ధర్మాగ్రహం...!
ధర్మాగ్రహం...!
Published Tue, Nov 19 2013 12:14 AM | Last Updated on Mon, Sep 17 2018 5:17 PM
రాజకీయ నాయకులను విమర్శించడం, వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం మన దేశంలో కొత్తకాదు. ధనం, కులం, మతం, ప్రాంతం, నేరం వంటి అనేకానేక చట్రాల్లో ఇరుక్కుపోయిన రాజకీయరంగంలో... విశ్వసనీయత అన్న పదమే పరాయిదైపోయింది. గెలుపే లక్ష్యంగా, అధికారమే ధ్యేయంగా పనిచేసే రాజకీయ నాయకులవల్లా, పార్టీలవల్లా ఈ పరిస్థితి నానాటికీ దిగజారుతూనే ఉంది. ఈ స్థితిపై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తడంలో వింతేమీ లేదు. అలాంటివారిలో భారతరత్న పురస్కారాన్ని అందుకోనున్న శాస్త్రవేత్త, ప్రధాని సాంకేతిక వ్యవహారాల సలహా మండలి చైర్మన్ ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు చేరారు. భారతరత్న ప్రకటించిన మర్నాడే ఆయన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులంతా ఉత్త మూర్ఖులని అన్నట్టు మీడియాలో వచ్చింది.
అయితే, తాను రాజకీయ నాయకులందరినీ అనలేదని, అసలు తానన్న మాటల్నే మీడియా వక్రీకరించిందని ఆయన వివరణనిస్తున్నారు. ఆయన రాజకీయ నాయకుల్ని ఏమన్నారన్న సంగతిని పక్కనబెడితే ఆ సందర్భంగా ఆయన లేవనెత్తిన అంశాలు మాత్రం చాలా విలువైనవి. మన దేశంలో శాస్త్ర విజ్ఞాన పరిశోధనలకు మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉన్నదని ఆయనన్నారు. ప్రభుత్వం ఇస్తున్న నిధులతో పోలిస్తే శాస్త్రవేత్తలు చేస్తున్నది చాలా ఎక్కువేనని కూడా ఆయన చెప్పారు. పరిశోధనా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న తీరుపై ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు గతంలోనూ అసంతృప్తి వ్యక్తంచేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఉండాలన్నా... కనీసం ఇప్పుడున్న స్థితికంటే ముందుకెళ్లాలన్నా ఇతోధికంగా నిధులివ్వాల్సిన అవసరం ఉన్నదని ఆయన ఏడాదిక్రితం సూచించారు. ఆయన మాటకు విలువిచ్చి నిధులు పెంచుతామని ప్రధాని హామీ ఇచ్చినా అది సాకారం కాలేదు.
విజ్ఞాన శాస్త్ర రంగంలో ప్రొఫెసర్ సీవీ రామన్ నోబెల్ బహుమతి సాధించి 84ఏళ్లు కావస్తున్నది. అటు తర్వాత అందుకు సరితూగగల పరిశోధనలేవీ మన దేశంనుంచి లేవంటేనే మనం ఎక్కడున్నామో అర్ధమవుతుంది. అసలు ప్రామాణికమైన విద్యనందించే అగ్రశ్రేణి సంస్థలే మన దేశంలో కరువయ్యాయి. మొన్నామధ్య మన ఐఐటీల గురించి, వాటి స్థితిగతుల గురించి ఒక విదేశీ రేటింగ్ సంస్థ చేసిన వ్యాఖ్యానాలు చాలామందిని నొప్పించాయి. ఆ రేటింగ్‌లలో శాస్త్రీయత లేదని పలువురు విమర్శించారు. కానీ, ప్రపంచంలోని అత్యుత్తమ విద్యనందించే తొలి 200 సంస్థల్లో మన దేశానికి చెందిన ఒక్కటీ లేదని అనేకసార్లు నిర్ధారణైంది. ప్రాథమిక పాఠశాలల స్థాయినుంచి విశ్వవిద్యాలయాల వరకూ విద్య విషయంలో మన ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ఆ రంగంలో నిష్ణాతులను రూపొందించడంలో పెద్ద అవరోధంగా మారాయి. పాఠశాలల్లో కనీసం మరుగుదొడ్లయినా ఉండాలన్న సంగతి సుప్రీంకోర్టు చెప్పిన రెండేళ్లకు కూడా ప్రభుత్వాలకు అర్ధంకావడంలేదు. ఇక టీచర్లు, నల్లబల్లలు, పుస్తకాలు వగైరా సంగతులు చెప్పేదేముంది? నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలద్వారా ఒకప్పుడు ప్రపంచానికి విజ్ఞానభిక్ష పెట్టిన దేశం ఇప్పుడు దీనావస్థకు చేరుకుంది. ప్రొఫెసర్ రావు చెబుతున్నదాన్నిబట్టి నవకల్పన రంగానికి సంబంధించి రూపొందించిన 140 దేశాల జాబితాలో మన దేశం స్థానం 66! విద్యారంగాన్ని గత కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసిన పాలకుల పాపానికి ప్రతిఫలమిది.
మన పాలకులు అవకాశం వచ్చినప్పుడల్లా విజ్ఞానశాస్త్ర రంగానికి ప్రాధాన్యమిస్తామని చెబుతారు. ఆ రంగంలో మనం వెనకబడిపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తుంటారు. ఏటా జరిగే సైన్స్ కాంగ్రెస్ సదస్సుల్లో ఆ మాదిరి మాటలు చాలా వినబడుతూ ఉంటాయి. కానీ, మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో కేవలం 0.9 శాతం మొత్తాన్ని మాత్రమే పరిశోధనలపై ఖర్చు పెడుతున్నట్టు నిరుడు మన్మోహన్‌సింగే స్వయంగా వెల్లడించారు. దీన్ని రెట్టింపు చేస్తామని ఆయన హామీ ఇచ్చినా ఆచరణలో అది ఒక శాతం మించలేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
జీడీపీలో కనీసం 6శాతాన్ని ఖర్చుచేస్తే తప్ప ఈ రంగంలో మనం ముందుకెళ్లడం సాధ్యంకాదని ప్రొఫెసర్ రావు అంటున్నారు. ఆయన చెప్పినట్టు చైనాతో పోలిస్తే ఈ రంగంలో మనం చాలా వెనకబడి ఉన్నాం. అసలు ప్రాథమ్యాలను గుర్తించడంలోనే మనకూ, చైనాకూ ఎంతో అగాథం ఉంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధపెట్టి నాణ్యమైన విద్యను అందించడానికి కృషిచేస్తోంది. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేలా పాఠ్యాంశాలను రూపొందిస్తున్నది. క్షేత్రస్థాయి సమస్యలకూ, విద్యాలయాల్లో బోధించే విద్యకూ మధ్య అనుబంధం ఉండేలా చూస్తున్నది. ప్రపంచంలో పరిశోధనా రంగానికి వెచ్చించే నిధుల్లో 7శాతం చైనాయే ఖర్చుచేస్తున్నదంటే ఆ రంగానికి అది ఇస్తున్న ప్రాముఖ్యత ఎంతో అర్ధమవుతుంది.
చైనా వరకూ అవసరం లేదు... మనకంటే ఎంతో చిన్న దేశమైన దక్షిణ కొరియాతో పోల్చినా మనం ఎంతో వెనకబడి ఉన్నాం. సంఖ్యాపరంగా చూస్తే విజ్ఞాన శాస్త్రాల్లో ఏటా మన దేశంలో దాదాపు 9,000 మంది పీహెచ్‌డీలు పొందుతున్నారు. కానీ, అమెరికా నుంచి మేథోపరమైన పేటెంట్లు పొందేవారు ఏటా 4,000 మంది ఉంటే మన దేశంలో వందకు మించడంలేదు. వ్యవసాయం, వాతావరణం, వైద్యం, రక్షణ రంగాలకు ఈ పరిశోధనలవల్ల ఒనగూడే ప్రయోజనం దాదాపు ఏమీ ఉండటంలేదు. మన ఇంజనీరింగ్ కళాశాలలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను తయారు చేయడానికి చూపిస్తున్న శ్రద్ధలో పదోవంతు కూడా పరిశోధనలకివ్వడం లేదు. 2010-20ని ‘సృజన దశాబ్ది’గా ప్రకటించాక కూడా ఇవే పరిస్థితులు పునరావృతమవుతున్నాయంటే మనం సిగ్గుపడాలి. ఇప్పుడు ప్రొఫెసర్ రావు చేసిన వ్యాఖ్యల పర్యవసానంగానైనా పాలకులు మేల్కొని లోపాలను సరిదిద్దాలి. పరిశోధనారంగానికి జవసత్వాలివ్వాలి.
Advertisement
Advertisement