ప్రకృతి వైపరీత్యం ‘జడ్’మంగోలియాను ముంచెత్తుతోంది. అతి శీతల చలికాలంతో మంగోలియా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రకృతి ప్రకోపం వల్ల ఇక్కడ కనీసం పచ్చగడ్డి కూడా మొలవకపోవడంతో లక్షల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నాయి. అయితే.. గతంలో దశాబ్దానికి ఒకసారి వచ్చిన జడ్.. ఇప్పుడు తరచూ వస్తుండటంతో మంగోలియా ప్రజల ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి.
తూర్పు ఆసియా దేశమైన మంగోలియాలో తీవ్ర అనావృష్టి తరవాత అతి శీతల చలికాలం వస్తే దాన్ని జడ్ అంటారు. ఈ వాతావరణ వైపరీత్యంలో పచ్చగడ్డి కూడా మొలవక పశువులు పెద్ద సంఖ్యలో చనిపోతాయి. ప్రస్తుతం మంగోలియాలో జరుగుతున్నది ఇదే.
జడ్ వల్ల ఈ ఏడాది ఒక్క ఫిబ్రవరిలోనే 21 లక్షల పశువులు, గొర్రెలు, మేకలు చనిపోగా మే నెల కల్లా ఆ సంఖ్య 71 లక్షలకు చేరింది. వాటిలో 80 శాతాన్ని, అంటే 56 లక్షల జీవాలను పాతిపెట్టారు. లేదంటే అంటు వ్యాధులు ప్రబలుతాయని మంగోలియా ప్రభుత్వం పశువులను పాతిపెట్టింది.
దేశంలో జడ్ వల్ల మున్ముందు మొత్తం కోటీ 49 లక్షల జీవాలు చనిపోవచ్చునని, ఇది మంగోలియా పశుసంపదలో 24 శాతానికి సమానమని ఉప ప్రధాని ఎస్.అమార్ సైఖాన్ చెప్పారు. మంగోలియా జనాభా 33 లక్షలైతే వారికి 6.5 కోట్ల పశువులు, యాక్‌లు, గొర్రెలు, మేకలు, గుర్రాలు ఉన్నాయి. వీటిని జాతీయ సంపదగా ఆ దేశ రాజ్యాంగం ప్రకటించింది.
మంగోలియా ఎగుమతుల్లో గనుల నుంచి తవ్వి తీసిన ఖనిజాల తరవాత మాంసం, ఇతర జంతు ఉత్పత్తులదే రెండో స్థానం. వ్యవసాయంలో 80 శాతం వాటా పశుపాలన, మేకలు, గొర్రెల పెంపకానిదే. దీనివల్ల మంగోలియా జీడీపీలో 11 శాతం లభిస్తోంది.
ప్రసుత్తం జడ్ వల్ల మంగోలియా ఆర్థికవ్యవస్థ అస్థిరతకు లోనవుతోంది. ప్రధాన వృత్తి అయిన పశుపాలన దెబ్బతినడంతో ప్రజలు దేశ రాజధాని ఉలాన్ బటోర్‌కు, ఇతర పట్టణాలకు వలస పోతున్నారు. కానీ, అక్కడ వారందరికీ సరిపడా పనులు లేవు. గతంలో దశాబ్దానికి ఒకసారి వచ్చిన జడ్ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల మరింత తరచుగా వచ్చిపడుతోంది.
ప్రస్తుత జడ్ గడచిన పదేళ్లలో ఆరోది, మహా తీవ్రమైనది. జనానికి తీవ్ర ఆహార కొరత ఎదురవుతోంది. మంగోలియాను ఆదుకోవడానికి 60 లక్షల డాలర్ల విరాళాలను సేకరించాలని అంతర్జాతీయ సంస్థలు తలపెట్టినా మార్చి మధ్యనాటికి అందులో 20 శాతాన్ని కూడా సేకరించలేకపోయాయి. ఉక్రెయిన్, గాజా యుద్ధాలపై ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment