భారతరత్న అందుకున్న రావు, సచిన్
దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: ప్రఖ్యాత శాస్త్రవేత్త చింతామణి నాగేశ రామచంద్రరావు (సీఎన్‌ఆర్ రావు)(79), క్రికెట్ క్రీడా దిగ్గజం సచిన్ రమేశ్ టెండూల్కర్(40)లకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ‘ఇది అద్భుతం. ఈ పురస్కారం అన్నిటికన్నా ముఖ్యమైనది. నా సొంతదేశం నన్ను భారతరత్నతో గౌరవించడాన్ని మరి దేంతోనూ పోల్చలేను’ అని పురస్కార ప్రదాన కార్యక్రమం అనంతరం సీఎన్‌ఆర్ రావు ఆనందోద్వేగాలతో వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి వచ్చిన టెండూల్కర్ అభిమానులను అదుపు చేయడం రాష్ట్రపతి భవన్ సిబ్బందికి తలకు మించిన భారమైంది.
సీఎన్‌ఆర్ రావు, టెండూల్కర్.. ఈ ఇద్దరూ గతంలో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను అందుకున్నవారే.
రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఈ అవార్డ్ అందుకున్న ఏకైక వ్యక్తి సచిన్ కావడం విశేషం.
1954 నుంచి ఇప్పటివరకు వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 43 మందికి భారత ప్రభుత్వం ఈ పురస్కారం ప్రకటించింది. భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారిని 1954లో మొట్టమొదటి భారతరత్నగా గౌరవించారు.
గత నాలుగేళ్లుగా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించలేదు. చివరగా 2009లో హిందూస్థానీ సంగీతజ్ఞుడు భీమ్‌సేన్‌జోషికి ప్రకటించారు.
సీఎన్‌ఆర్ రావు గురించి..
‘సాలిడ్ స్టేట్ అండ్ మెటీరియల్స్ కెమిస్ట్రీ’లో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త. ఇప్పటివరకు ఆయన 45 పుస్తకాలను,1,400 పరిశోధన పత్రాలను ప్రచురించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు.
సీవీ రామన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తరువాత భారతరత్న అందుకున్న మూడో శాస్త్రవేత్త.
భారత ప్రధానమంత్రి శాస్త్ర సలహా మండలికి ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్నారు.
ఇతర దేశాలు మెరుగ్గా ఉన్నాయి
‘శాస్త్ర రంగంలో భారత్ కృషి బాగానే ఉంది. అయితే, ఇతర దేశాలు ఇంకా మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. దక్షిణ కొరియా, చైనాలు పరిశోధనపై అధిక మొత్తాలను వెచ్చిస్తున్నాయి. పద్మ అవార్డుల తాజా జాబితాలో 14 మంది శాస్త్రజ్ఞులకు స్థానం కల్పించడం మంచి సంకేతం. త్వరలో నాకు 80 ఏళ్లు వస్తాయి. అయినా, రానున్న రోజుల్లో ఒక ముఖ్యమైన లక్ష్యం సాధించగలనని ఆశిస్తున్నాను’
- ప్రదానోత్సవం అనంతరం
మీడియాతో సీఎన్‌ఆర్ రావు