SachinTendulkar
-
ఫౌండేషన్ ద్వారా సచిన్ కార్యక్రమాలు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సృష్టించిన రికార్డులు మనందరికి తెలిసిందే. క్రికెట్ చరిత్రలో ఎన్నో మైలురాళ్లను సచిన్ సాధించాడు. కేవలం క్రికెట్లోనే కాక ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించాడు. తాజాగా ప్రముఖ ఎన్జీఓ సంస్థ పరివార్‌తో కలిసి ఆర్థికంగా వెనుకబడిన 560 గిరిజన చిన్నారులకు చేయుత ఇవ్వనున్నాడు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లోని సేహోర్ జిల్లాల్లో (గ్రామీణ ప్రాంతాలు) సేవా కుటిర్స్‌ను పరివార్ సంస్థ నిర్మించింది. మరోవైపు సేవానియా, బీల్పాటి, కాపా తదితర గ్రామాలలో మధ్యాహ్మ భోజనం, ఉచిత విద్యను టెండూల్కర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాలలో పోషకాహార లోపం, నిరక్షరాస్యత తదితర సమస్యలను పత్రికలో చూసి సచిన్ గిరిజన గ్రామాలలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. -
‘లారెస్’ టాప్–5లోకి సచిన్ 2011 ఫైనల్ సంబరం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక లారెస్ అవార్డు అందుకునే దిశగా సచిన్ ‘2011 ప్రపంచకప్ ఫైనల్ సంబర ఘట్టం’ మరో అడుగు ముందుకు వేసింది. ముంబై వాంఖడే మైదానంలో ఫైనల్ గెలిచిన అనంతరం భారత ఆటగాళ్లు సచిన్‌ను తమ భుజాలపై మోసిన దృశ్యం అవార్డు కోసం పోటీ పడుతుంది. ఇప్పటి వరకు 20 ఎంట్రీలు అవార్డు రేసులో ఉండగా వాటిని ఐదుకు కుదించారు. ఈ టాప్–5లో సచిన్ సంబరానికి చోటు దక్కింది. ‘క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎ నేషన్’ అనే టైటిల్‌తో నాటి క్షణం అవార్డు బరిలో నిలిచింది. ఫిబ్రవరి 16న ఓటింగ్ ముగిశాక... బెర్లిన్‌లో జరిగే కార్యక్రమంలో విజేతను 17న ప్రకటిస్తారు. -
యువత మేలుకోవాలి: సచిన్
చెన్నై: ఏదో ఒక క్రీడల్లో పాల్గొంటూ ఆరోగ్యాలను కాపాడుకోవాలని భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దేశ యువతకు సూచించారు. శారీరక వ్యాయమాలు లేకుండా క్రీడలకు దూరంగా ఉంటూ దేశంలో అనారోగ్య జనాభాను పెంచొద్దని హితవు పలికారు. తన కబడ్డీ టీం ‘తమిళ్ తలైవాస్’ యజమానిగా జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ దేశంలో స్ధూలకాయం నిర్మూలించాలంటే యువత క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. అనారోగ్యాలతో 2020 వరకు జనాభా పరంగా మనదేశం చాలా చిన్నదిగా మారిపోవచ్చునని.. ఎందుకంటే స్థూలకాయంలో మన దేశం మూడోస్థానంలో ఉందని హెచ్చరించాడు. దీని నుంచి బయటపడాలంటే క్రీడా కార్యకలాపాలు పెరగాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆట ఆడాలన్నాడు. ప్రొ కబడ్డీలీగ్ పై మాట్లాడుతూ.. ఆటలపై ఉన్న ఆసక్తితోనే తైలావా జట్టు భాగస్వామిగా ఉన్నానని సచిన్ పేర్కొన్నాడు. తమ జట్టు ఫైనల్ చేరుతుందని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఆటగాళ్లకు అత్యుత్తమ ప్రదర్శనతో అభిమానులను అలరింప చేయాలని సూచించాడు. కబడ్డీ డ్రీమ్ జట్టుపై అడగ్గా మాజీ కెప్టెన్ ధోని ఢిఫెండర్, ఊపిరి బిగపట్టే సింగర్ శంకర్ మహాదేవన్ రైడర్ అని సరదాగా వ్యాఖ్యానించాడు. తలైవా జట్టు అంబాసిడర్ కమలాహాసన్ కు సచిన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ఇక చెన్నై తలైవా సహాయజమానులు నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్, హీరో రామ్ చరణ్ తేజ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
భారతరత్న అందుకున్న రావు, సచిన్
దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసిన రాష్ట్రపతి న్యూఢిల్లీ: ప్రఖ్యాత శాస్త్రవేత్త చింతామణి నాగేశ రామచంద్రరావు (సీఎన్ఆర్ రావు)(79), క్రికెట్ క్రీడా దిగ్గజం సచిన్ రమేశ్ టెండూల్కర్(40)లకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ‘ఇది అద్భుతం. ఈ పురస్కారం అన్నిటికన్నా ముఖ్యమైనది. నా సొంతదేశం నన్ను భారతరత్నతో గౌరవించడాన్ని మరి దేంతోనూ పోల్చలేను’ అని పురస్కార ప్రదాన కార్యక్రమం అనంతరం సీఎన్ఆర్ రావు ఆనందోద్వేగాలతో వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి వచ్చిన టెండూల్కర్ అభిమానులను అదుపు చేయడం రాష్ట్రపతి భవన్ సిబ్బందికి తలకు మించిన భారమైంది. సీఎన్ఆర్ రావు, టెండూల్కర్.. ఈ ఇద్దరూ గతంలో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ను అందుకున్నవారే. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఈ అవార్డ్ అందుకున్న ఏకైక వ్యక్తి సచిన్ కావడం విశేషం. 1954 నుంచి ఇప్పటివరకు వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 43 మందికి భారత ప్రభుత్వం ఈ పురస్కారం ప్రకటించింది. భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారిని 1954లో మొట్టమొదటి భారతరత్నగా గౌరవించారు. గత నాలుగేళ్లుగా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించలేదు. చివరగా 2009లో హిందూస్థానీ సంగీతజ్ఞుడు భీమ్సేన్జోషికి ప్రకటించారు. సీఎన్ఆర్ రావు గురించి.. ‘సాలిడ్ స్టేట్ అండ్ మెటీరియల్స్ కెమిస్ట్రీ’లో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త. ఇప్పటివరకు ఆయన 45 పుస్తకాలను,1,400 పరిశోధన పత్రాలను ప్రచురించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. సీవీ రామన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తరువాత భారతరత్న అందుకున్న మూడో శాస్త్రవేత్త. భారత ప్రధానమంత్రి శాస్త్ర సలహా మండలికి ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్నారు. ఇతర దేశాలు మెరుగ్గా ఉన్నాయి ‘శాస్త్ర రంగంలో భారత్ కృషి బాగానే ఉంది. అయితే, ఇతర దేశాలు ఇంకా మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. దక్షిణ కొరియా, చైనాలు పరిశోధనపై అధిక మొత్తాలను వెచ్చిస్తున్నాయి. పద్మ అవార్డుల తాజా జాబితాలో 14 మంది శాస్త్రజ్ఞులకు స్థానం కల్పించడం మంచి సంకేతం. త్వరలో నాకు 80 ఏళ్లు వస్తాయి. అయినా, రానున్న రోజుల్లో ఒక ముఖ్యమైన లక్ష్యం సాధించగలనని ఆశిస్తున్నాను’ - ప్రదానోత్సవం అనంతరం మీడియాతో సీఎన్ఆర్ రావు -
యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్
ముంబై: యూనిసెఫ్ (ఐక్యరాజ్య సమితి బాలల నిధి) బ్రాండ్ అంబాసిడర్‌గా భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్ నియమితులయ్యారు. దక్షిణాసియా విభాగానికి సచిన్ ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు యూనిసెఫ్ గురువారం ప్రకటించింది. పిల్లల హక్కులతో పాటు వారి పౌష్టికాహారం అంశాలపై ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కోసం వివిధ దేశాల నుంచి సెలబ్రిటీలు ఎంపిక కాగా, ఈ సంవత్సరం భారత్ నుంచి సచిన్ ఎంపికయ్యాడు. యూనిసెఫ్ తరుపున రెండు సంవత్సరాల పాటు సేవలు అందించేందుకు సచిన్ సన్నద్ధమయ్యాడు. తనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం పట్ల సచిన్ సంతోషం వ్యక్తం చేశాడు. క్రికెట్ కెరీర్‌ను ముగించిన అనంతరం తన రెండో ఇన్నింగ్స్ నుఈ రకంగా ఆరంభించడం చాలా ఆనందంగా ఉందన్నాడు. దేశంలోని 36 శాతం మంది సురక్షితమైన మరుగుదొడ్లు లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. సామాన్యునికి కనీస అవసరమైన మరుగుదొడ్లపై సరైన అవగాహన లేకపోవడం చాలా బాధాకరమన్నాడు. ఈ అంశాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టతరమైందిగా పేర్కొన్నాడు. శక్తి సామర్థ్యల మేర తనకు లభించిన ఈ అవకాశానికి వంద శాతం న్యాయం చేస్తానని సచిన్ తెలిపాడు చాలా కుటుంబాల్లో పిల్లల అవసరాల్ని తీర్చడంలో తల్లి కీలక పాత్ర పోషింస్తుదన్నాడు. పిల్లల విసర్జించిన మల మూత్రాల గురించి దేశంలోని చాలా మంది తల్లులకు సరైన అవగాహన లేక వారి ప్రాణాలకు ముప్పువాటిల్లుతుందన్నాడు. పిల్లల మల మూత్రాలను తీసివేసిన అనంతరం తల్లులు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోకుండా ఆహారాన్ని అందించకూడదన్నాడు. చిన్నారులు బంగారు భవిత ఇటువంటి చిన్న చిన్న కారణాల వల్లే భారంగా మారుతుందని సచిన్ ఆవేదన వ్యక్తం చేశాడు. రకరకాల వ్యాధులతో ప్రతీరోజూ 1600 పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని మాస్టర్ తెలిపాడు. -
క్రికెట్ కు మాస్టర్ వీడ్కోలు
ముంబై: సచిన్ టెండూల్కర్.. అలుపు సలుపు లేకుండా సుదీర్ఘ కాలం పాటు భారత్ కు సేవలందించిన క్రికెటర్. 24 సంవత్సరాల పాటు క్రికెట్ ను ఆస్వాదిస్తూ బ్రతికిన క్రికెటర్. భారత్ క్రికెట్ కు మరింత వైభవం తీసుకొచ్చిన క్రికెటర్. అతని క్రీడా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూస్తూ ఎదిగి ఒదిగిన క్రికెటర్. 1989 లో క్రికెట్ కెరీర్ ను ఆరంభించిన సచిన్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ప్రపంచ వ్యాప్తంగా విశేష అభిమానులను సంపాదించుకున్న ఈ లెజెండ్ క్రికెటర్ త్వరలో పూర్తి స్థాయిలో క్రికెట్ నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. వెస్టిండీస్ తో నవంబర్ లో జరిగే 200వ టెస్టు అనంతరం తాను క్రికెట్ నుంచి విరామం తీసుకోనున్నట్లు సచిన్ తెలిపాడు. సచిన్ అంటే క్రికెట్. క్రికెట్ అంటే సచిన్. భారత్ ఏ దేశంతోనైనా మ్యాచ్ ఆడుతుందంటే సచిన్ ఉన్నాడా?అనేది ప్రేక్షకుల మదిలో తొలి ప్రశ్న. ఆ ప్రశ్నకు లెజెండ్ సచిన్ ముగింపునిచ్చాడు.తాను క్రికెట్ నుంచి విరామం తీసుకునే సమయం ఆసన్నమైందని భావించిన సచిన్ బాధాతప్త హృదయంతో పూర్తి విరమణ తీసుకుంటున్నట్లు తెలిపాడు. కొన్ని దశాబ్దాలను తన పేరు మీద లిఖించుకున్న క్రికెటర్ రిటైర్ కాబోతున్నాడంటే సగటు క్రికెట్ అభిమానికి జీర్ణించుకోలేని అంశమే. కాగా, విరమణ ఎప్పటికైనా జరగాలి కాబట్టి ఇదే సరైన సమయం అని భావించిన సచిన్ అభిమానులకు నిరాశను మిగిల్చాడు. అటు టెస్టుల్లోనూ, ఇటు వన్డేల్లోనూ తనకంటూ ఓ ముద్ర వేసుకున్న సచిన్ 198 టెస్టుల్లో 51 సెంచరీల సాయంతో 15,837 పరుగులు, 463 వన్డేల్లో 49 సెంచరీలతో 18,426 పరుగులు సాధించి అరుదైన రికార్డు ను నెలకొల్పాడు. ఈ క్రమంలోనే అత్యధిక వన్డేల రికార్డును కూడా అతను సొంతం చేసుకున్నాడు. అతనికి రికార్డులు మచ్చుకు కొన్ని చెప్పుకున్నా అతని బ్యాటింగ్ విన్యాసాల్ని అక్షరాల్లో లిఖించడం కష్టమే. భారత్ 2011 ప్రపంచ కప్ ను గెలిచిన అనంతరం సచిన్ రిటైర్ అవుతున్నట్లు ఊహాగానాలు వచ్చినా, కాసింత బ్రేక్ తర్వాత కెరీర్ ముగింపునిస్తున్నట్లు తెలిపాడు. గతంలోనే వన్డే, టీ-20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ ఇప్పుడు పూర్తిగా క్రికెట్ కు దూరంగా కానున్నాడు. సచిన్ క్రికెట్ నుంచి విరామం తీసుకుంటున్నప్పటికీ అతని సలహాలు భారత్ క్రికెట్ కు ఉపయోగపడతాయని ఆశిద్దాం. -
ట్వెంటీ20తో క్రికెట్ కు మరింత ఉత్సాహం: సచిన్
ఒత్తిడి జయించగలిగే సత్తా ఉన్న ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేయాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. కేఎస్ సీఏ ప్లాటినమ్ జూబ్లీ సెలబ్రేషన్ లో సచిన్ మాట్లాడుతూ జాతీయ జట్టుకు ఆటగాళ్లను ఎంపిక చేసేట్టప్పుడు వారి దేశవాళీ పోటీలలో సాధించిన స్కోర్ల ఆధారంగా కాకుండా.. అంతర్జాతీయ పోటీల్లో ఒత్తిడిని తట్టుకుని రాణించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సలహా ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్ లో అద్బుతంగా రాణించి..అంతర్జాతీయ క్రికెట్ లో ఘోరంగా విఫలమైన వారిని ఎంతో మందిని తాను చూశానని సచిన్ వ్యాఖ్యానించారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని జట్టు ఎంపిక చేయాలని మాస్టర్ అన్నాడు. ఒకవేళ ఆటగాడు విఫలమైనా.. కొన్ని అవకాశాలిచ్చి ఆటగాడి సామర్ధ్యాన్ని పరిశీలించాలన్నాడు. ట్వెంటీ20 ఫార్మాట్ క్రికెట్ స్వరూపాన్నే మార్చి వేసిందని.. టెస్ట్ విజయాలపై ప్రభావం కూడా చూపుతోంది అని సచిన్ తెలిపాడు. మూడు ఫార్మాట్లు ఉన్న ఒకే ఒక క్రీడ క్రికెట్ అని.. ట్వంటీ20 క్రికెట్ ఆటను మరింత ఉత్సాహభరితంగా మార్చిందన్నారు.