‘మృత్యువు’ ముంగిట మంగోలియా | Rio Tinto's giant Mongolian mine gets new chief executive | Sakshi
Sakshi News home page

‘మృత్యువు’ ముంగిట మంగోలియా

Published Thu, Sep 12 2013 11:31 PM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM

‘మృత్యువు’ ముంగిట మంగోలియా

‘మృత్యువు’ ముంగిట మంగోలియా

విశ్లేషణ:  ప్రపంచ ప్రధాన దేశాల నేతలంతా అతి కాలుష్య నగరం ఉలాన్ బేటర్‌కు ‘తీర్థయాత్రలు’ సాగిస్తున్నారు. మంగోలియా ఖనిజ సంపదను కొల్లగొట్టాలన్న ఆరాటమే తప్ప... ముంచుకొస్తున్న పెను ఉత్పాతం నుంచి మంగోలియన్లను కాపాడాలన్న తపన ఎవరికీ లేదు. మంగోలియన్లు ఎలాంటి చావు చస్తేనేం నేలలోని ఖనిజ సంపదలు నిక్షేపంగానే ఉంటాయిగా?
 
 ‘నేను మరణిస్తే నా దేహాన్ని మరణించనివ్వండి. నా దేశాన్ని మాత్రం మరణించనివ్వకండి’. ప్రపంచంలోనే అతి పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిన చెంగీజ్‌ఖాన్ మాతృభూమి మం గోలియా ఆయన ఆకాంక్షలకు విరుద్ధంగా మెల్లమెల్లగా మరణిస్తోంది. అది ‘వాతావరణ మార్పుల వినాశకర పరిణామాలకు అతివేగంగా గురవుతున్న దేశం’. సంపన్న దేశాల దురాశాపూరిత ‘ఆర్థికాభివృద్ధి’ సృష్టించిన వాతావరణ ఉత్పాతం శ్వేతమృత్యువై మంగోలియన్ల పశుపాలక జీవిత విధానాన్ని కడతేరుస్తోంది. అసాధారణమైన మంచు తుఫానులకు, అతిశీతల ఉష్ణోగ్రతలకు ‘జాతీయ సంపద’ (పశుసంపద)ఎక్కడికక్కడ మందలుగా గడ్డకట్టిపోతోంది.
 
 జనాభాలో 40 శాతంగా ఉన్న పశుపాలకులకు సంప్రదాయక శీతాకాలపు గుడారాల (‘గెర్’) జీవితం ప్రాణాం తకంగా మారుతోంది. రాతి, కాంక్రీటు గృహాలు సైతం చలికి గజగజలాడి గడ్డకట్టిపోతున్నాయి. ఎండా కాలపు ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగి, గోబీ ఏడారి వేగంగా విస్తరిస్తూ, సువిశాలమైన పచ్చిక మైదానాలను కబళించేస్తోంది, దేశమే ఎడారిగా మారిపోయే ముప్పును ఎదుర్కొంటోంది. అయితేనేం అది ప్రపంచశక్తుల వనరుల పోరుకు వేదిక. రష్యా, చైనాల మధ్య ‘భౌగోళిక బందీ’గా ఉన్న ఆ దేశంతో ‘వ్యూహాత్మక భాగస్వామ్యానికి’ అమెరికా ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. ప్రపంచంలో నేడు నెలకొన్న ఉద్రిక్తతలు చాలవన్నట్టు మధ్య ఆసియాలో మరో సరికొత్త ఉద్రిక్తతల కేంద్రం రూపుదిద్దుకుంటోంది. అటు వాతావరణ మార్పులు, ఇటు వనరుల కోసం పోరు కలిసి మం గోలు జాతి గొంతుకు బిగుస్తున్న అడకత్తెరగా మారాయి.
 
 నిరుపేద ‘కోటీశ్వరులు’!
 ఖనిజసంపదను బట్టి చూస్తే మంగోలియా ప్రపంచంలోని అతి సంపన్న దేశం. రాగి, బొగ్గు, మాలిబ్‌డినమ్, తగరం, టంగ్‌స్టిన్, బంగారం వంటి ఖనిజాలు భారీగా ఉన్న దేశం. ఒక్క ‘తావాన్ తోల్గోయ్’ రాగి, బంగారు గనుల రాబడితో స్థూల జాతీయోత్పత్తి 2010 నుంచి 2011కు 6.4 నుంచి 17.3 శాతానికి చేరింది. వృద్ధి కొలమానాలతో చూస్తే అది వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలలో ముందున్నట్టు లెక్క! ఆ గనుల ఖనిజంతోనే 27.5 లక్షల మంగోలియన్లంతా కోటీశ్వరులై పోవాలి. ఆ దేశ అపార ఖనిజ సంపద ఎన్ని లక్షల కోట్ల డాలర్ల విలువ చేస్తుందో తెలియదు. కానీ మంగోలులు ఖనిజ సంపద కాలనాగై కరిచే శాపగ్రస్త ప్రజలు. అందుకే వారు నిరుపేదలు. ‘తావాన్ తోల్గోయ్’ ప్రపంచ గనుల పరిశ్రమ దిగ్గజం ‘రియో టింటో’ సంస్థది.
 
 అది అమెరికా, బ్రిటన్ గుత్తాధిపతులది. సోవియట్ యూనియన్ పతనానికి ముందు మంగోలియా దానికి ఉపగ్రహ దేశంగా ఉండేది. ఆ తదుపరి అది పాశ్చాత్య ప్రపంచానికి, స్వేచ్ఛా విపణికి తలుపులు తెరచింది. దీంతో అమెరికా, కెనడా, యూరప్ దేశాలేగాక జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, భారత్ తదితర దేశాల వ్యాపార సంస్థలు మంగోలియాపై ఎనలేని ‘ఆసక్తిని’ కనబరుస్తున్నాయి. ఇక దక్షిణాన ఉన్న చైనా మంగోలియాతో ఉన్న భౌగోళిక, ఆర్థిక, సాంస్కృతిక అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకొని, ఆర్థికవ్యవస్థపై పట్టు కోసం ప్రయత్నిస్తోంది. మంగోలియా ఎగుమతులలో 95 శాతం బొగ్గు, రాగి తదితర ఖనిజాలే. వాటిలో 90 శాతం చైనాయే దిగుమతి చేసుకుంటుంది. తన ‘పెరట్లోనే’ ఉన్నదనుకున్న ఖనిజ సంపదను ఇతరులు దోచుకుపోవడం రష్యాకు కంటగింపుగా ఉంది. చైనా, రష్యాలు రెండూ మంగోలియాపై ‘చారిత్రక హక్కు లు’ ఉన్న దేశాలే.
 
 ‘స్వేచ్ఛ’ విధించిన శాపం!
 సోవియట్ యూనియన్ పతనంతో రష్యా భల్లూకపు పట్టు నుంచి బయటపడ్డ మంగోలులు తమ పశుపాలక జీవిత విధానాన్ని పెంపొందింపజేసుకున్నారు. పశుపాలకులకు తెలిసిన ఏకైక సంపద, జీవన భద్రత ఒక్కటే... పశవుల మందలే. మందల పరిమాణానికి సోవియట్ హయాంలో పరిమితులు ఉండేవి. బదులుగా రష్యా మాంసాన్ని వారికి అతి చౌకకు అందించేవారు. స్వేచ్ఛా విపణి ఆ ఆంక్షలను తొలగించింది. 1990-2010 మధ్య కాలంలో పశు సంపద జనాభా కోటి నుంచి నాలుగు కోట్లకు చేరింది. దీంతో పచ్చిక మైదానాలు త్వరత్వరగా అంతరించిపోసాగాయి. మరోవంక వాతావరణ మార్పుల కారణంగా మంచు తుఫానులు పెరిగి శీతాకాలానికి పశవుల మేత నిల్వ చేయాల్సిన అవసరం పెరిగింది. 2019-10 ఏడాది ఎన్నడూ ఎరుగని మంచు తుఫానులు విరుచుకు పడ్డాయి. దీంతో పశవులకు గడ్డిపరకలు, నీరు కరువయ్యాయి.
 
  వం దలు, వేల సంఖ్యలో మందలు ఆకలికి, చలికి కడతేరిపోయాయి. ఆ శీతాకాలం గడచే సరికి 14 శాతం కుటుం బాలు పశుపాలనకు స్వస్తిపలికి ఉలాన్ బేటర్ లాంటి పట్టణాల మురికివాడలకు చేరాల్సి వచ్చింది. ‘కోటీశ్వరుల’ దేశంలో జనాభాలోని ప్రతి ముగ్గురు అర్ధాకలితో, పోషకాహర లోపంతో బాధపడుతున్నవారేనని ఐరాస అంచనా. శిశు మరణాల సంఖ్య గత నాలుగేళ్లలో 35 నుంచి 45 శాతం మేరకు పెరిగింది. 1990 నాటికే మంగోలియా వాతావరణం సున్నితంగా మారింది. ఆ తదుపరి ఈగల్లా ముసిరిన అంతర్జాతీయ గుత్త కార్పొరేషన్లు చేపట్టిన విచ్చలవిడి గనుల తవ్వకాలు, పరిశ్రమలు సృష్టించిన ఉష్ణోగ్రతలు, కాలుష్యం కలిసి పరిస్థితిని పూర్తిగా విషమింపజేశాయి.
 
