సైన్స్‌పై యువత ఆసక్తి చూపాలి
సాక్షి, బెంగళూరు: ఐటీ, బీటీ, వైద్య రంగాలపైనే మక్కువ చూపకుండా విజ్ఞానశాస్త్రంపై కూడా ఆసక్తి చూపాలని భారతరత్న పురస్కార విజేత, ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు యువతకు పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే రెండో పెద్ద దేశమైన భారత్‌లో సైన్స్‌కు అత్యంత ప్రాధాన్యతనిచ్చి 20 సంవత్సరాల రూట్‌మ్యాప్‌తో అభివృద్ధి పథంలో సాగాల్సి ఉందన్నారు. బెంగళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో సోమవారం జరిగిన ఓ సెమినార్‌లో ఆయన ప్రసంగిస్తూ.. భారత్ నేడు అన్ని రంగాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఆయా రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత విజ్ఞాన శాస్త్ర రంగానికి ఇవ్వటం లేదని విచారం వ్యక్తంచేశారు. ‘రాజకీయ నేతలు మూర్ఖులు’ అని తాను ఎవరినో అవమానించే ఉద్దేశంతో వ్యాఖ్యానించ లేదని రావు పేర్కొన్నారు.
దీనిని ఎవరూ తప్పుగా భావించ వద్దని కోరారు. ‘ముందు వాళ్లు సైన్స్ ప్రాధాన్యతను అర్థంచేసుకోవాలి. మన అవసరాలకు అనుగుణుంగా నిధులు కేటాయించాలి. తద్వారా భారత్ అభివృద్ధిసాధిస్తుంది. కానీ దీనిని అర్థం చేసుకోవటం లేదు. అది కొంత మూర్ఖపు పరిస్థితి’ అని మాత్రమే నేనన్నాను.. అదీ కోపంగా కాదు. నేను కోపిష్టిని కాదు’’ అని వివరణ ఇచ్చారు.