రొట్టె ముక్క... దుడ్డు కర్ర
రొట్టె ముక్క... దుడ్డు కర్ర
Published Sat, Oct 26 2013 12:50 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM
‘విభజన-అభివృద్ధి’ చైనా సరికొత్త దౌత్యనీతి. గడ్డు సమస్యలన్నిటినీ పక్కన పెట్టి, ఆర్థిక సహకారంతో అభివృద్ధిని సాధించాలనేది వియత్నాంతో చైనా తాజా దౌత్య విధానం. అదే ‘విభజన-అభివృద్ధి’ అంతరార్థం. ‘అభివృద్ధి’ దౌత్యాన్ని కాదంటే నోటి ముందున్న రొట్టె ముక్క అదృశ్యమై దుడ్డు కర్ర ప్రత్యక్షమౌతుంది.
‘విభజించి పాలించు’ తెల్లోడి కూట నీతి. ‘విభజన-అభివృద్ధి’ చైనా సరికొత్త దౌత్య నీతి. ఆ దౌత్యం వియత్నాం ప్రధాని గుయెన్ టాన్ డుంగ్‌పై వశీకరణ మంత్రంలాగా పనిచేసినట్టుంది. చైనా దురాక్రమణకు గురై స్వతంత్రం కోసం పోరాడిన గత చరిత్ర ను వియత్నమీయులు నేటికీ మరవలేదు. పైగా 1979లో కూడా చైనా ఆ దేశంపై దురాక్రమణకు పాల్ప డింది. నదీ జలాల నుంచి దక్షిణ చైనా సము ద్ర జలాల వరకు అడుగడుగునా వియత్నాం పై చైనా ఆధిపత్యవాద ధోరణిని ప్రదర్శిస్తోంది. ఈ నెల 15న చైనా ప్రధాని లీ కెగియాంగ్ వియత్నాంలో పర్యటించారు. అవి రెండూ చిరకాల మిత్ర దేశాలనిపించేలా లీ పర్యటన సాగింది. అనూహ్యమైన ఈ మార్పునకు కారణం చైనా నూతన నాయకత్వమేనని అనుకుంటే పొరపాటు. అది చైనా దౌత్య మాయాజాలం.
గడ్డు సమస్యలన్నిటినీ పక్కన పెట్టి, ఆర్థిక సహకారంతో అభివృద్ధిని సాధించాలనేది వియత్నాంతో చైనా తాజా దౌత్య విధానం. అదే ‘విభజన-అభివృద్ధి’ అంతరార్థం. అతి సరళమైన చెల్లింపుల పద్ధతిలో సకల రంగాల్లో ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని అందించడానికి లీ చొరవ చూపడం వియత్నాం ప్రధాని డుంగ్‌ను చిత్తు చేసింది. 2015 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి, భారీ ఎత్తున చైనా వియత్నాంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుది రాయి. మౌలిక సదుపాయాల నిర్మాణానికి వియత్నాంకు తక్షణం అవసరమైన 100 కోట్ల డాలర్ల సహాయాన్ని కూడా చైనా అందిస్తోంది.ై పెగా వివాదాస్పదమైన స్ప్రాట్లీ, పార్సెల్ దీవులకు కూడా ఈ ‘అభివృద్ధి’ విస్తరిస్తుంది. అమెరికా, జపాన్‌లు ఇవ్వలేని వరాలను ఆధిపత్యశక్తిగా వ్యవహరించే చైనా ఇస్తుంటే డుంగ్ ఎందుకు కాదనాలి?
ఏకైక అగ్రరాజ్యం అమెరికాది బాంబుల దౌత్యం లేదా ‘గన్‌బోట్ డిప్లమసీ.’ బెదిరిం చడం లొంగకపోతే బాంబులు కురిపించడమే తప్ప మరొకటి దానికి తెలియదు. ఇరాక్ ఆ దౌత్య నీతికి భీకర నిదర్శనం. అమెరికా దౌత్య ఆయుధాగారంలో ‘దుడ్డుకర్ర, రొట్టెముక్క’ కూడా లేకపోలేదు. అయితే అది రొట్టెముక్క విసరాడనికి ముందే... దుడ్డుకర్ర భయానికి దాని కోరికలన్నిటినీ నెరవేర్చక తప్పదు. చైనా అందుకు విరుద్ధంగా రొట్టెముక్కలు ముందుగానే ఇచ్చి కావాలనుకున్నది సాధిస్తోంది.
బాంబుల దౌత్యంతో అమెరికా ప్రపంచాధిపత్యాన్ని నెరపుతుంటే చైనా వాణిజ్య, పెట్టుబడుల సేనలతో ఆ ఆధిపత్యానికి నిచ్చెనలు వేస్తోంది. వాణిజ్యపరంగా, ఆర్థికంగా తమపై ఆదారపడ్డ దేశాలు రాజకీయంగా తమకు అనుకూలంగా లేదా తటస్థంగా వ్యవహరించ క తప్పదనేది చైనా తర్కం. దక్షిణ చైనా సముద్రంలోని సుసంపన్నమైన కర్బన ఇంధన వనరుల కోసం కాకపోతే చిన్నా చితక దీవులపై చైనా ‘చారిత్రక హక్కుల’ ప్రకటన మరెం దుకు? ఆర్థిక సహకారం, అభివృద్ధి పేరిట ‘శాంతియుతంగానే’ ఆ హక్కులు సమకూరితే మరేం కావాలి? గత ఏదాది వియత్నాం తీరంలో భారత చమురు, సహజ వాయువుల సంస్థ (ఓఎన్‌జీసీ) చేపట్టిన చమురు అన్వేషణపై చైనా తీవ్ర అభ్యంతరాలు తెలిపింది. నాటి ఉద్రిక్తతల మధ్య చైనా ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’... ‘భారత చర్యలు చైనా సహనం హద్దులు దాటేంత వరకు నెడుతున్నాయి’ అని హెచ్చరించింది. చివరకు ‘రాజ కీయ కారణాల వల్ల’ వియత్నాం ఓఎన్‌జీసీతో ఒప్పందాన్ని రద్దు చేసింది. అదే టోంకిన్ అఖాతంలో చమురు అన్వేషణ, వెలికితీత కాంట్రాక్టులను చైనాకు కట్టబెట్టింది!
వియత్నాం రావటానికి ముందు లీ ‘ఆసియాన్’ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్) సమావేశాలకు హాజరయ్యారు. ఆసందర్భంగా బ్రూనీలో కూడా లీ ‘రొట్టె ముక్కలను’ పంచారు. అభివృద్ధి ఆశను చూపి దీర్ఘకాలిక సహకారానికి పునాదులు వేశారు. మొత్తంగా దక్షిణ చైనా సముద్రప్రాంతం అంతటికీ చైనా ఇదే దౌత్యాన్ని విస్తరింపజేస్తోంది. చైనా దుడ్డు కర్రను దాచేసిందే తప్ప వదిలేయలేదు. ‘అభివృద్ధి’ దౌత్యాన్ని కాదం టే నోటి ముందున్న రొట్టె ముక్క అదృశ్యమై దుడ్డు కర్ర ప్రత్యక్షమౌతుందని తెలిసేట్టు చేసింది. వియత్నాంతో హనీమూన్‌లా సాగిన తన పర్యటనలో లీ... ద్వైపాక్షిక సమస్యలను ‘అంతర్జాతీయం చేస్తే సహించేది లేదని’ హెచ్చరించారు. చైనాను ఏకాకిని చేయడానికి అమెరికా, జపాన్‌లు రచిస్తున్న సైనిక వ్యూహా లకు దూరంగా ఉండాలని అంతరార్థం.
- పిళ్లా వెంకటేశ్వరరావు
Advertisement