 మంగోలియాలోని నేటి వాతావరణ ఉత్పాతానికి గనుల సంస్థల, పరిశ్రమల దురాశే ప్రధాన కారణంగా మారింది. రాజధాని ఉలాన్ బేటర్ 13 లక్షల జనాభా ఉన్న చిన్న నగరమే. కానీ ప్రపంచంలో అతి ఎక్కువ వాయు కాలుష్య నగరం అదే.  ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే ఆ నగరంలో మరణాల రేటు 24 నుంచి 45 శాతం ఎక్కువ. నాలుగేళ్ల ప్రాయానికే గుర్రపుస్వారీ మొదలెట్టి, మందలు తోలుకుంటూ స్వేచ్ఛావిహారం చేసే మంగోలులు గనుల్లో మగ్గుతూ మొగ్గలుగానే రాలిపోవాల్సి వస్తోంది.
 
 గనుల పరిశ్రమసహా అన్ని చోట్లా మంచి ఉద్యోగాలన్నిటికీ చైనీయుల నుండి పోటీ ఎదురవుతోంది. చైనాలోని ఇన్నర్ మంగోలియా జనాభాలో 60 శాతంగా మారిన చైనీయులు మంగోలియా పట్టణాలకు వలస వస్తున్నారు. నైపుణ్యం, శక్తిసామర్ధ్యాలతో వారితో పోటీ పడలేని మంగోలులు అల్ప వేతనాల పనులకు పరిమితం కావాల్సి వస్తోంది. కొద్దిపాటి మంచి ఉద్యోగాలను చైనీ యులు, కొరియన్లు ఎగరేసుకుపోతున్నారు. దీంతో చైనా పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. చైనా మాత్రం మంగోలియా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోడానికి నానా తం టాలు పడుతోంది.
 
 చైనాతో కయ్యానికి దిగిన ఫలితంగా అరుదైన లోహాల కోసం ఆల్లాడుతున్న జపాన్ సైతం మంగోలియాను ఆశ్రయిస్తోంది. అన్నిటికి మించి అమెరికా మంగోలియాను ఎలాగైనా తన వ్యూహాత్మక భాగస్వామిగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇరాక్, అప్ఘాన్ యుద్ధాలకు మంగోలియా కొద్ది సంఖ్యలోనే అయినా సైన్యాన్ని పంపింది. ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అమెరికా తాపత్రయపడుతోంది. రష్యా గత ఐదేళ్లకాలంలో సామ, దాన, భేదోపాయాలను ప్రయోగించి మంగోలియాను మచ్చిక చేసుకోగలిగింది. అమెరికా గత అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్‌తో ప్రారంభించి ప్రధాన దేశాల నేతలంతా అతి కాలుష్య నగరం ఉలాన్ బేటర్‌కు ‘తీర్థయాత్రలు’ సాగిస్తున్నారు. అవినీతిమయమైన ప్రభుత్వంతో కలిసి ఎవరికి వారే ఖనిజ సంపదను కొల్లగొట్టాలన్న ఆరాటమే తప్ప... ముంచుకొస్తున్న పెను ఉత్పాతం నుంచి మంగోలియన్లను కాపాడాలన్న తపన ఎవరికీ లేదు. మంగోలియన్లు ఎలాంటి చావు చస్తేనేం నేలలోని ఖనిజ సంపదలు నిక్షేపంగానే ఉంటాయిగా?    
 
 -        {పపంచవ్యాప్త వార్షిక సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల కంటే మూడురెట్లు ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
 -        గోబీ ఎడారి ఏడాదికి 10,000 చ.కి.మీ. మేర విస్తరిస్తోంది. త్వరలోనే దేశంలో 90 శాతం ఎడారిగా మారిపోయే ముప్పు పొంచి ఉంది.
 -        2009-10 ఏడాది మంచు తుఫానుల్లో 65 లక్షల పశువులు చనిపోయాయి.
 -        పది పెద్ద గనుల నుంచి వెలికి తీస్తున్న  ఖనిజ సంపద విలువ ఏడాదికి 1.3 నుంచి 2.75 లక్షల కోట్ల డాలర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement