాలల్లో ల్యాబ్స్ ఎంతో అభివృద్ధి చెందుతాయని ఉపాధ్యాయ సంఘ నేతలు పేర్కొంటున్నారు. అప్పుడు ఎంతో మంది శాస్త్రవేత్తలు తయారవుతారన్నది నిర్వివాదాంశమని పేర్కొంటున్నారు.
శాస్త్రీయ దృక్పథం పెంచాలి..
సైన్స్ ప్రధాన ఉద్దేశం మూఢ నమ్మకాలను పారదోలి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించడం. సమాజంలో నిత్యం ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను చూపడం.
– కె.శ్రీకృష్ణసాయి, జనవిజ్ఞాన వేదిక సైన్స్ అండ్ టెక్నాలజీ జిల్లా కన్వీనర్ (26ఎండీపీ126ఎ)
చిన్నతనం నుంచే ఆసక్తిని పెంచాలి..
విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించాలి. ముఖ్యంగా చిన్న చిన్న ప్రయోగాలను విద్యార్థులతో చేయిస్తే వారిలో పరిశోధన పట్ల మక్కువ పెరుగుతుంది. ప్రశ్నించేతత్వమే పరిశోధనలకు పునాది.
– కేసరి శ్రీనివాసరావు, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త
పాఠశాల ప్రయోగశాల కావాలి..
ప్రతి వ్యక్తి జీవనానికీ అవసరమైన పునాది పాఠశాలలోనే ప్రారంభమవుతుంది. ఈ దశ నుంచే ప్రతి విద్యార్థినీ భవిష్యత్ ఆవిష్కరణలు చేసేలా ప్రయోగాల వైపు నడిపించడానికి ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలి.
– జి.వసంత్‌కుమార్, జిల్లా సైన్స్ అధికారి
Advertisement
Advertisement