‘త్రిశంకు’లో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు | 'Trisankulo Triple IT students | Sakshi
Sakshi News home page

‘త్రిశంకు’లో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు

Published Thu, Jul 31 2014 2:22 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

‘త్రిశంకు’లో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు - Sakshi

‘త్రిశంకు’లో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు

  • ఆఖరి సంవత్సరం విద్యార్థుల ఆందోళన
  •   ఫలితాల విడుదల్లో తీవ్ర జాప్యం
  •   4న హైదరాబాద్‌లో స్నాతకోత్సవం!
  • నూజివీడు : ట్రిపుల్ ఐటీలో చదవాలనే గ్రామీణ విద్యార్థుల ఆశ అఖరి సంవత్సరం వచ్చేనాటికి ఆవిరైపోతోంది. గ్రామీణ పేద విద్యార్థులకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో  ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ఐటీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   పరీక్షలు నిర్వహించి దాదాపు 3నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఫలితాలు రాకపోవడంతో ఆఖరి సంవత్సరం విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.  

    రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక  విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ఐటీల్లో  ఆరు సంవత్సరాల ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసిన  విద్యార్థుల(తొలిబ్యాచ్) ఆఖరి సంవత్సరం ఫలితాల్లో జాప్యం నెలకొంది. హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంలో ఏం జరుగుతుందో స్థానిక ట్రిపుల్‌ఐటీ  అధికారులకు సమాచారం లేదు. ఆరు సంవత్సరాల ఇంజినీరింగ్ విద్యలో మొదటి రెండు సంవత్సరాలను పీయూసీగా, తరువాత నాలుగు సంవత్సరాలను ఇంజినీరింగ్‌గా  పరిగణిస్తారు. 2008లో ప్రారంభమైన ట్రిపుల్‌ఐటీలలో తొలిబ్యాచ్ ప్రస్తుతం బయటకు అడుగిడబోతోంది.

    అయితే వీరి చివరి సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ మూడో వారంలో  జరిగినప్పటికీ నేటికీ   ఫలితాలు వెలువడకపోవడం గమనార్హం. ఆఖరి సంవత్సరం ఫలితాలు వెలువడక  పోవడంతో  మూడు ట్రిపుల్‌ఐటీల్లోని 6వేల మంది విద్యార్థులు   ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాల గురించి విద్యార్థులు ఎన్నిమార్లు అడిగినా సరైన సమాధానం చెప్పేవారు కూడా లేకపోవడంలో వారిలో అయోమయం నెలకొంది.

    ఫలితాలు రాకపోవడంతో క్యాంపస్ సెలక్షన్‌లో పలు కంపెనీలకు ఎంపికైన విద్యార్థులు  ఫలితాలు వస్తే ఉద్యోగాలకు వెళ్లాలని  ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  పదో తరగతి, ఇంటర్లో  లక్షలాది మంది విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలను 40రోజుల్లో విడుదల చేస్తుండగా, కేవలం 6వేల మంది విద్యార్థులకు చెందిన ఫలితాలు విడుదల చేయలేకపోవడంపై ట్రిపుల్‌ఐటీ సిబ్బందే ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.
     
    ఫలితాలు రాకుండానే  స్నాతకోత్సవమా?

    వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా ఫలితాలు రాకుండానే ఆగస్టు 4న హైదరాబాద్‌లో స్నాతకోత్సవం నిర్వహించడానికి ఆర్జీయూకేటీ  సన్నాహాలు చేస్తోంది. ట్రిపుల్‌ఐటీల నుంచి తొలిబ్యాచ్ బయటకు వెళ్తున్న నేపథ్యంలో వారికి ఈ  స్నాతకోత్సవంలో యూనివర్సిటీ డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనుంది. ఒకటి రెండు రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారేమోననే అభిప్రాయాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement