పాకిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టింది. ప్రధానిగా షాబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. షాబాజ్ అధికారం చేపట్టిన తర్వాత భారత్‌తో దౌత్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ నేపధ్యంలో పాకిస్తాన్ తమ జాతీయ దినోత్సవాన్ని ఈనెల 28న భారత రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించింది. కోవిడ్ -19 మహమ్మారితో పాటు ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాల కారణంగా నాలుగేళ్ల విరామం తర్వాత పాక్ తమ జాతీయ దినోత్సవాన్ని ఢిల్లీలో జరుపుకునేందుకు సిద్ధమవుతోంది.
1940లో లాహోర్ తీర్మానాన్ని ముస్లిం లీగ్ ఆమోదించింది. దీనికి గుర్తుగా సాధారణంగా మార్చి 23న పాకిస్తాన్ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈసారి దీనిని మార్చి 28న నిర్వహించేందు సన్నాహాలు చేస్తున్నారు. 1940, మార్చి 22 నుండి మార్చి 24 వరకు లాహోర్‌లో జరిగిన సమావేశాల్లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్.. లాహోర్ తీర్మానాన్ని ఆమోదించింది. దీనిలో భారతదేశంలోని ముస్లింల కోసం అధికారికంగా స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
అయితే ఈ ప్రతిపాదనలో ఎక్కడా ‘పాకిస్తాన్’ అనే పదాన్ని ప్రస్తావించలేదు. లాహోర్ తీర్మానాన్ని ఆమోదించిన తేదీని పాకిస్తాన్ తమ జాతీయ దినోత్సవంగా జరుపుకుంటుంది. 1956 మార్చి 23న పాక్ అధికారికంగా తన మొదటి రాజ్యాంగాన్ని ఆమోదించింది. దీంతో పాకిస్తాన్ డొమినియన్‌ను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్‌గా మారింది. 1960- 1968 మధ్య కాలంలో ఈ తీర్మానం ఆమోదం పొందిన స్థలంలో మినార్-ఎ-పాకిస్తాన్ నిర్మితమయ్యింది. దీనిపై తీర్మానానికి సంబంధించిన వివరాలు చెక్కారు.
పాకిస్తాన్ తమ జాతీయ దినోత్సవాన్ని న్యూ ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీ కాంప్లెక్స్‌లో మార్చి 28న జరుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో విదేశీ దౌత్యవేత్తలు, భారతీయులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల జాతీయ గీతాలు ఆలపించనున్నారు. అనంతరం పాకిస్తాన్ హైకమిషనర్, ముఖ్య అతిథి ప్రసంగాలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment