‘రత్నాలు'... రాజకీయాలు | Political controversies on Bharat Ratna | Sakshi
Sakshi News home page

‘రత్నాలు'... రాజకీయాలు

Published Sat, Nov 23 2013 1:40 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

‘రత్నాలు'... రాజకీయాలు - Sakshi

‘రత్నాలు'... రాజకీయాలు

విశ్లేషణ: పిళ్లా వెంకటేశ్వరరావు
 
వివాదం నేటి రాజకీయాల చిరునామా. కాదనేవాళ్లు ఇంకా సద్దుమణగని ‘భారతరత్న’ రభసను చూస్తే చాలు. తాజా వివాదంలో వాదం కంటే రాజకీయం పాలే ఎక్కువని ఒప్పుకుంటారు. భారత ప్రజాస్వామ్య పరిణతిని గానం చేయడం లేటెస్ట్ ‘దేశభక్తి’ ఫ్యాషన్. కాబట్టి ‘రత్న’ వివాదాన్ని మన ప్రజాస్వామ్య పరిణతికి సంకేతంగా ఎందుకు భావించకూడదు? ‘మనం మన అర్హతకు మించిన మెరుగైన పాలనకు నోచుకోకుండా నియంత్రించడానికి కనిపెట్టిన సాధనమే ప్రజాస్వామ్యం’ అని సుప్రసిద్ధ అమెరికన్ రచయిత హెచ్‌ఎల్ మెన్కెన్ 19వ శతాబ్దిలోనే చెప్పాడు. అది మింగుడు పడకపోతే ఆయన మాటల్ని తిరగేసి అన్వయించుకుంటే సరి. మన ప్రజాస్వామ్యం పరిణతి అంటే మన పరిణతే అవుతుంది. అదీ, ఇదీ కూడా మింగుడు పడకపోతే ‘భారత రత్న’ చరిత్రన ు ఓసారి తిరగేయడం మంచిది. 
 దేశంలోని అత్యున్నత పౌర పురస్కారంగా ‘భారతరత్న’ను ఏర్పాటు చేసిందే (1954) తడవుగా, మరుసటి ఏడే ప్రధాని పదవిలోని జవహర్‌లాల్ నెహ్రూ దాన్ని అందుకున్నందుకు ఆక్షేపించినవారు లేరు. ప్రథమ ప్రధాని ఎంపిక సమయంలో నెహ్రూకు సాటిరాగల వ్యక్తిగా నిలిచిన వల్లభ్‌భాయ్ పటేల్ ఆ పురస్కారం కోసం నాలుగు దశాబ్దాలు వేచి చూడాల్సి వచ్చింది. నెహ్రూ మనవడు రాజీవ్‌గాంధీతో పాటు 1991లో ఆయన భారత ర త్న అయ్యారు.పటేల్‌కు ఇవ్వలేదనో లేదా ఆలస్యంగా ఇచ్చారనో పెద్ద చర్చ సాగలేదు. అతి ఉదారంగా ఎక్కువ మందికి భారతరత్న పురస్కారాలను ప్రకటించిన ప్రధాని పీపీ నరసింహారావు... పటేల్‌తో పాటే సుభాష్ చంద్రబోస్‌కు కూడా ‘న్యాయం’ చేద్దామని చూశారు. రాష్ట్రపతి పదవికి ‘రబ్బరుస్టాంపు’ పేరు తెచ్చిన వీవీ గిరి తర్వాత పదహారేళ్లకు నేతాజీకి పురస్కారమా? అనే విమర్శకుల నసుగుడుకు మించిన రభస నాడూ జరగలేదు. ఈ ఆలస్యాన్ని అవమానంగా ఎంచి బోస్ కుటుంబసభ్యులు దాన్ని తిరస్కరించారనేది వేరేసంగతి. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ కూడా అదే ఏడాది... పురస్కారాల కమిటీలో ఉంటూ పురస్కారాన్ని అందుకోవడం సమంజసం కాదని తిరస్కరించారు. ఆయన మరణానంతరం, మరుసటి ఏడాది ఆజాద్‌కు ఆ పురస్కారం ఇచ్చారు. 
 
 ఇద్దరే ఇద్దరు
 ‘వెయిటింగ్ లిస్ట్’ను క్లియర్ చేయడమే లక్ష్యం అన్నట్టుగా చకచకా ఐదేళ్ల పదవీ కాలంలో ఎక్కువగా భారతరత్న  పురస్కారాలను ఇచ్చిన ప్రధానులు పీపీ నరసింహారావు, ఏబీ వాజపేయి. పూర్తికాలం పదవిలో ఉండి కూడా, దేశ ఆర్థిక, రాజకీయ జీవితంపై బలమైన ముద్రను వేసి కూడా(మంచా, చెడా అనేది అసందర్భం... ఎవరికి ఏది తోస్తే అదే) భారత రత్నకు నోచుకోని ఇద్దరే ఇద్దరు మాజీ ప్రధానులు. వారిద్దరూ అలా మిగలడమూ, ఎన్నడూ లేని విధంగా అత్యున్నత పురస్కారంపై నేడు రభస జరుగుతుండటమూ స్వాతంత్య్రానంతర కాలంలో దేశ రాజకీయాల గతిని సూచించే మైలు రాళ్లు కావడం విశేషం. ఇద్దరిలోనూ వాజపేయి నయం. ఆయన వెయిటింగ్ లిస్ట్‌లోనైనా ఉన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు, కొన్ని యూపీఏ పక్ష పార్టీలు ఆయన తరఫున వాదిస్తున్నాయి. బీజేపీ అదికారంలోకి రాకున్నా ఆయన భారతరత్న అయ్యే అవకాశం ఉంది. వాజపేయితో పాటూ రామ్‌మనోహర్ లోహియా, చరణ్‌సింగ్, కాన్షీరామ్, బాల్‌ఠాక్రే, బిజూ పట్నాయక్, ఎన్టీఆర్, వగైరాలతో చాలా పెద్ద వెయిటింగ్ లిస్టే తయారైంది. వివిధ రాజకీయేతర రంగాలలోని విశిష్ట వ్యక్తుల జాబితా మరొకటి హనుమంతుడి తోకలాగా పెరుగుతూ పోతోంది. ఈ జాబితాల రచ్చలో సోదిలోకి రాకుండా పోయినది పీవీ ఒక్కరే. మన్మోహన్‌కు రాజకీయ తీర్థం ఇచ్చి, దేశ ఆర్థిక మంత్రి పదవిని కట్టబెట్టి, ఆర్థిక సంస్కరణల ఛాంపియన్‌ను చేసినది పీపీ. ప్రధానిగా పదేళ్ల పదవీ కాలంలో మన్మోహన్ ఈ అత్యున్నత పురస్కారాన్ని ఆయనకు ఇవ్వలేకపోవడానికి ‘తగు’ కారణమే ఉందని అందరికీ తెలిసిందే. ప్రధాని సకల శక్తివంతుడైన దేశాధినేతగా ప్రారంభమైన మన ప్రజాస్వామ్య వ్యవస్థకు సోనియాగాంధీ ‘బంట్ల పాలన’ అనే సరికొత్త అధ్యాయాన్ని చేర్చారు. పీపీతోనే దానికి నాంది పలకాలని ఆశించి భంగపడ్డారు. మన్మో హన్‌తో సఫలమయ్యానని సంతృప్తి చెందుతున్నారు. ఆమె మళ్లీ పొరబడ్డారనేది పూర్తిగా అసందర్భం. రాజీవ్ పాలన వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండటం అంటే నెహ్రూ-ఇందిరల కుటుంబం అధికారంలో ఉండటమే (లాల్‌బహదూర్ శాస్త్రిని మినహాయిస్తే). ‘అమ్మ’ బంటుగా ఢిల్లీ గద్దెనెక్కిన పీవీ... బంటుగా గాక రాజుగా వ్యవహరించారు. ఫలితాన్ని అనుభవించారు, ఢిల్లీలో అంత్యక్రియలకే నోచుకోని ఆయనను ‘రత్నాన్ని’ ఏం చేస్తారనో ఏమో పీవీ పేరును వెయిటింగ్ లిస్ట్‌కు చేర్చే ప్రయత్నం కూడా ఎవరూ చేయడం లేదు.
 
 ‘రత్నం’ రంగు రాజకీయం
 ఇక వర్తమానానికి వస్తే... మున్నెన్నడూ లేని విధంగా నేడు ఇంత రభస ఎందుకు జరుగుతున్నట్టు? అది ఏం చూసిస్తున్నట్టు? సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న ప్రకటించడంలో యూపీఏ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అనవసర తొందరపాటును ప్రదర్శించిందనేది ప్రధానంగా వినవస్తున్న వాదన. క్రికెట్ ప్రపంచంలో సచిన్ అసమాన ప్రతిభాశాలి అనడంలో ఎలాంటి వివాదమూ లేదు. అయినా గానీ సచిన్‌కు అత్యున్నత పురస్కారాన్ని అందుకునే అర్హత ఉన్నదా? అంతకంటే ముందే ఆ పురస్కారాన్ని అందుకోవాల్సిన వారి మాటేమిటి? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నవారికి కొదవలేదు. సీఎన్‌ఆర్ రావు గురించి ఏ గొడవా లేదు. సచిన్ ఒక్కడికే ఇస్తే అది ఎన్నికల ‘తొందరపాటు’ రాజకీయం అనిపిస్తుందనే ఆయన పేరును చేర్చారనేది బహిరంగ రహస్యం. భారతరత్న ఆయనకు అనూహ్యంగా, హఠాత్తుగా వచ్చిపడ్డ లబ్ధి (విండ్ ఫాల్ గెయిన్). కాబట్టి ఆయన ఈ రచ్చకు ‘అతీతుడు’ కావాల్సింది. కానీ కాలేదు. ‘కృతజ్ఞత’ చూపాల్సిన సీఎన్‌ఆర్ రావు... రాజకీయనేతల చేతుల్లో పడి విజ్ఞానశాస్త్ర రంగం భ్రష్టుపట్టి పోతోందంటూ విరుచుకుపడి యూపీఏను రచ్చ కీడ్చారు. తర్వాత ఆయన ‘శాంతించినా’ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలా మంది భావిస్తున్నట్టు యూపీఏ ఈ వ్యవహారంలో ‘తొందరపాటు’ ప్రదర్శించ లేదు. సచిన్ కంటే ముందుగానే కాంగ్రెస్ రాజనీతి దురంధరులు ఎన్నికల ముందు చూపుతో సచిన్ రిటైర్మెంట్‌కు కానుకను సిద్ధం చేసారు. 2011 డిసెంబర్‌లోనే క్రీడాకారులకు కూడా భారత రత్నకు అర్హతను కల్పించేలా నిబంధనలను సవరించారు. ఆ తదుపరి ప్రకటించిన పురస్కారాలు ఇవే. జాతీయ వ్యసనమా అనిపించేంతగా విస్తరించిన క్రికెట్ అభిమానాన్ని, ఆ ఆటకు ఇలవేలుపుగా వెలుగుతున్న సచిన్ రిటైర్మెంట్‌ను ఓట్ల కాలంలో సొమ్ము చేసుకోలేని అధికారం ఉండి ఫలమేమిటని అనుకోని పార్టీలు ఏవన్నా ఉన్నాయా?  సచిన్‌కు భారతరత్న ఎందుకు ఇవ్వరని మోడీ, శివసేనల నుంచి అంతా పోటీపడి ప్రకటనలు గుప్పించాక మేల్కోవడం కంటే ముందే సిద్ధం కావడం మంచి ఎత్తుగడే. కానీ కాంగ్రెస్ తలరాతే... ‘కాలం’ కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్టుంది. అందుకే అత్యంత వివాదరహితుడైన క్రికెటర్‌గా పేరుమోసిన సచిన్ భారతరత్న అతి పెద్ద వివాదమైంది. ఆ వివాదం భారతరత్నకు ఆది నుంచి అంటుకున్న రాజకీయాల రంగును వెలుగులోకి తెస్తోంది. మొదటి నుంచి ఈ పురస్కారం ప్రధాని, అధికార పార్టీల ఇష్టాయిష్టాలపై ఆధారపడినదిగానే ఉంటున్న విషయం తేటతెల్లమవుతోంది. 
 
 క్షీణ రాజకీయ శకం
 ఒకప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌కు ఉన్న తిరుగులేని రాజకీయ అధికారం వల్లనే అన్ని రంగాల్లోలాగానే అత్యున్నత పురస్కారాల విషయంలోనూ అసమ్మతి స్వరాలు, ధిక్కార గళాలు పెద్దగా వినిపించేవి కావు. ఎప్పుడో మాట కాదు,  1988లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు ఎంజీఆర్‌కు ఈ పురస్కారం ఇచ్చినప్పుడు కూడా అది పెద్ద వివాదం కాలేదు. అంబేద్కర్ కంటే రెండేళ్ల ముందు, పటేల్ కంటే మూడేళ్ల ముందు, నేతాజీ కంటే నాలుగేళ్ల ముందు ఆయనకు ఈ పురస్కారాన్ని కట్టబెట్టడం రాజకీయం గాక మరేమిటి? వాజపేయి ప్రభుత్వ హయాంలో సైతం కాంగ్రెస్‌కు చెందిన పీవీకి భారతరత్న ఇవ్వడం కంటే ఎవరికీ ఇవ్వకపోవడమే ఉత్తమమని భావించలేదా? అందరికంటే ఎక్కువగా భారతరత్నలను అందించిన ఆయన హయాంలో ఒక్క జయప్రకాష్ నారాయణ్ మాత్రమే రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తి. నేడు అందరికంటే గట్టిగా ఎన్టీఆర్‌కు భారతరత్న కావాలని కోరుతున్న చంద్రబాబు నాయుడు ఎన్‌డీఏ హయాంలో కింగ్ మేకర్. ఆయన మాటకు కట్టుబడే ఆనాడు వాజపేయి ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును విస్మరించలేదా? అది రాజకీయం కాక మరేమిటి? అయితే ఈసారే ఇలా భారతరత్నపై నిర్భయంగా భిన్నాభిప్రాయాలను ప్రకటించగలగడం, ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించడం, ఇలా శల్య పరీక్షకు గురిచేయడం. ఎవరికి వారుగా ఎక్కడికక్కడ జాబితాలు తయారు చేయడం ఏం సూచిస్తోంది? కేంద్రంపై జాతీయపార్టీల పట్టుసడలిపోవడం అనేది నిజమే. అంతకుమించి కేంద్రంలో అధికారం నెరపుతున్న ప్రభుత్వాల నైతిక అధికారం రోజురోజుకూ క్షీణించిపోతుండటం కాదా? ఈ క్షీణత ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వాలకు సంబంధించినదేకాదు. బీజేపీ అందుకు మినహాయింపు కానేకాదు. కాబట్టే ఒకప్పుడు ఎన్‌డీఏ భాగస్వాములు కావడానికి వాజపేయి ఉదారవాదం, గాం దేయ సోషలిజాల మొహం బిజేపీకి అవసరమైంది. నేడు ఆ అవసరం లేదు. మోడీ మొహంతోనే మిత్రులను కూడగట్టుకోగలదు. నితీష్, మోడీ వ్యతిరేకత పచ్చి రాజకీయం లేదా అవకాశవాదం మాత్రమే. ఇదంతా మన ప్రజాస్వామ్యం పరిణతిగా భావించలేకపోతే... ‘ప్రజాస్వామ్యం ఒక కల మాత్రమే. అర్కేడియా, శాంతాక్లాజ్, స్వర్గం కోవలోకే దాన్ని కూడా చేర్చాలి’ (మెన్కెన్).

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement