ఎన్టీఆర్ పేరు చెరిపేయాలని..
వెన్నుపోటు పొడిచి గద్దెదింపిన తర్వాత మనోవేదనకు గురైన ఎన్టీఆర్.. 1996 జనవరిలో దివంగతులయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ పేరును చెరిపేయడానికి చంద్రబాబు అన్ని రకాలుగా ప్రయత్నించారు. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటాన్ని తొలగించి చంద్రబాబు తన ఫోటోను ఏర్పాటు చేయించారు. అప్పటినుంచి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా.. ఏం చేసినా, అది పార్టీ కార్యక్రమం అయినా ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు రాకుండా చేశారు. ప్రతిదానిపైనా తన సొంత ఫొటో వేయించుకున్నారు. తన ఇమేజీని పెంచుకోవడానికి విపరీతమైన ప్రచారం చేయించుకున్నారు.
ఆ తర్వాత ఎన్నికల సమయంలో మాత్రం ఎన్టీఆర్ జపం చేశారు. 1999 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్లీ ఎన్టీఆర్ పేరును పక్కనపెట్టారు. తర్వాత మళ్లీ ఎన్నికల సందర్భంగా తప్ప ఎప్పుడూ ఎన్టీఆర్ మాటెత్తడానికి చంద్రబాబు ఇష్టపడలేదు. ఇలా ప్రతిసారీ ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ నామస్మరణ చేయడం ఆనవాయితీగా మారింది. ఏడాదిన్నర కింద జరిగిన ఎన్నికల్లోనూ ఎన్టీఆర్ పేరుతో మేనిఫెస్టోలో కొన్ని పథకాలను కూడా ప్రకటించారు. అన్న క్యాంటీన్ల వంటి అనేక కార్యక్రమాలను అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కనపెట్టి చంద్రన్న కానుక వంటి తన పేరుతో పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.