రాజకీయ నాయకులు మూర్ఖులు
బెంగళూరు: దేశ శాస్త్ర సాంకేతిక రంగాన్ని విస్మరిస్తున్న రాజకీయ నాయకుల తీరును ‘భారతరత్న’కు ఎంపికైన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ చింతామణి నాగేశ రామచంద్రరావు (సీఎన్‌ఆర్ రావు) తూర్పారబట్టారు. పొరుగు దేశమైన చైనా ఈ రంగంలో దూసుకుపోతున్నా మన నేతలు మాత్రం పరిశోధనలకు పెద్దపీట వేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. శాస్త్ర రంగానికి నామమాత్రపు నిధులు విదిలిస్తున్న నేతల వైఖరిని ఆక్షేపిస్తూ వారిని మూర్ఖులు (ఇడియట్లు)గా అభివర్ణించారు. శాస్త్ర రంగంలో మరిన్ని పెట్టుబడులు పెడతామంటూ ప్రధాని మన్మోహన్‌సింగ్ స్వయంగా హామీ ఇచ్చినా అది ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదని ప్రధాని శాస్త్ర సలహా మండలి చైర్మన్ కూడా అయిన రావు విమర్శించారు.
దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డుకు కేంద్ర ప్రభుత్వం తనను శనివారం ఎంపిక చేసిన నేపథ్యంలో ఆదివారం ఆయన బెంగళూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ విలేకరి దేశంలో శాస్త్ర రంగ ప్రమాణాలపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా ‘ఈ మూర్ఖపు రాజకీయ నాయకులు శాస్త్ర రంగానికి నామమాత్రపు నిధులిచ్చారు. అయినప్పటికీ మేం (శాస్త్రవేత్తలు) ఎంతో కొంత చేయగలిగాం. ఈ రంగంలో పెట్టుబడులే నామమాత్రం...పైగా దానికితోడు జాప్యం. మనకున్న నిధులనుబట్టి చూస్తే మేం (శాస్త్రవేత్తలు) బాగానే పనిచేశాం’ అంటూ ఆవేశంగా బదులిచ్చారు.
మనం చైనీయుల్లా కష్టపడం
శాస్త్ర, సాంకేతిక రంగంలో చైనా దూసుకుపోతున్న విషయాన్ని ప్రస్తావించగా ‘మన వెనకబాటుతనానికి మనం కూడా బాధ్యులమే. మనం భారతీయులం చైనీయుల్లాగా కష్టపడం. వారిలా జాతీయవాదులం కాదు. మనకు ఒకవేళ ఎక్కువ డబ్బు లభిస్తుందనుకుంటే విదేశాలకు వెళ్లేందుకూ సిద్ధంగా ఉంటాం’ అని వ్యాఖ్యానించారు.
శాస్త్రరంగంలో పెట్టుబడులపైనే దేశ భవిత
విద్య, శాస్త్ర, సాంకేతిక రంగంలో ఏ స్థాయిలో పెట్టుబడులు ఉంటాయనే దానిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని రావు పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం పరిశోధనలకు అందాల్సిన స్థాయిలో మద్దతు లభించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నవకల్పన రంగం (ఇన్నోవేషన్)లో 140 దేశాల జాబితాలో భారత్ 66వ స్థానంలో ఉందని చెప్పారు. ‘దేశ సెన్సెక్స్, వాణిజ్యం బాగున్నంత మాత్రాన సరిపోదు. ఈ ప్రభావం ఐదు, పదేళ్లకే పరిమితం. మరి దీర్ఘకాల పరిస్థితి ఏమిటి?’ అని ప్రశ్నించారు. దేశ జీడీపీలో కనీసం ఆరు శాతాన్ని మౌలిక విద్యపై పెట్టుబడి పెట్టాలని సూచించారు.
ఐటీకి, సైన్స్‌కు సంబంధం లేదు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)కి సైన్స్‌తో సంబంధం లేదని రావు పేర్కొన్నారు. కేవలం కొందరు డబ్బు సంపాదించేందుకే ఐటీ ఉందని వ్యాఖ్యానించారు. ఐటీ ఉద్యోగులు ఎప్పుడూ నిరాశావాదులని...పనిలో సంతోషం వెతుక్కోరని వ్యాఖ్యానించారు. నిరాశ వల్లే వారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. తాను మాత్రం నేటికీ పనిలో ఆనందం వెతుక్కుంటున్నానని చెప్పారు.
క్రీడలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు: దేశంలో విలువలు, ప్రాధాన్యతలు తగ్గిపోతున్నాయని రావు ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడలు, పోలీసు, సైన్యం లేదా ఇతరులకు ఇస్తున్న ప్రాధాన్యం శాస్త్రవేత్తలకు ఇవ్వట్లేదన్నారు. 2005లో తనకు నోబెల్ బహుమతితో సమానమైన 10 లక్షల డాలర్ల డాన్ డేవిడ్ ప్రైజ్ లభించినా దాని గురించి ఎవరూ మాట్లాడలేదన్నారు. ఒకవేళ అదే అవార్డును ఇతర దేశాల్లో ఎవరికైనా వచ్చి ఉండుంటే దాని గురించి గొప్పగా చెప్పుకునేవారన్నారు.