ఇదీ సాంకేతి‘కథ’
ఇదీ సాంకేతి‘కథ’
Published Wed, May 10 2017 11:48 PM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM
విరివిగా పెరుగుతున్న టెక్నాలజీ..
జీవన విధానంలో వినూత్న మార్పులు
సామాజిక అంశాల విస్మరణతో పక్కదారి పడుతున్న వినియోగం
సాంకేతిక సమస్యలతో సామాన్యులు సతమతం
నేడు జాతీయ టెక్నాలజీ డే
అరచేతిలోనే అంతర్జాలం.. అన్నీ కొనుగోళ్లు ఆన్‌లైన్‌లోనే.. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా.. సినిమా, బస్, రైలు టికెట్లు కొనుగోలు చేయాలన్నా అంతా టెక్నాలజీతో ప్రస్తుతం ముడిపడి ఉంది. బిల్లుల చెల్లింపులు, ధ్రువీకరణ పత్రాలు పొందడం, నెట్ బ్యాంకింగ్, ఏటీఎంల నుంచి నగదు తీసుకోవడం, నగదు రహిత లావాదేవీలు ఇలా ప్రతి విషయానికి ప్రస్తుతం టెక్నాలజీయే ఆధారం. ఆధునిక సమాజంలో మానవుల అవసరార్థం శాస్త్రవేత్తల ప్రయోగాలతో అద్భుతమైన లోకాన్ని వీక్షిస్తున్నామంటే దీనంతటికీ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానమే కారణం. అయితే టెక్నాలజీ వినియోగంలో సామాజికాంశాలు, మానవీయ విలువలను పాటించకపోవడంతో అనేక నష్టాలు జరుగుతున్నాయి. నేరుగా ప్రభుత్వాలే టెక్నాలజీని వినియోగించి ప్రజాప్రయోజనాల్లో కోత విధిస్తుండడంపై సర్వత్రా విమర్శలువెల్లువెత్తుతున్నాయి. నేడు జాతీయ టెక్నాలజీ డే సందర్భంగా క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలపై ప్రత్యేక కథనం..
- కపిలేశ్వరపురం(మండపేట)
* రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ కోసం వచ్చిన యువ హీరో రామ్‌చరణ్, హీరోయిన్ సమంత, డైరెక్టర్ సుకుమార్ సెల్ సిగ్నల్స్ లేక అల్లాడిపోయారు.
*కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామానికి చెందిన ఓ ఉపాధి కూలీ 23 నెలలుగా కూలి డబ్బులు తీసుకోలేని పరిస్థితి...
ఈ పరిణామాలను ప్రభావితం చేసే అంశాలన్నీ టెక్నాలజీకి సంబంధించినవే.
జాతీయ టెక్నాలజీ డే నేపథ్యమిదీ..
జాతీయ టెక్నాలజీ డే ను 1999 మే 11 నుంచి జరుపుకోవడం ప్రారంభించారు. 1998 మే 11న ఇండియన్ ఆర్మీ రాజస్థాన్‌లోని పోక్రాన్‌లో మూడు అణు బాంబులను ప్రయోగించి ప్రపంచంలో అణు సామర్థ్యం కలిగిన ఆరో దేశంగా గుర్తింపు సాధించింది.
అదే రోజున బెంగళూరులో హంస 3 ఇన్‌డైజినస్ హైర్‌క్రాఫ్ట్‌ను మొదటి సారి పరీక్షించింది. అదే రోజు త్రిశూల్ మిస్సైల్‌ను కూడా ప్రయోగించింది. ఈ కారణంగా మే 11న జాతీయ టెక్నాలజీ డే జరుపుకోవడం ప్రారంభమైంది.
కొత్త బంగారు లోకాన్ని సృష్టించిన టెక్నాలజీ
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మేధావుల కృషి ఫలితంగా కొత్త బంగారు లోకం సృష్టించిందని చెప్పొచ్చు. మానవ అవసరాలు తీర్చేవి. సమాజాన్ని అధ్యయనం చేసే సాధనాలు, నేరుగా వీక్షించే సదుపాయాలు, ఆహార అలవాట్లు ఇలా అన్నింటిలో టెక్నాలజీ కారణంగా మార్పులు చోటు చేసుకున్నవి. ప్రస్తుత విద్యా విధానంలో సాంకేతిక విద్యకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు ఇలా..
కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామానికి చెందిన వాసంశెట్టి అనంతలక్ష్మి అనే ఉపాధి కూలీ 23 నెలలుగా కూలి డబ్బులు తీసుకోలేని పరిస్థితి. ఆమె చేతి వేలి ముద్రలు అరిగిపోవడం, కంటి సమస్య తలెత్తడంతో జీతం ఇవ్వడంలేదు. ప్రత్యామ్నాయం చూపైనా డబ్బులివ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఏం చేయలేమని అధికారులు చేతులెత్తేశారు.
ప్రభుత్వ పథ«కాల్లో లబ్ధి పొందాలంటే ఆధార్‌కు అనుసంధానం కావాలంటూ విధించిన నిబంధన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ ప్రక్రియ హడావుడిగా జరగడం, తప్పులు తడకగా ఉండడంతో పింఛన్లు, రేషన్ కార్డులను పొందలేకపోతున్నారు.
సర్వర్ డౌన్..
జిల్లాలోని 64 మండలాల్లో 2,642 రేషన్ షాపులు ద్వారా తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ, అన్నయోజన కార్డులు సుమారు 16,11,494 ఉన్నాయి. సర్వర్ డౌన్ కారణంగా రేషన్ తీసుకోవడంలో తరచూ తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.
స్కాలర్‌షిప్‌లు పొందడంలో సమస్యలు..
జిల్లాలో సుమారు ఆరు వేల మంది విద్యార్థులు చేతి వేలి ముద్రలు పడకపోవడం, ఇతర సాంకేతిక కారణాల వల్ల రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులను పొందడంలో సమస్యలెదుర్కొంటున్నారు.
జిల్లాలోని 1069 ఈ పంచాయతీ గ్రామాల్లో 476 గ్రామాల్లో మాత్రమే జనన మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. సిబ్బంది లేకపోవడం, సాంకేతిక కారణాల వల్ల మీ సేవలను ఆశ్రయించాల్సి వస్తోంది.
చార్జీల మోత..
సాఫ్ట్‌వేర్ సమస్యలు కారణంగా ఆర్టీసీలో నగదు రహిత విధానం పూర్తిస్థాయిలో అమలు జరగడంలేదు. సుమారు 70 ఈ పోస్ యంత్రాలను ఏర్పాటు చేసినా పనిచేస్తున్నవి కేవలం 35 మాత్రమే. నగదు రహిత లావాదేవీల పేరుతో క్రెడిట్ కార్డు వినియోగంపై రెండు, డెబిట్ కార్డు వినియోగంపై ఒక శాతం చార్జీలు మోపుతున్నారు.
ఆధార్ సర్వర్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఈ నెల ఎనిమిదో తేదీన పూర్తిగా, తొమ్మిదిన మూడు గంటల వరకూ కాకినాడ, రాజమండ్రి రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని 32 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
సాంకేతిక అభివృద్ధికి పాలకులు చేస్తున్న కృషి అంతంత మాత్రమే
తిరుపతిలో నిర్వహించిన 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు సాంకేతిక అభివృద్ధిపైనే ఎక్కువగానే మాట్లాడారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నోబెల్ బహుమతి పొందిన వారికి రూ.వంద కోట్లు బహుమతి ఇస్తానని అన్నారు. దేశంలో నాలుగో పారిశ్రామిక విప్లవం నడుస్తుందని, మేకిన్ ఇండియాను స్ఫూర్తిగా తీసుకుని మేక్ ఇన్ ఏపీగా మార్చేందుకు కృషి చేస్తున్నానన్నారు. ఇన్ని మాటలు చెప్పిన సీఎం సాంకేతిక ప్రగతికి చేసిన కృషి అంతంతమాత్రమేనని చెప్పొచ్చు. రామచంద్రపురం పట్టణంలో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేసి 12,500 ఇళ్లకు రూ.149కే టీవీ, నెట్ అందిస్తానని చెప్పినా ఇప్పటి వరకూ ఆ దిశగా కృషి చేయలేదు. తిరుపతి సదస్సులో జిల్లా నుంచి 16 ప్రాజెక్టులు ప్రదర్శించిన విద్యార్థులకు ఏ విధమైన ప్రయోజనాలను కల్పించలేదు. జిల్లాలో 3,338 ప్రాథమిక, 387 ప్రాథమికోన్నత, 559 ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిలో తగిన విధంగా ల్యాబ్‌లు, సిబ్బంది లేరు.
సమస్యలన్నీ సామాన్యులకే..
టెక్నాలజీ వినియోగం వల్ల రేషన్‌లో పది శాతం, పెన్షన్లలో ఐదు శాతం, స్కాలర్‌షిప్‌లలో 20 శాతం నిధులు ఆదా అయ్యాయని సీఎం చంద్రబాబు ఓ సందర్భంగా ప్రకటించారు. దీనిని బట్టి సాంకేతిక కారణాలతో పేద, మధ్య తరగతి ప్రజలు పథకాల లబ్ధిలో ఎలా దూరమవుతున్నారో అర్థమవుతుంది. నగదు కష్టాలు నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. సంపన్నులు నల్లధనాన్ని చట్టబద్ధం చేసుకున్నారు. టెక్నాలజీ మానవ మేధస్సు నుంచి ఉత్పన్నమైంది. అది కచ్చితంగా ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చేదిగా ఉండాలి. ఆ దిశగా ప్రభుత్వాధినేతలు ఆలోచన చేసి సామాన్యులకు సైతం సాయమందించేలా కృషి చేయాల్సి ఉంది.
Advertisement
Advertisement