Pilla Venkateshwar Rao
-
ఇరాక్‌పై ముసుగు యుద్ధం
‘‘మీడియా ఎవరినైనా వెర్రివాళ్లను చేయగలదు- సాధారణంగా ఉద్దేశపూరితంగా, అప్పుడప్పుడు మరెవరి చేతిలోనో వెర్రిదిగా మారి.’’ ఇరాక్ పరిణామాలపై అంతర్జాతీయ మీడియా వడ్డిస్తున్న మూసపోత కథనాలను చూస్తే రెండూ ఒకేసారి జరుగుతున్నట్టుంది. పదిహేను వందల మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇలా దాడి చేశారో లేదో 20 లక్షల జనాభాగల మొసుల్ నగరంలోని 50 వేల భద్రతా సిబ్బంది తుపాకులు పారేసి పరుగు లంకించుకున్నారని అది చెప్పింది. నోళ్లు తెరుచుకు విన్నాం. ఐఎస్ఐఎస్ ఎంతటి అరి వీర భయంకరమైనది కాకపోతే దాని ధాటికి వారం గడవక ముందే ఉత్తర ఇరాక్‌లోని పట్టణాలు, నగరాలు, చమురు కేంద్రాలు వారి వశమైపోతాయి? శ్వేత సౌధాధీశుడు బరాక్ ఒబామా ఐఎస్ఐఎస్ ఉత్పాతం అమెరికా ప్రయోజనాలకు సైతం ప్రమాదకరమని కలవరపడతారు? ఇరాక్‌ను ఆదుకోడానికి ఇవిగో ద్రోన్లు, అవిగో వైమానిక దాడులు, అల్లదిగో సైన్యం అంటూ కాకి గోలే తప్ప కదలడం లేదెందుకు? సీఐఏ ఏం చేస్తున్నట్టు? పేపరు చూస్తేగానీ అధ్యక్షుల వారికి మొసుల్ పతనం సంగతి తెలియలేదు! సీఐఏని మూసేసి, కాంట్రాక్టు కూలీలకు పేపర్లను తిరిగేసే పనిని అప్పగించి ఉంటే ఈ ‘హఠాత్పరిణామానికి’ ‘దిగ్భ్రాంతి’ చెం దాల్సి వచ్చేది కాదు. సిరియాలోని లతాకియా, ఇద్లిబ్ రాష్ట్రాలలోని తన ఉగ్రమూకలను ఐఎస్ఐస్ సిరియాకు తూర్పున ఉన్న ఇరాక్ సరిహద్దుల్లో మోహరిస్తోందని లెబనాన్ డైలీ మార్చిలో తెలిపింది. అయినా ప్రపంచ నేతకు తెలియలేదంటే నమ్మాల్సిందే, చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడూ లోకువే. సద్దాం పునరుత్థానం వారం రోజుల పాటూ మొసుల్, తదితర పట్టణాలను సందర్శించి వివిధ వర్గాల ప్రజలతో చర్చించి వచ్చిన జూడెన్ టోడెన్హాఫర్ 2,70,000 ఆధునిక సైన్యంపై ఐఎస్ఐఎస్ సాధించిన ‘అత్యద్భుత విజయాన్ని’ ఒక్క ముక్కలో చెప్పారు... ఈ యుద్ధంలో ఐఎస్ఐఎస్ ‘జూనియర్ పార్టనర్’ మాత్రమే. అసలు పాత్రధారి ఎవరు? మొసుల్‌లో ఇప్పుడు ఇంటింటా వేలాడుతున్న సైనిక దుస్తుల పెద్ద మనిషి... ఇజ్జత్ ఇబ్రహీం అల్-దౌరీ. ఆయన 2003లో అమెరికా సైనిక దురాక్రమణతో హతమార్చిన సద్దాం హుస్సేన్‌కు కుడి భుజం, బాత్ పార్టీ ప్రధాన సిద్ధాంత కర్త, మొసుల్‌లో పుట్టి పెరిగినవాడు. ఐఎస్ఐఎస్ వీరాధివీరులు కనిపించగానే ఇరాక్ సేనలు ‘మటుమాయమైపోవడం’ (మెల్టెడ్ ఎవే) అనే అద్భుతం ఎలా సాధ్యమో ఇప్పుడు తేలిగ్గానే అం తుబడుతుంది. తూర్పున ఉన్న కుర్దు ప్రాంతాల్లో, ఉత్తరాదిన షియా ప్రాం తాల్లో మాత్రం సంకుల సమరం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న సున్నీ బాతిస్టు పార్టీ రహస్య నిర్మాణానికి తిరుగులేని నేత దౌరీయే. 2003 నుంచి అమెరికా సేనలకు వ్యతిరేకంగానూ, నేడు షియా నౌరి అల్ మలికి ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ సైనిక ప్రతిఘటనకు నేతృత్వం వహిస్తున్నాడు. ఆయన నేతృత్వంలో కనీసం 20,000 బలగాలు ఉన్నట్టు అంచనా. ఇక సద్దాం హయాంలో ఉన్నతోద్యోగాల్లో, పదవుల్లో వెలగిన సున్నీలు షియా మలికి ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారు. ఈ పరిస్థితిలో ఐఎస్ఐఎస్ ముసుగుతో ప్రారంభమైన దాడికి సున్నీ ప్రజల మద్దతు లభిస్తోంది. శతాబ్దాల షియా, సున్నీ శత్రుత్వం మిథ్య అంతర్జాతీయ మీడియా వ్యాపింపజేసిన మరో కట్టుకథ.. 1400 ఏళ్ల షియా, సున్నీ వైరం. ఇస్లాంలోని రెండు ప్రధాన శాఖల మధ్య విభేదాలు, కొంత సంఘర్షణ ఉన్నమాట నిజమే. కానీ నేడు ఐఎస్ఐఎస్ సాగిస్తున్న షియా ఊచకోత స్థాయికి అది చేరిన వైనం చరిత్రలో ఎక్కడా లేదు. సద్దాం పాలనలో సున్నీల పట్ల పక్షపాతం ఉన్నా... షియాలపై దాడులు, విద్వేషం ఎరుగరు. 2003లో సైనిక దురాక్రమణ తదుపరి అమెరికాయే మొట్టమొదటిసారిగా ఈ విద్వేషాలను రగిల్చింది. సున్నీలంతా, సద్దాం అనుయాయులేనని బావించి వారికి స్థానమే లేని షియా ప్రభుత్వాన్ని మాలికి నేతృత్వంలో ఏర్పాటు చేసింది. బాతిస్టు సైనిక నేతలు అమెరికా ఏర్పరిచే ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధపడినా అమెరికా వారిని వేటాడి చంపింది. (విమర్శకుల ప్రశంసలందుకుని, బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డ ‘గ్రీన్ జోన్’ (2010) చూడండి). సున్నీల పట్ల అమెరికా అనుసరించిన ఈ విద్వేషపూరిత వైఖరే ఇస్లామిక్ తీవ్రవాదం, అల్‌కాయిదాలకు ఊపిరులూదింది. బాతిస్టు పార్టీ, ఇతర సున్నీ మిలీషియాల ప్రతిఘటన తారస్థాయికి చేరడంతో అమెరికా పలాయనం చిత్తగించింది. కానీ అది రగిల్చిన మత విద్వేషాల కార్చిచ్చు రగులుతూనే ఉంది. 2003 ఇరాక్ దురాక్రమణ నుంచి నేటి వరకు మధ్య ప్రాచ్యంలో అమెరికా సాధించిన ఏకైక ఘనకార్యం ఏమిటి? ఇరాక్, లిబియా, సిరియాల్లో లౌకికవాదం సమాధులపై మతోన్మాద రక్కసులను ఆవిష్కరించడమే. ఇరాక్‌లోని బాతిస్టు పార్టీ లౌకికతత్వానికి కట్టుబడ్డ పార్టీ. సద్దాం హయంలో సైతం బాగ్దాద్‌లో కుర్దులు సురక్షితంగా ఉండగలిగారు! అలాంటి లౌకికవాద బాతిస్టు పార్టీకి. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంత్ (ఐఎస్ఐఎల్) వంటి సున్నీ ఉగ్రవాద సంస్థకు మధ్య అపవిత్ర కూటమి ఎలా సాధ్యమైంది? ఆ సూత్రధారి ఎవరో తెలియాలంటే... జోర్డాన్‌లోని సఫావీలో ఐఎస్ఐఎస్, జబాత్ అల్ నస్రా తదితర సిరియా ఉగ్రవాద మూకలకు సీఐఏ అధికారులు, సైనిక నేతలు శిక్షణ శిబిరాలను నిర్వహించారని జర్మన్ పత్రిక ‘దెర్ స్పెగెల్’ గత మార్చిలో వెల్లడించింది. అంతర్జాతీయ మీడియా వినిపిస్తున్న కథనాల ప్రకా రం ఇప్పుడు ఐఎస్ఐఎస్ వెనుక ఉన్న శక్తులు సౌదీ అరేబియా, ఖతార్‌లు. సౌదీకి, బాతిస్టులకు బద్ద వైరం. అంటే సౌదీ, దాని బద్ధ శత్రువైన బాతిస్టులు కూడా ఐఎస్ఐఎస్తో కుమ్మక్కయ్యారని అర్థమా? ఇరాక్‌లోని మలికి ప్రభుత్వానికి నమ్మకమైన మిత్రునిగా ఉన్న టర్కీ ప్రధాని ఎర్డోగాన్ మిత్ర ద్రోహా? అదృశ్య సూత్రధారి ఎవరు? ఐఎస్ఐఎస్ 2003లో అది పుట్టినప్పుడు ఉత్త ఐఎస్ఐ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్). దానికి సౌదీ, ఖతార్‌ల అండదండలున్నమాట నిజమే. షియా మలికి ప్రభుత్వాన్ని కూల్చడమే దాని లక్ష్యం. 2012లో జోర్డాన్, టర్కీలలోని సీఐఏ శిక్షణ శిబిరాల్లో అది శిక్షణను పొందినది మాత్రం సిరియాలోని అసద్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం. అందుకే అది ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఇరాక్)గా మారింది. అప్పటికి అది సౌదీ, ఖతార్, టర్కీ, సీఐఏలకు ఉగ్రవాద సేన. ఒబామా సిరియా సమస్యపై రష్యాతో ఘర్షణకు సిద్ధపడక వెనకడుగు వేయడంతో కథ ఊహించని మలుపు తిరిగింది. ఐఎస్ఐఎస్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంత్ అంటూ ఇరాక్ సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్డాన్, సైప్రస్, దక్షిణ టర్కీలతో కూడిన ఖిలాఫత్ రాజ్యాన్ని ఏర్పాటు చేసే లక్ష్యాన్ని ప్రకటించింది. దీంతో టర్కీ దానితో తెగతెంపులు చేసుకుంది. అప్పటికే ఎర్డోగాన్ సహాయంతో దౌరీ ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఈ విషయాన్ని గ్రహించి సౌదీ దానితో సంబంధాలు పెంచుకుంది. అంతర్జాతీయ మీడియా ఆ విషయాన్ని మరచిపోయినట్టు నటిస్తోంది. సౌదీ, ఖతార్‌ల వైపు వేలెత్తి చూపుతోంది. ఎందుకు?దొంగే దొంగ అని అరిచేదెందుకో అందుకే? మలికి ప్రభుత్వం తప్పుకోవాలని, సున్నీలు, షియాలు, కుర్దులకు ప్రాతినిధ్యం ఉండే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తప్ప సహాయం అందించేది లేదని బుధవారం శ్వేత సౌధం చేసిన ప్రకటనను చూడండి. అమెరికా ఇప్పుడు సిరియాలోలా ప్రభుత్వం మార్పును కోరుతోంది. ఈ పాచిక తప్పక పారుతుందనే భావి స్తోంది. ఇరాక్‌లో అమెరికా సేనలు నిలిపి ఉంచనిచ్చేది లేదని, చమురు నిల్వలను ప్రైవేటు పరం చేసే బిల్లుపై సంతకం చేయనని నిరాకరించిన మలికి అందుకు అంగీకరించవచ్చు. లేకపోతే సున్నీ, షియా, కుర్దుల మధ్య ఇరాక్ మూడు ముక్కలవుతుంది. రెండు దశాబ్దాలుగా కలలుగంటున్న ఇరాక్, సిరియా, ఇరాన్‌లను ఒక్కొక్కదాన్ని మూడు ముక్కలుగా చేయాలన్న కలకు సిరియాలో పడాల్సిన నాంది ఇరాక్‌లో పడుతుంది. కొసమెరుపు ఏమిటంటే మలికితో సన్నిహిత సంబంధాలున్న ఇరాన్‌ను ఏకాకిని చే యాలనే ప్రధాన లక్ష్యంతో కదలుతున్న అమెరికా ఇరాక్ సంక్షోభ పరిష్కారం కోసం అదే ఇరాన్‌కు స్నేహ హస్తాన్ని చాస్తున్నట్టు నటించడం. - పిళ్లా వెంకటేశ్వరరావు -
ఓటుకు ముందే ఓడిన మహిళ
1935 భారత ప్రభుత్వ చట్టం నాటి నుంచి మన పార్టీలు మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. రాజ్యాంగంలో మహిళా రిజర్వేషన్లన్న మాటే రాకుండా కాంగ్రెస్ తదితర పార్టీలు జాగ్రత్త వహించాయి. నాటి నుంచి నేటి వరకు వాటిది అదే తీరు. ఆ తీరు మారేది కాదు. రిజర్వేషన్లు లేకుండా చట్ట సభల్లో మహిళా ప్రతినిధ్యం పెరగడం అసంభవం. మహిళా సాధికారతను కోరే వారంతా సంబరాలు జరుపుకోవాల్సి న సమయమిది. కొలువుదీరనున్న పదహారవ లోక్‌సభలో మహిళా సభ్యుల సంఖ్య స్వాంతంత్య్రానంతర కాలంలోకెల్లా అత్యధిక స్థాయికి చేరింది. 543 స్థానాలున్న లోక్‌సభలో 61 మంది... 11.2 శాతం మహిళలే! గత లోక్‌సభతో పోలిస్తే ఇద్దరు ఎక్కువ. మహిళా సాధికారత దిశగా మనం సాధించిన ఘన విజయమిది. ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు రెండూ 1997 నుంచి చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకు పట్టంగడతామని చెప్పుకుంటూనే ఉన్నాయి. 2010లో యూపీఏ ప్రవేశపెట్టిన బిల్లు లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కట్టబెట్టేసినంత పని చేసింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు గట్టెక్కక పోవడానికి కారణాలు ‘అంతుపట్టేవి’ కావు. ఆ సంగతి పక్కనబెట్టి, ఈసారి మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామని ఢంకా బజాయించిన కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు వారికి ఏ స్థానం ఇచ్చాయో చూడ్డం తేలిక. అవి మూడూ కలిసి బరిలోకి దించిన మొ త్తం 1,325 మంది అభ్యర్థుల్లో మహిళల సంఖ్య 631...12 శాతం! మొత్తం అభ్యర్థులు 8,251 మంది కాగా వారిలో 668 మంది మాత్రమే మహిళలు! ఓటమికి మారుపేరు మహిళ మహిళల పట్ల ఎంతగా సానుభూతి కట్టలు తెంచుకుంటున్న పార్టీలకైనా టిక్కెట్లిచ్చే సమయానికి వచ్చి పడే ఇబ్బంది ఒక్కటే... గెలవగలగడం. ఓటమి పుట్టుకకు ముందే ఆడాళ్లకు రాసిపెట్టి ఉన్న తలరాత. దాన్ని మార్చడం ఎవరి తరం? ఎలాగూ ఓడేవారికి సీట్లిస్తే మాత్రం ఒరిగేదేమిటి? ఫలితాలు మాత్రం మగ అభ్యర్థులతో పోలిస్తే మహిళలకే గెలుపు అవకాశాలు ఎక్కువని సూచిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం మగ అభ్యర్థుల్లో 6.36 శాతం గెలిస్తే, మహిళల్లో 9.13 శాతం గెలిచారు! ఎన్నికల ప్రక్రియలో మహిళలు పాల్గొనడం తక్కువగా ఉండగా మహిళా ప్రాతినిధ్యం ఎలా పెంచగలుగుతామనేది మరోవాదన. ఇందులో కొంత వాస్తవం ఉన్నా అది కొండంత మార్పు ను కనపించకుండా చేసేదేమీ కాదు. ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో స్త్రీ, పురుషుల మధ్య అంతరం పూడిపోతూ వస్తోంది. 1962లో మహిళల కంటే పురుషులు 16.7 శాతం ఎక్కువగా ఓటు హక్కును వివియోగించుకోగా... 2009 నాటికి అ తేడా 4.4 శాతానికి పడిపోయింది. వీధుల కెక్కి, వేదికలకెక్కి ఎన్నికల ప్రచారంలోనూ, పార్టీ కార్యకాలాపాల్లోనూ పాల్గొనే మహిళల సంఖ్య పెరుగుతోంది. ప్రత్యేకించి 1990ల నుంచి రాజకీయాల్లో, పార్టీల్లో మహిళల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోంది. అన్ని వర్గాల మహిళల్లో పెరుగుతున్న ఈ రాజకీయ చైతన్యం ఒక పార్శ్వం మాత్రమే. ఒకప్పటిలాగా నేడు ఇంటి పెద్దగా మగాడిని ఆకట్టుకుంటే ఆడాళ్లందరి ఓట్లు పడతాయనే హామీ లేకుండా పోతోంది. ఇది ఈ పరిణామానికి ఉన్న మరో పార్శ్వం. సగం ఓటర్లుగా ఉన్న మహిళలను ఆకట్టుకోడానికి మహిళా కార్యకర్తలు, నేతలు, ప్రత్యేక వాగ్దానాలు పార్టీలకు తప్పనిసరి అవుతున్నాయి. వెరసి పార్టీల, రాజకీయాల లైంగికపరమైన అమరికలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చట్ట సభల్లో అవి ప్రతిఫలిం చడం లేదు ఎందుకు? మహిళల్లో నాయకత్వ లక్షణాలు కొరవడటం. ఆడ నెత్తురులో లేనిది జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ మహిళలకు అతి తక్కువ సీట్లను కేటాయించడానికి మరో కారణం. పార్టీ నిర్మాణం నిచ్చెన మెట్లు ఎక్కి వ చ్చిన పై స్థాయి నేతలు అతి తక్కువగా ఉండటం. ఎక్కువ మంది దిగువ మెట్ల మీదే చతికిలబడక తప్పడం లేదు. నాయకత్వ లక్షణాలు కొరవడటం వల్లనే వారు ఉన్న త స్థానాలకు ఎదగలేకపోతున్నారనేది తరచుగా వినిపించే వాదన. నాయకత్వ లక్షణాలను మగ పుట్టుకతో సంక్రమించేవిగా చూడటం పార్టీలకు అలవాటుగా మారింది. ఇళ్లల్లో, పని ప్రదేశాల్లో, వీధుల్లో ఎక్కడైనా కనిపించే స్రీల పట్ల వివక్షను అధిగమించినట్టు కమ్యూనిస్టులు సహా అన్ని పార్టీలు నటిస్తుంటాయి. కానీ పార్టీ నిర్మాణం అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయి వరకు అదే కనిపిస్తుంది. అసలు పార్టీ నిచ్చెనే మహిళలు ఎక్కలేని మాయా మెట్ల మయం. ఉట్టికెగర లేని వాళ్లు స్వర్గానికి ఎగరలేరు. చట్టసభలకు ఎగబాకాల ని అంగలార్చరాదు. సోనియాగాంధీ, మమతా బెనర్జీ, జయలలిత, మాయావతి ఎవరూ మాయ నిచ్చెనను మార్చలేకపోయారు. పార్టీల్లో వ్యవస్థీకృతమైనమైన ఈ అదృశ్య వడపోత యంత్రం బారి నుంచి తప్పించుకుని పైకి ఎది గిన వాళ్లు కొద్దిమందే. అత్యధిక శాతం పెద్దగా పోటీలేని దిగువస్థాయి అలంకార ప్రాయమైన పదవులతో సరిపెట్టుకుంటారు. ఇందిరాగాంధీ నుంచి మాయావతి, జయలలిత, మమతా బెనర్జీల వరకు అత్యున్నత స్థానాలకు ఎదిగిన మహిళలంతా ‘మగాడురా’ అనిపించుకుంటారే తప్ప సమర్థవంతమైన మహిళా నేతలకు ఉదాహరణలుగా పార్టీలకు కనిపించరు. మహిళలు మంచి పార్లమెంటేరియన్లు కాలేరనేది మరో వాదన. ఆ అర్హతే నిజమైతే నిన్నటి ఎన్నికల్లో కాంగ్రె స్ తరఫున షీలా దీక్షిత్, మీరా కుమార్‌లు కాకున్నా ప్రియాంకాగాంధీ, బీజేపీ తరఫున సుశ్మాస్వరాజ్ ప్రధాని అభ్యర్థులుగా తలపడాల్సి వచ్చేది. గత వైభవ ఘన కీర్తి మన్మోహన్సింగ్ నేతృత్వంలో మన దేశం ప్రాంతీయ ఆగ్రరాజ్యంగా మారిం దన్నారు. భావి ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్య ంగా మారుస్తారంటున్నారు. మహిళా ప్రాతినిధ్యం రికార్డు స్థాయికి (11.2 శాతానికి) చేరిన నేటి మన స్థితిని మోడీ ప్రమాణ స్వీకార ఉత్సవానికి విచ్చేయబోతున్న ‘సార్క్’ దేశాలతో సరిపోల్చడం సందర్భోచితం. సార్క్ దేశాలన్నిటిలోనూ పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం ప్రపంచ సగటు 20 శాతం కంటే తక్కువగా ఉన్న దేశాలు రెండే రెండు... భారత్, శ్రీలంక (4.89). మహిళా హక్కుల కాలరాచివేతకు మారు పేరుగా చెప్పే అఫ్ఘానిస్థాన్ పార్లమెంటు 27 శాతం మహిళలతో సార్క్ దేశాల్లో ప్రథమ స్థానం లో ఉంది. పాకిస్థాన్ పార్లమెంటులో సైతం 21.35 శాతం మహిళలు. ఇక మన ప్రతిష్టను నిలపగలిగేది ఏది? మనం మరచిన గత వైభవ ఘనకీర్తే. ఈ విషయంలో ఒకప్పుడు ప్రపంచంలోనే మూడవ స్థానంలో నిలిచిన ఘనత మనకుంది. బ్రిటిష్ పాలనలో 1937లో పరిమిత ఓటింగ్ హక్కులతో జరిగిన ఎన్నికల్లో మొత్తం 80 మంది మహిళా సభ్యులు ఉండేవారు. నాడు మన దేశం ప్రపంచంలో అమెరికా, రష్యాల తదుపరి మూడో స్థానంలో నిలిచింది. నాటి మన ఘనత కైనా అప్ఘాన్, పాక్‌ల వంటి దేశాల ఘనతకైనా కార ణం ఒక్కటే.. మహిళలకు రిజర్వేషన్లు. 1935 భారత ప్రభుత్వ చట్టం కాలం నుంచి మన పార్టీలు మహిళా రిజర్వేషన్లును వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. స్వాతంత్య్రానంతరం అమల్లోకి వచ్చిన నూతన రాజ్యాంగం మహిళలు సహా ప్రతి ఒక్కరికీ సార్వత్రిక ఓటింగ్ హక్కును ఇచ్చింది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లన్న మాటే రాకుండా కాంగ్రెస్ తదితర రాజకీయ పక్షాలు జాగ్రత్త వహించాయి. నాటి నుంచి నేటి వరకు మన పార్టీలది అదే తీరు. ఆ తీరు మారేది కాదు. మార్చాల్సింది. కాబట్టే 1997లో పార్లమెంటు కెక్కిన మహిళా రిజర్వేషన్లు నేటికీ దుమ్ముకొట్టుకుపోతున్నాయి. గెలిచిన మహిళలు సైతం పార్టీ వైఖరికే తప్ప మహిళలుగా మహిళా సమస్యల పరిష్కారానికి ఆలోచించడం లేదని, అలాంటప్పుడు రిజర్వేషన్లు వచ్చినా మహిళల పరిస్థితి మారదనే మాట తరచుగా వినవస్తోంది. రిజర్వేషన్లే అన్ని వాదనలకు సమాధానం, రిజర్వేషన్ల బిల్లు చ ట్టమైతే లోక్‌సభలో మహిళా సభ్యుల సంఖ్య 61 నుంటి 179కి పెరిగిపోతుంది. ఆ సంఖ్యే అటు పార్టీల నాయకత్వంలోనూ, విధానాల్లోనూ మహిళలకు ప్రాతినిధ్యాన్నిచ్చే మార్పును తేగలుగుతుంది. చట్టసభల్లో మహిళలు మహిళల కోసం మాట్లాడే రోజులు వస్తాయి. అంతవరకు ఎన్నికల జాతరలు వస్తూ పోతూ ఉంటాయి. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుండక తప్పదు. పిళ్లా వెంకటేశ్వరరావు విశ్లేషణ -
ఆ ఇద్దరూ నడుమా న్యాయం
ఆలస్యం అమృతం విషం అన్నారు. బంగ్లాదేశ్‌లో నేడు అదే జరుగుతోంది. వందలాది మందిని హతమార్చిన ‘మీర్పూర్ నరహంతకుడు’ ఖాదర్ ముల్లా (65) ఈ నెల 12న ఉరికంబం ఎక్కినప్పటి నుంచి దేశం అత లాకుతలం అవుతోంది. ఖాదర్ సాగించిన హత్యాకాండ, అత్యాచారాలు 1971 బంగ్లా విముక్తి పోరాట కాలం నాటివి. నాటి మారణహోమంలో 30 నుంచి 60 లక్షల మంది హతం కాగా, 6 లక్షల మందిపై అత్యాచారాలకు గురయ్యారు. నాలుగు దశాబ్దాలకు పైగా మురిగిన ‘న్యాయం’ నేడు ప్రాణాంతక విషంగా వికటిస్తోంది. కాబట్టే ఖాదర్ ఉరిని ‘రాజకీయ హత్య’ అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు చేయగలుగుతున్నాయి. ముల్లా ‘ప్రతి నెత్తుటి బొట్టుకూ ప్రతీకారం తప్పద’ని జమాతే ఇస్లాం పార్టీ వీరంగం వేయగలుగుతోంది. అది రేకెత్తించిన ఘర్షణల్లో ఇప్పటికి కనీసం 26 మంది బలైపోయారు. బంగ్లాదేశ్ ఒకప్పడు తూర్పు పాకిస్థాన్‌గా పాక్‌లో భాగంగా ఉండేది. పశ్చిమ పాక్ రాజకీయ, సైనిక నేతల దురహంకారానికి, అణచివేతకు, వివక్షకు గురైంది. విముక్తి పోరాట కాలంలోనూ, అంతకు ముందూ, తర్వాతా కూడా జమాతే పశ్చిమ పాక్ దురహంకారుల పక్షం వహించింది. ప్రస్తుతం ‘హిఫాజత్ ఏ ఇస్లామీ’ అనే ఛాందసవాద సంస్థను ముందు నిలిపి లౌకికతత్వాన్ని పాతరవేసి, బంగ్లాను షరియా పాలన సాగే ఇస్లామిక్ దేశంగా మార్చాలని ప్రయత్నిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బంగ్లా నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ)తో కలిసి ప్రజాస్వామ్యాన్ని బలిపీఠం ఎక్కిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా అల్లర్లు జనవరి 5న జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయా? పౌర ప్రభుత్వం నిలుస్తుందా? అనే సందేహాలను రేకెత్తిస్తున్నాయి. 1975-81 మధ్య కాలం నాటి సైనిక నియంత జియావుర్ రెహ్మాన్ మతతత్వవాద శక్తులతో చెలిమి చేశారు. ఆయన భార్య బీఎన్పీ నేత్ర ఖలీదా జియా ఆ మైత్రిని బలోపేతం చేశారు. జమాతే బీఎన్పీకి నమ్మకమైన మిత్రపక్షం. మూడు దశాబ్దాలుగా బంగ్లా రాజకీయాలు మాజీ ప్రధాని ఖలీదాకు, నేటి ప్రధాని, అవామీ లీగ్ నేత్రి షేక్ హసీనాకు మధ్య వైరంగా మారాయి. ఒకరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరొకరు వీధులకెక్కి ఏ ప్రభుత్వాన్నీ పనిచేయనివ్వక పోవడం రివాజయింది. ఈ అసాధారణ వాతావరణంలో...అంతర్జాతీయ నేర విచారణ ట్రిబ్యునల్ ఫిబ్రవరిలో 1971 నాటి యుద్ధనేరస్తులైన జమాతే అగ్ర నేతలకు శిక్షలను విధించింది. ఆ విచారణల ఉత్తేజంతోనే బంగ్లా యువత, మధ్యతరగతి విద్యావంతులు అరబ్బు వసంతాన్ని తలపించే రీతిలో షాబాగ్ ఉద్యమాన్ని నిర్వహించారు. ‘మీర్పూర్ నరహంతకు’నికి జీవితఖైదును విధించడాన్ని నిరసించి, మరణశిక్షను డిమాండు చేశారు. చివరకు సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఖాదర్ ఉరికంబమెక్కాడు. బీఎన్పీ అండతో జమాతే నాటి నుంచి హసీనా ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లకు దిగింది. కాగా గత మూడు నెలలుగా ఖలీదా జనవరి ఎన్నికలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఖలీదా నేతృత్వంలోని 18 ప్రతిపక్షాల కూటమి ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చింది. హసీనాకు విజయావకాశాలు ఉండటమే ఖలీదా ఆందోళనకు అసలు కారణం. రాజ్యాంగం ప్రకారం తాత్కాలిక తటస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగాలని ఆమె వాదన. కానీ ఆ ‘రాజ్యాంగ నిబంధన’ 1996లో జమాతే మద్దతుతో ఆమె ప్రభుత్వం చేసిన 13వ సవరణ ఫలితం. ఎన్నికకాని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు ఏదైనాగానీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమేనదేనని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ ఏర్పాటును గతంలో సైతం వ్యతిరేకించిన హసీనా 15వ సవరణతో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు స్వస్తి పలికారు. హసీనా నేతృత్వంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని, ఆమె ప్రభుత్వం రాజీనామా చేయాలని ఖలీదా పట్టుబడుతున్నారు. అల్లర్లతో, ఆందోళనలతో అసాధారణ పరిస్థితిని సృష్టించి ఎన్నికల కమిషన్ చేత ఎన్నికలను వాయిదా వేయించాలని యత్నిస్తున్నారు. గతంలో అలా ఎన్నికలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. కాగా ఏది ఏమైనా ఎన్నికలను నిర్వహించాలని చూస్తున్న హసీనా... అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న మాజీ సైనిక నియంత హెచ్ఎమ్ ఎర్షాద్‌ను ‘ఆసుపత్రిలో చేర్పించారు.’ పరస్పర విభిన్న వైఖరులను ప్రదర్శించే ఎర్షాద్ మొదట ఎన్నికల్లో పాల్గొనాలని ఖలీదాకు హితవు పలికారు. తాజాగా బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఎర్షాద్‌ను ఆసుపత్రికి పంపి హసీనా ఆయన భార్య, మంత్రి రోషన్ నేతృత్వంలో ఎర్షాద్ ‘జాతీయ పార్టీ’ సహా మిత్ర పక్షాలతో ఎన్నికలకు దిగుతున్నారు. ఏది ఏమైనా బంగ్లా ఆశాంతి ఇప్పట్లో చల్లారేట్టు కనబడదు. బంగ్లా సైనిక నియంతృత్వాల గతం పునరావృతం కాదని ఆశిద్ధాం. పిళ్లా వెంకటేశ్వరరావు -
‘రత్నాలు'... రాజకీయాలు
విశ్లేషణ: పిళ్లా వెంకటేశ్వరరావు వివాదం నేటి రాజకీయాల చిరునామా. కాదనేవాళ్లు ఇంకా సద్దుమణగని ‘భారతరత్న’ రభసను చూస్తే చాలు. తాజా వివాదంలో వాదం కంటే రాజకీయం పాలే ఎక్కువని ఒప్పుకుంటారు. భారత ప్రజాస్వామ్య పరిణతిని గానం చేయడం లేటెస్ట్ ‘దేశభక్తి’ ఫ్యాషన్. కాబట్టి ‘రత్న’ వివాదాన్ని మన ప్రజాస్వామ్య పరిణతికి సంకేతంగా ఎందుకు భావించకూడదు? ‘మనం మన అర్హతకు మించిన మెరుగైన పాలనకు నోచుకోకుండా నియంత్రించడానికి కనిపెట్టిన సాధనమే ప్రజాస్వామ్యం’ అని సుప్రసిద్ధ అమెరికన్ రచయిత హెచ్ఎల్ మెన్కెన్ 19వ శతాబ్దిలోనే చెప్పాడు. అది మింగుడు పడకపోతే ఆయన మాటల్ని తిరగేసి అన్వయించుకుంటే సరి. మన ప్రజాస్వామ్యం పరిణతి అంటే మన పరిణతే అవుతుంది. అదీ, ఇదీ కూడా మింగుడు పడకపోతే ‘భారత రత్న’ చరిత్రన ు ఓసారి తిరగేయడం మంచిది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారంగా ‘భారతరత్న’ను ఏర్పాటు చేసిందే (1954) తడవుగా, మరుసటి ఏడే ప్రధాని పదవిలోని జవహర్లాల్ నెహ్రూ దాన్ని అందుకున్నందుకు ఆక్షేపించినవారు లేరు. ప్రథమ ప్రధాని ఎంపిక సమయంలో నెహ్రూకు సాటిరాగల వ్యక్తిగా నిలిచిన వల్లభ్‌భాయ్ పటేల్ ఆ పురస్కారం కోసం నాలుగు దశాబ్దాలు వేచి చూడాల్సి వచ్చింది. నెహ్రూ మనవడు రాజీవ్‌గాంధీతో పాటు 1991లో ఆయన భారత ర త్న అయ్యారు.పటేల్‌కు ఇవ్వలేదనో లేదా ఆలస్యంగా ఇచ్చారనో పెద్ద చర్చ సాగలేదు. అతి ఉదారంగా ఎక్కువ మందికి భారతరత్న పురస్కారాలను ప్రకటించిన ప్రధాని పీపీ నరసింహారావు... పటేల్‌తో పాటే సుభాష్ చంద్రబోస్‌కు కూడా ‘న్యాయం’ చేద్దామని చూశారు. రాష్ట్రపతి పదవికి ‘రబ్బరుస్టాంపు’ పేరు తెచ్చిన వీవీ గిరి తర్వాత పదహారేళ్లకు నేతాజీకి పురస్కారమా? అనే విమర్శకుల నసుగుడుకు మించిన రభస నాడూ జరగలేదు. ఈ ఆలస్యాన్ని అవమానంగా ఎంచి బోస్ కుటుంబసభ్యులు దాన్ని తిరస్కరించారనేది వేరేసంగతి. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ కూడా అదే ఏడాది... పురస్కారాల కమిటీలో ఉంటూ పురస్కారాన్ని అందుకోవడం సమంజసం కాదని తిరస్కరించారు. ఆయన మరణానంతరం, మరుసటి ఏడాది ఆజాద్‌కు ఆ పురస్కారం ఇచ్చారు. ఇద్దరే ఇద్దరు ‘వెయిటింగ్ లిస్ట్’ను క్లియర్ చేయడమే లక్ష్యం అన్నట్టుగా చకచకా ఐదేళ్ల పదవీ కాలంలో ఎక్కువగా భారతరత్న పురస్కారాలను ఇచ్చిన ప్రధానులు పీపీ నరసింహారావు, ఏబీ వాజపేయి. పూర్తికాలం పదవిలో ఉండి కూడా, దేశ ఆర్థిక, రాజకీయ జీవితంపై బలమైన ముద్రను వేసి కూడా(మంచా, చెడా అనేది అసందర్భం... ఎవరికి ఏది తోస్తే అదే) భారత రత్నకు నోచుకోని ఇద్దరే ఇద్దరు మాజీ ప్రధానులు. వారిద్దరూ అలా మిగలడమూ, ఎన్నడూ లేని విధంగా అత్యున్నత పురస్కారంపై నేడు రభస జరుగుతుండటమూ స్వాతంత్య్రానంతర కాలంలో దేశ రాజకీయాల గతిని సూచించే మైలు రాళ్లు కావడం విశేషం. ఇద్దరిలోనూ వాజపేయి నయం. ఆయన వెయిటింగ్ లిస్ట్‌లోనైనా ఉన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు, కొన్ని యూపీఏ పక్ష పార్టీలు ఆయన తరఫున వాదిస్తున్నాయి. బీజేపీ అదికారంలోకి రాకున్నా ఆయన భారతరత్న అయ్యే అవకాశం ఉంది. వాజపేయితో పాటూ రామ్మనోహర్ లోహియా, చరణ్‌సింగ్, కాన్షీరామ్, బాల్‌ఠాక్రే, బిజూ పట్నాయక్, ఎన్టీఆర్, వగైరాలతో చాలా పెద్ద వెయిటింగ్ లిస్టే తయారైంది. వివిధ రాజకీయేతర రంగాలలోని విశిష్ట వ్యక్తుల జాబితా మరొకటి హనుమంతుడి తోకలాగా పెరుగుతూ పోతోంది. ఈ జాబితాల రచ్చలో సోదిలోకి రాకుండా పోయినది పీవీ ఒక్కరే. మన్మోహన్‌కు రాజకీయ తీర్థం ఇచ్చి, దేశ ఆర్థిక మంత్రి పదవిని కట్టబెట్టి, ఆర్థిక సంస్కరణల ఛాంపియన్‌ను చేసినది పీపీ. ప్రధానిగా పదేళ్ల పదవీ కాలంలో మన్మోహన్ ఈ అత్యున్నత పురస్కారాన్ని ఆయనకు ఇవ్వలేకపోవడానికి ‘తగు’ కారణమే ఉందని అందరికీ తెలిసిందే. ప్రధాని సకల శక్తివంతుడైన దేశాధినేతగా ప్రారంభమైన మన ప్రజాస్వామ్య వ్యవస్థకు సోనియాగాంధీ ‘బంట్ల పాలన’ అనే సరికొత్త అధ్యాయాన్ని చేర్చారు. పీపీతోనే దానికి నాంది పలకాలని ఆశించి భంగపడ్డారు. మన్మో హన్‌తో సఫలమయ్యానని సంతృప్తి చెందుతున్నారు. ఆమె మళ్లీ పొరబడ్డారనేది పూర్తిగా అసందర్భం. రాజీవ్ పాలన వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండటం అంటే నెహ్రూ-ఇందిరల కుటుంబం అధికారంలో ఉండటమే (లాల్‌బహదూర్ శాస్త్రిని మినహాయిస్తే). ‘అమ్మ’ బంటుగా ఢిల్లీ గద్దెనెక్కిన పీవీ... బంటుగా గాక రాజుగా వ్యవహరించారు. ఫలితాన్ని అనుభవించారు, ఢిల్లీలో అంత్యక్రియలకే నోచుకోని ఆయనను ‘రత్నాన్ని’ ఏం చేస్తారనో ఏమో పీవీ పేరును వెయిటింగ్ లిస్ట్‌కు చేర్చే ప్రయత్నం కూడా ఎవరూ చేయడం లేదు. ‘రత్నం’ రంగు రాజకీయం ఇక వర్తమానానికి వస్తే... మున్నెన్నడూ లేని విధంగా నేడు ఇంత రభస ఎందుకు జరుగుతున్నట్టు? అది ఏం చూసిస్తున్నట్టు? సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న ప్రకటించడంలో యూపీఏ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అనవసర తొందరపాటును ప్రదర్శించిందనేది ప్రధానంగా వినవస్తున్న వాదన. క్రికెట్ ప్రపంచంలో సచిన్ అసమాన ప్రతిభాశాలి అనడంలో ఎలాంటి వివాదమూ లేదు. అయినా గానీ సచిన్‌కు అత్యున్నత పురస్కారాన్ని అందుకునే అర్హత ఉన్నదా? అంతకంటే ముందే ఆ పురస్కారాన్ని అందుకోవాల్సిన వారి మాటేమిటి? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నవారికి కొదవలేదు. సీఎన్ఆర్ రావు గురించి ఏ గొడవా లేదు. సచిన్ ఒక్కడికే ఇస్తే అది ఎన్నికల ‘తొందరపాటు’ రాజకీయం అనిపిస్తుందనే ఆయన పేరును చేర్చారనేది బహిరంగ రహస్యం. భారతరత్న ఆయనకు అనూహ్యంగా, హఠాత్తుగా వచ్చిపడ్డ లబ్ధి (విండ్ ఫాల్ గెయిన్). కాబట్టి ఆయన ఈ రచ్చకు ‘అతీతుడు’ కావాల్సింది. కానీ కాలేదు. ‘కృతజ్ఞత’ చూపాల్సిన సీఎన్ఆర్ రావు... రాజకీయనేతల చేతుల్లో పడి విజ్ఞానశాస్త్ర రంగం భ్రష్టుపట్టి పోతోందంటూ విరుచుకుపడి యూపీఏను రచ్చ కీడ్చారు. తర్వాత ఆయన ‘శాంతించినా’ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలా మంది భావిస్తున్నట్టు యూపీఏ ఈ వ్యవహారంలో ‘తొందరపాటు’ ప్రదర్శించ లేదు. సచిన్ కంటే ముందుగానే కాంగ్రెస్ రాజనీతి దురంధరులు ఎన్నికల ముందు చూపుతో సచిన్ రిటైర్మెంట్కు కానుకను సిద్ధం చేసారు. 2011 డిసెంబర్లోనే క్రీడాకారులకు కూడా భారత రత్నకు అర్హతను కల్పించేలా నిబంధనలను సవరించారు. ఆ తదుపరి ప్రకటించిన పురస్కారాలు ఇవే. జాతీయ వ్యసనమా అనిపించేంతగా విస్తరించిన క్రికెట్ అభిమానాన్ని, ఆ ఆటకు ఇలవేలుపుగా వెలుగుతున్న సచిన్ రిటైర్మెంట్ను ఓట్ల కాలంలో సొమ్ము చేసుకోలేని అధికారం ఉండి ఫలమేమిటని అనుకోని పార్టీలు ఏవన్నా ఉన్నాయా? సచిన్‌కు భారతరత్న ఎందుకు ఇవ్వరని మోడీ, శివసేనల నుంచి అంతా పోటీపడి ప్రకటనలు గుప్పించాక మేల్కోవడం కంటే ముందే సిద్ధం కావడం మంచి ఎత్తుగడే. కానీ కాంగ్రెస్ తలరాతే... ‘కాలం’ కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్టుంది. అందుకే అత్యంత వివాదరహితుడైన క్రికెటర్‌గా పేరుమోసిన సచిన్ భారతరత్న అతి పెద్ద వివాదమైంది. ఆ వివాదం భారతరత్నకు ఆది నుంచి అంటుకున్న రాజకీయాల రంగును వెలుగులోకి తెస్తోంది. మొదటి నుంచి ఈ పురస్కారం ప్రధాని, అధికార పార్టీల ఇష్టాయిష్టాలపై ఆధారపడినదిగానే ఉంటున్న విషయం తేటతెల్లమవుతోంది. క్షీణ రాజకీయ శకం ఒకప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌కు ఉన్న తిరుగులేని రాజకీయ అధికారం వల్లనే అన్ని రంగాల్లోలాగానే అత్యున్నత పురస్కారాల విషయంలోనూ అసమ్మతి స్వరాలు, ధిక్కార గళాలు పెద్దగా వినిపించేవి కావు. ఎప్పుడో మాట కాదు, 1988లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు ఎంజీఆర్‌కు ఈ పురస్కారం ఇచ్చినప్పుడు కూడా అది పెద్ద వివాదం కాలేదు. అంబేద్కర్ కంటే రెండేళ్ల ముందు, పటేల్ కంటే మూడేళ్ల ముందు, నేతాజీ కంటే నాలుగేళ్ల ముందు ఆయనకు ఈ పురస్కారాన్ని కట్టబెట్టడం రాజకీయం గాక మరేమిటి? వాజపేయి ప్రభుత్వ హయాంలో సైతం కాంగ్రెస్‌కు చెందిన పీవీకి భారతరత్న ఇవ్వడం కంటే ఎవరికీ ఇవ్వకపోవడమే ఉత్తమమని భావించలేదా? అందరికంటే ఎక్కువగా భారతరత్నలను అందించిన ఆయన హయాంలో ఒక్క జయప్రకాష్ నారాయణ్ మాత్రమే రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తి. నేడు అందరికంటే గట్టిగా ఎన్టీఆర్‌కు భారతరత్న కావాలని కోరుతున్న చంద్రబాబు నాయుడు ఎన్డీఏ హయాంలో కింగ్ మేకర్. ఆయన మాటకు కట్టుబడే ఆనాడు వాజపేయి ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును విస్మరించలేదా? అది రాజకీయం కాక మరేమిటి? అయితే ఈసారే ఇలా భారతరత్నపై నిర్భయంగా భిన్నాభిప్రాయాలను ప్రకటించగలగడం, ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించడం, ఇలా శల్య పరీక్షకు గురిచేయడం. ఎవరికి వారుగా ఎక్కడికక్కడ జాబితాలు తయారు చేయడం ఏం సూచిస్తోంది? కేంద్రంపై జాతీయపార్టీల పట్టుసడలిపోవడం అనేది నిజమే. అంతకుమించి కేంద్రంలో అధికారం నెరపుతున్న ప్రభుత్వాల నైతిక అధికారం రోజురోజుకూ క్షీణించిపోతుండటం కాదా? ఈ క్షీణత ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వాలకు సంబంధించినదేకాదు. బీజేపీ అందుకు మినహాయింపు కానేకాదు. కాబట్టే ఒకప్పుడు ఎన్డీఏ భాగస్వాములు కావడానికి వాజపేయి ఉదారవాదం, గాం దేయ సోషలిజాల మొహం బిజేపీకి అవసరమైంది. నేడు ఆ అవసరం లేదు. మోడీ మొహంతోనే మిత్రులను కూడగట్టుకోగలదు. నితీష్, మోడీ వ్యతిరేకత పచ్చి రాజకీయం లేదా అవకాశవాదం మాత్రమే. ఇదంతా మన ప్రజాస్వామ్యం పరిణతిగా భావించలేకపోతే... ‘ప్రజాస్వామ్యం ఒక కల మాత్రమే. అర్కేడియా, శాంతాక్లాజ్, స్వర్గం కోవలోకే దాన్ని కూడా చేర్చాలి’ (మెన్కెన్). -
రొట్టె ముక్క... దుడ్డు కర్ర
‘విభజన-అభివృద్ధి’ చైనా సరికొత్త దౌత్యనీతి. గడ్డు సమస్యలన్నిటినీ పక్కన పెట్టి, ఆర్థిక సహకారంతో అభివృద్ధిని సాధించాలనేది వియత్నాంతో చైనా తాజా దౌత్య విధానం. అదే ‘విభజన-అభివృద్ధి’ అంతరార్థం. ‘అభివృద్ధి’ దౌత్యాన్ని కాదంటే నోటి ముందున్న రొట్టె ముక్క అదృశ్యమై దుడ్డు కర్ర ప్రత్యక్షమౌతుంది. ‘విభజించి పాలించు’ తెల్లోడి కూట నీతి. ‘విభజన-అభివృద్ధి’ చైనా సరికొత్త దౌత్య నీతి. ఆ దౌత్యం వియత్నాం ప్రధాని గుయెన్ టాన్ డుంగ్పై వశీకరణ మంత్రంలాగా పనిచేసినట్టుంది. చైనా దురాక్రమణకు గురై స్వతంత్రం కోసం పోరాడిన గత చరిత్ర ను వియత్నమీయులు నేటికీ మరవలేదు. పైగా 1979లో కూడా చైనా ఆ దేశంపై దురాక్రమణకు పాల్ప డింది. నదీ జలాల నుంచి దక్షిణ చైనా సము ద్ర జలాల వరకు అడుగడుగునా వియత్నాం పై చైనా ఆధిపత్యవాద ధోరణిని ప్రదర్శిస్తోంది. ఈ నెల 15న చైనా ప్రధాని లీ కెగియాంగ్ వియత్నాంలో పర్యటించారు. అవి రెండూ చిరకాల మిత్ర దేశాలనిపించేలా లీ పర్యటన సాగింది. అనూహ్యమైన ఈ మార్పునకు కారణం చైనా నూతన నాయకత్వమేనని అనుకుంటే పొరపాటు. అది చైనా దౌత్య మాయాజాలం. గడ్డు సమస్యలన్నిటినీ పక్కన పెట్టి, ఆర్థిక సహకారంతో అభివృద్ధిని సాధించాలనేది వియత్నాంతో చైనా తాజా దౌత్య విధానం. అదే ‘విభజన-అభివృద్ధి’ అంతరార్థం. అతి సరళమైన చెల్లింపుల పద్ధతిలో సకల రంగాల్లో ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని అందించడానికి లీ చొరవ చూపడం వియత్నాం ప్రధాని డుంగ్ను చిత్తు చేసింది. 2015 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి, భారీ ఎత్తున చైనా వియత్నాంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుది రాయి. మౌలిక సదుపాయాల నిర్మాణానికి వియత్నాంకు తక్షణం అవసరమైన 100 కోట్ల డాలర్ల సహాయాన్ని కూడా చైనా అందిస్తోంది.ై పెగా వివాదాస్పదమైన స్ప్రాట్లీ, పార్సెల్ దీవులకు కూడా ఈ ‘అభివృద్ధి’ విస్తరిస్తుంది. అమెరికా, జపాన్‌లు ఇవ్వలేని వరాలను ఆధిపత్యశక్తిగా వ్యవహరించే చైనా ఇస్తుంటే డుంగ్ ఎందుకు కాదనాలి? ఏకైక అగ్రరాజ్యం అమెరికాది బాంబుల దౌత్యం లేదా ‘గన్‌బోట్ డిప్లమసీ.’ బెదిరిం చడం లొంగకపోతే బాంబులు కురిపించడమే తప్ప మరొకటి దానికి తెలియదు. ఇరాక్ ఆ దౌత్య నీతికి భీకర నిదర్శనం. అమెరికా దౌత్య ఆయుధాగారంలో ‘దుడ్డుకర్ర, రొట్టెముక్క’ కూడా లేకపోలేదు. అయితే అది రొట్టెముక్క విసరాడనికి ముందే... దుడ్డుకర్ర భయానికి దాని కోరికలన్నిటినీ నెరవేర్చక తప్పదు. చైనా అందుకు విరుద్ధంగా రొట్టెముక్కలు ముందుగానే ఇచ్చి కావాలనుకున్నది సాధిస్తోంది. బాంబుల దౌత్యంతో అమెరికా ప్రపంచాధిపత్యాన్ని నెరపుతుంటే చైనా వాణిజ్య, పెట్టుబడుల సేనలతో ఆ ఆధిపత్యానికి నిచ్చెనలు వేస్తోంది. వాణిజ్యపరంగా, ఆర్థికంగా తమపై ఆదారపడ్డ దేశాలు రాజకీయంగా తమకు అనుకూలంగా లేదా తటస్థంగా వ్యవహరించ క తప్పదనేది చైనా తర్కం. దక్షిణ చైనా సముద్రంలోని సుసంపన్నమైన కర్బన ఇంధన వనరుల కోసం కాకపోతే చిన్నా చితక దీవులపై చైనా ‘చారిత్రక హక్కుల’ ప్రకటన మరెం దుకు? ఆర్థిక సహకారం, అభివృద్ధి పేరిట ‘శాంతియుతంగానే’ ఆ హక్కులు సమకూరితే మరేం కావాలి? గత ఏదాది వియత్నాం తీరంలో భారత చమురు, సహజ వాయువుల సంస్థ (ఓఎన్జీసీ) చేపట్టిన చమురు అన్వేషణపై చైనా తీవ్ర అభ్యంతరాలు తెలిపింది. నాటి ఉద్రిక్తతల మధ్య చైనా ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’... ‘భారత చర్యలు చైనా సహనం హద్దులు దాటేంత వరకు నెడుతున్నాయి’ అని హెచ్చరించింది. చివరకు ‘రాజ కీయ కారణాల వల్ల’ వియత్నాం ఓఎన్జీసీతో ఒప్పందాన్ని రద్దు చేసింది. అదే టోంకిన్ అఖాతంలో చమురు అన్వేషణ, వెలికితీత కాంట్రాక్టులను చైనాకు కట్టబెట్టింది! వియత్నాం రావటానికి ముందు లీ ‘ఆసియాన్’ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్) సమావేశాలకు హాజరయ్యారు. ఆసందర్భంగా బ్రూనీలో కూడా లీ ‘రొట్టె ముక్కలను’ పంచారు. అభివృద్ధి ఆశను చూపి దీర్ఘకాలిక సహకారానికి పునాదులు వేశారు. మొత్తంగా దక్షిణ చైనా సముద్రప్రాంతం అంతటికీ చైనా ఇదే దౌత్యాన్ని విస్తరింపజేస్తోంది. చైనా దుడ్డు కర్రను దాచేసిందే తప్ప వదిలేయలేదు. ‘అభివృద్ధి’ దౌత్యాన్ని కాదం టే నోటి ముందున్న రొట్టె ముక్క అదృశ్యమై దుడ్డు కర్ర ప్రత్యక్షమౌతుందని తెలిసేట్టు చేసింది. వియత్నాంతో హనీమూన్‌లా సాగిన తన పర్యటనలో లీ... ద్వైపాక్షిక సమస్యలను ‘అంతర్జాతీయం చేస్తే సహించేది లేదని’ హెచ్చరించారు. చైనాను ఏకాకిని చేయడానికి అమెరికా, జపాన్‌లు రచిస్తున్న సైనిక వ్యూహా లకు దూరంగా ఉండాలని అంతరార్థం. - పిళ్లా వెంకటేశ్వరరావు -
‘మృత్యువు’ ముంగిట మంగోలియా
విశ్లేషణ: ప్రపంచ ప్రధాన దేశాల నేతలంతా అతి కాలుష్య నగరం ఉలాన్ బేటర్‌కు ‘తీర్థయాత్రలు’ సాగిస్తున్నారు. మంగోలియా ఖనిజ సంపదను కొల్లగొట్టాలన్న ఆరాటమే తప్ప... ముంచుకొస్తున్న పెను ఉత్పాతం నుంచి మంగోలియన్లను కాపాడాలన్న తపన ఎవరికీ లేదు. మంగోలియన్లు ఎలాంటి చావు చస్తేనేం నేలలోని ఖనిజ సంపదలు నిక్షేపంగానే ఉంటాయిగా? ‘నేను మరణిస్తే నా దేహాన్ని మరణించనివ్వండి. నా దేశాన్ని మాత్రం మరణించనివ్వకండి’. ప్రపంచంలోనే అతి పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిన చెంగీజ్ఖాన్ మాతృభూమి మం గోలియా ఆయన ఆకాంక్షలకు విరుద్ధంగా మెల్లమెల్లగా మరణిస్తోంది. అది ‘వాతావరణ మార్పుల వినాశకర పరిణామాలకు అతివేగంగా గురవుతున్న దేశం’. సంపన్న దేశాల దురాశాపూరిత ‘ఆర్థికాభివృద్ధి’ సృష్టించిన వాతావరణ ఉత్పాతం శ్వేతమృత్యువై మంగోలియన్ల పశుపాలక జీవిత విధానాన్ని కడతేరుస్తోంది. అసాధారణమైన మంచు తుఫానులకు, అతిశీతల ఉష్ణోగ్రతలకు ‘జాతీయ సంపద’ (పశుసంపద)ఎక్కడికక్కడ మందలుగా గడ్డకట్టిపోతోంది. జనాభాలో 40 శాతంగా ఉన్న పశుపాలకులకు సంప్రదాయక శీతాకాలపు గుడారాల (‘గెర్’) జీవితం ప్రాణాం తకంగా మారుతోంది. రాతి, కాంక్రీటు గృహాలు సైతం చలికి గజగజలాడి గడ్డకట్టిపోతున్నాయి. ఎండా కాలపు ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగి, గోబీ ఏడారి వేగంగా విస్తరిస్తూ, సువిశాలమైన పచ్చిక మైదానాలను కబళించేస్తోంది, దేశమే ఎడారిగా మారిపోయే ముప్పును ఎదుర్కొంటోంది. అయితేనేం అది ప్రపంచశక్తుల వనరుల పోరుకు వేదిక. రష్యా, చైనాల మధ్య ‘భౌగోళిక బందీ’గా ఉన్న ఆ దేశంతో ‘వ్యూహాత్మక భాగస్వామ్యానికి’ అమెరికా ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. ప్రపంచంలో నేడు నెలకొన్న ఉద్రిక్తతలు చాలవన్నట్టు మధ్య ఆసియాలో మరో సరికొత్త ఉద్రిక్తతల కేంద్రం రూపుదిద్దుకుంటోంది. అటు వాతావరణ మార్పులు, ఇటు వనరుల కోసం పోరు కలిసి మం గోలు జాతి గొంతుకు బిగుస్తున్న అడకత్తెరగా మారాయి. నిరుపేద ‘కోటీశ్వరులు’! ఖనిజసంపదను బట్టి చూస్తే మంగోలియా ప్రపంచంలోని అతి సంపన్న దేశం. రాగి, బొగ్గు, మాలిబ్డినమ్, తగరం, టంగ్స్టిన్, బంగారం వంటి ఖనిజాలు భారీగా ఉన్న దేశం. ఒక్క ‘తావాన్ తోల్గోయ్’ రాగి, బంగారు గనుల రాబడితో స్థూల జాతీయోత్పత్తి 2010 నుంచి 2011కు 6.4 నుంచి 17.3 శాతానికి చేరింది. వృద్ధి కొలమానాలతో చూస్తే అది వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలలో ముందున్నట్టు లెక్క! ఆ గనుల ఖనిజంతోనే 27.5 లక్షల మంగోలియన్లంతా కోటీశ్వరులై పోవాలి. ఆ దేశ అపార ఖనిజ సంపద ఎన్ని లక్షల కోట్ల డాలర్ల విలువ చేస్తుందో తెలియదు. కానీ మంగోలులు ఖనిజ సంపద కాలనాగై కరిచే శాపగ్రస్త ప్రజలు. అందుకే వారు నిరుపేదలు. ‘తావాన్ తోల్గోయ్’ ప్రపంచ గనుల పరిశ్రమ దిగ్గజం ‘రియో టింటో’ సంస్థది. అది అమెరికా, బ్రిటన్ గుత్తాధిపతులది. సోవియట్ యూనియన్ పతనానికి ముందు మంగోలియా దానికి ఉపగ్రహ దేశంగా ఉండేది. ఆ తదుపరి అది పాశ్చాత్య ప్రపంచానికి, స్వేచ్ఛా విపణికి తలుపులు తెరచింది. దీంతో అమెరికా, కెనడా, యూరప్ దేశాలేగాక జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, భారత్ తదితర దేశాల వ్యాపార సంస్థలు మంగోలియాపై ఎనలేని ‘ఆసక్తిని’ కనబరుస్తున్నాయి. ఇక దక్షిణాన ఉన్న చైనా మంగోలియాతో ఉన్న భౌగోళిక, ఆర్థిక, సాంస్కృతిక అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకొని, ఆర్థికవ్యవస్థపై పట్టు కోసం ప్రయత్నిస్తోంది. మంగోలియా ఎగుమతులలో 95 శాతం బొగ్గు, రాగి తదితర ఖనిజాలే. వాటిలో 90 శాతం చైనాయే దిగుమతి చేసుకుంటుంది. తన ‘పెరట్లోనే’ ఉన్నదనుకున్న ఖనిజ సంపదను ఇతరులు దోచుకుపోవడం రష్యాకు కంటగింపుగా ఉంది. చైనా, రష్యాలు రెండూ మంగోలియాపై ‘చారిత్రక హక్కు లు’ ఉన్న దేశాలే. ‘స్వేచ్ఛ’ విధించిన శాపం! సోవియట్ యూనియన్ పతనంతో రష్యా భల్లూకపు పట్టు నుంచి బయటపడ్డ మంగోలులు తమ పశుపాలక జీవిత విధానాన్ని పెంపొందింపజేసుకున్నారు. పశుపాలకులకు తెలిసిన ఏకైక సంపద, జీవన భద్రత ఒక్కటే... పశవుల మందలే. మందల పరిమాణానికి సోవియట్ హయాంలో పరిమితులు ఉండేవి. బదులుగా రష్యా మాంసాన్ని వారికి అతి చౌకకు అందించేవారు. స్వేచ్ఛా విపణి ఆ ఆంక్షలను తొలగించింది. 1990-2010 మధ్య కాలంలో పశు సంపద జనాభా కోటి నుంచి నాలుగు కోట్లకు చేరింది. దీంతో పచ్చిక మైదానాలు త్వరత్వరగా అంతరించిపోసాగాయి. మరోవంక వాతావరణ మార్పుల కారణంగా మంచు తుఫానులు పెరిగి శీతాకాలానికి పశవుల మేత నిల్వ చేయాల్సిన అవసరం పెరిగింది. 2019-10 ఏడాది ఎన్నడూ ఎరుగని మంచు తుఫానులు విరుచుకు పడ్డాయి. దీంతో పశవులకు గడ్డిపరకలు, నీరు కరువయ్యాయి. వం దలు, వేల సంఖ్యలో మందలు ఆకలికి, చలికి కడతేరిపోయాయి. ఆ శీతాకాలం గడచే సరికి 14 శాతం కుటుం బాలు పశుపాలనకు స్వస్తిపలికి ఉలాన్ బేటర్ లాంటి పట్టణాల మురికివాడలకు చేరాల్సి వచ్చింది. ‘కోటీశ్వరుల’ దేశంలో జనాభాలోని ప్రతి ముగ్గురు అర్ధాకలితో, పోషకాహర లోపంతో బాధపడుతున్నవారేనని ఐరాస అంచనా. శిశు మరణాల సంఖ్య గత నాలుగేళ్లలో 35 నుంచి 45 శాతం మేరకు పెరిగింది. 1990 నాటికే మంగోలియా వాతావరణం సున్నితంగా మారింది. ఆ తదుపరి ఈగల్లా ముసిరిన అంతర్జాతీయ గుత్త కార్పొరేషన్లు చేపట్టిన విచ్చలవిడి గనుల తవ్వకాలు, పరిశ్రమలు సృష్టించిన ఉష్ణోగ్రతలు, కాలుష్యం కలిసి పరిస్థితిని పూర్తిగా విషమింపజేశాయి. మంగోలియాలోని నేటి వాతావరణ ఉత్పాతానికి గనుల సంస్థల, పరిశ్రమల దురాశే ప్రధాన కారణంగా మారింది. రాజధాని ఉలాన్ బేటర్ 13 లక్షల జనాభా ఉన్న చిన్న నగరమే. కానీ ప్రపంచంలో అతి ఎక్కువ వాయు కాలుష్య నగరం అదే. ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే ఆ నగరంలో మరణాల రేటు 24 నుంచి 45 శాతం ఎక్కువ. నాలుగేళ్ల ప్రాయానికే గుర్రపుస్వారీ మొదలెట్టి, మందలు తోలుకుంటూ స్వేచ్ఛావిహారం చేసే మంగోలులు గనుల్లో మగ్గుతూ మొగ్గలుగానే రాలిపోవాల్సి వస్తోంది. గనుల పరిశ్రమసహా అన్ని చోట్లా మంచి ఉద్యోగాలన్నిటికీ చైనీయుల నుండి పోటీ ఎదురవుతోంది. చైనాలోని ఇన్నర్ మంగోలియా జనాభాలో 60 శాతంగా మారిన చైనీయులు మంగోలియా పట్టణాలకు వలస వస్తున్నారు. నైపుణ్యం, శక్తిసామర్ధ్యాలతో వారితో పోటీ పడలేని మంగోలులు అల్ప వేతనాల పనులకు పరిమితం కావాల్సి వస్తోంది. కొద్దిపాటి మంచి ఉద్యోగాలను చైనీ యులు, కొరియన్లు ఎగరేసుకుపోతున్నారు. దీంతో చైనా పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. చైనా మాత్రం మంగోలియా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోడానికి నానా తం టాలు పడుతోంది. చైనాతో కయ్యానికి దిగిన ఫలితంగా అరుదైన లోహాల కోసం ఆల్లాడుతున్న జపాన్ సైతం మంగోలియాను ఆశ్రయిస్తోంది. అన్నిటికి మించి అమెరికా మంగోలియాను ఎలాగైనా తన వ్యూహాత్మక భాగస్వామిగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇరాక్, అప్ఘాన్ యుద్ధాలకు మంగోలియా కొద్ది సంఖ్యలోనే అయినా సైన్యాన్ని పంపింది. ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అమెరికా తాపత్రయపడుతోంది. రష్యా గత ఐదేళ్లకాలంలో సామ, దాన, భేదోపాయాలను ప్రయోగించి మంగోలియాను మచ్చిక చేసుకోగలిగింది. అమెరికా గత అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్‌తో ప్రారంభించి ప్రధాన దేశాల నేతలంతా అతి కాలుష్య నగరం ఉలాన్ బేటర్‌కు ‘తీర్థయాత్రలు’ సాగిస్తున్నారు. అవినీతిమయమైన ప్రభుత్వంతో కలిసి ఎవరికి వారే ఖనిజ సంపదను కొల్లగొట్టాలన్న ఆరాటమే తప్ప... ముంచుకొస్తున్న పెను ఉత్పాతం నుంచి మంగోలియన్లను కాపాడాలన్న తపన ఎవరికీ లేదు. మంగోలియన్లు ఎలాంటి చావు చస్తేనేం నేలలోని ఖనిజ సంపదలు నిక్షేపంగానే ఉంటాయిగా? - {పపంచవ్యాప్త వార్షిక సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల కంటే మూడురెట్లు ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. - గోబీ ఎడారి ఏడాదికి 10,000 చ.కి.మీ. మేర విస్తరిస్తోంది. త్వరలోనే దేశంలో 90 శాతం ఎడారిగా మారిపోయే ముప్పు పొంచి ఉంది. - 2009-10 ఏడాది మంచు తుఫానుల్లో 65 లక్షల పశువులు చనిపోయాయి. - పది పెద్ద గనుల నుంచి వెలికి తీస్తున్న ఖనిజ సంపద విలువ ఏడాదికి 1.3 నుంచి 2.75 లక్షల కోట్ల డాలర్లు