యువత మేలుకోవాలి: సచిన్
చెన్నై: ఏదో ఒక క్రీడల్లో పాల్గొంటూ ఆరోగ్యాలను కాపాడుకోవాలని భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దేశ యువతకు సూచించారు. శారీరక వ్యాయమాలు లేకుండా క్రీడలకు దూరంగా ఉంటూ దేశంలో అనారోగ్య జనాభాను పెంచొద్దని హితవు పలికారు. తన కబడ్డీ టీం ‘తమిళ్ తలైవాస్’ యజమానిగా జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ దేశంలో స్ధూలకాయం నిర్మూలించాలంటే యువత క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. అనారోగ్యాలతో 2020 వరకు జనాభా పరంగా మనదేశం చాలా చిన్నదిగా మారిపోవచ్చునని.. ఎందుకంటే స్థూలకాయంలో మన దేశం మూడోస్థానంలో ఉందని హెచ్చరించాడు. దీని నుంచి బయటపడాలంటే క్రీడా కార్యకలాపాలు పెరగాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆట ఆడాలన్నాడు.
ప్రొ కబడ్డీలీగ్ పై మాట్లాడుతూ.. ఆటలపై ఉన్న ఆసక్తితోనే తైలావా జట్టు భాగస్వామిగా ఉన్నానని సచిన్ పేర్కొన్నాడు. తమ జట్టు ఫైనల్ చేరుతుందని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఆటగాళ్లకు అత్యుత్తమ ప్రదర్శనతో అభిమానులను అలరింప చేయాలని సూచించాడు. కబడ్డీ డ్రీమ్ జట్టుపై అడగ్గా మాజీ కెప్టెన్ ధోని ఢిఫెండర్, ఊపిరి బిగపట్టే సింగర్ శంకర్ మహాదేవన్ రైడర్ అని సరదాగా వ్యాఖ్యానించాడు. తలైవా జట్టు అంబాసిడర్ కమలాహాసన్ కు సచిన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ఇక చెన్నై తలైవా సహాయజమానులు నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్, హీరో రామ్ చరణ్ తేజ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.