ఆరేళ్ళ అంబాసిడర్‌... జష్నీత్‌ కౌర్‌! | Jashneet Kaur, Punjab poster child for edu campaigns | Sakshi
Sakshi News home page

ఆరేళ్ళ అంబాసిడర్‌... జష్నీత్‌ కౌర్‌!

Jul 2 2021 6:12 AM | Updated on Jul 2 2021 6:12 AM

Jashneet Kaur, Punjab poster child for edu campaigns - Sakshi

జష్నీత్‌ కౌర్‌

వేగంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనుషులు మారుతున్నారు. కానీ ఇప్పటికీ అమ్మాయి పుడితే ఆనందించే కుటుంబాలు కొన్నే కనిపిస్తాయి. ఈ కోవకు చెందిన పంజాబి కుటుంబంలో పుట్టింది జష్నీత్‌ కౌర్‌. ముద్దులొలికే మాటలు, చిరునవ్వుల ముఖంతో ఆకర్షణీయంగా ఉండడంతో జష్నీత్‌ను పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం.. ఎడ్యుకేషన్‌ అంబాసిడర్‌ గా ఎన్నుకుంది. దీంతో ఎక్కడ చూసినా తమ చిన్నారి ఫోటో కనిపించడంతో అమ్మాయి వద్దనుకున్న జష్నీత్‌ తల్లి.. మా అమ్మాయి అబ్బాయితో సమానం అని గర్వంగా చెబుతున్నారు.

 పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ జిల్లా వారా భాయ్‌ కా గ్రామానికి చెందిన జగిత్‌ సింగ్, సుదీప్‌ కౌర్‌ దంపతులకు జష్నీత్‌ పుట్టింది. సుదీప్‌ ఇంటర్మీడియట్‌ వరకు చదివి గృహిణి గా ఇంటి బాధ్యతలు చూసుకుంటుంటే.. జగిత్‌ ఓ దారాల తయారీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. సుదీప్‌ కడుపుతో ఉన్నప్పుడు తనకు అబ్బాయే పుట్టాలని కోరుకునేవారు. తొలి సంతానం కావడంతో ఆమె కొడుకు కావాలని, తనకి కొడుకే పుడతాడని ఆమె కలలు కనేవారు. కానీ చివరికి జష్నీత్‌ పుట్టింది. అమ్మాయి పుట్టిందని ఆమె చాలా బాధపడ్డారు. అయితే జష్నీత్‌ తండ్రి, తాత, నానమ్మలు మాత్రం నిరాశ చెందలేదు. జష్నీత్‌ను అల్లారుముద్దుగా చూసుకునేవారు.  కానీ సుదీప్‌కౌర్‌కు మాత్రం ఆనందంగా ఉండేవారు కాదు.

బాగా చదివించాలని..
 ఒక్కగానొక్క కూతురు కావడంతో జష్నీత్‌ను ప్రైవేటు స్కూల్లో బాగా చదివించాలనుకున్నారు. కానీ గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్కూలు స్మార్ట్‌ స్కూల్‌గా మారడంతో ..ప్రైవేట్‌ స్కూళ్లలో ఉన్న సదుపాయాలన్నీ ఇక్కడ కూడా ఉండడంతో జష్నీత్‌ను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్చారు. ఓ రోజు ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కృష్ణ కుమార్‌ ఆ స్కూల్‌ ను సందర్శించారు. జష్నీత్‌ను చూసిన ఆయన ఆమెతో మాట్లాడి ఫోటోలు తీసుకుని ఈ అమ్మాయి పంజాబ్‌ ఎడ్యుకేషన్‌ విభాగం బ్రాండ్‌ అంబాసిడర్‌ అని ప్రకటించారు. అప్పటి నుంచి ఎడ్యుకేషన్‌ ప్రకటనల్లో జష్నీత్‌ కనిపించడం ప్రారభమైంది.

  రాష్ట్రంలో ఏ న్యూస్‌ పేపర్, టీవీల్లో వచ్చే ప్రకటనలు, సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయింది. ఆరేళ్ళ అమాయకమైన ముఖం, కళ్లతో చిరునవ్వులు చిందిస్తూ స్కూలు యూనిఫాం, టై కట్టుకుని రిబ్బన్లతో కట్టిన రెండు జడల్ని ముందుకేసుకున్న ఫోటో ఎడ్యుకేషన్‌ విభాగం నిర్వహించే అనేక కార్యక్రమాలో 2018 నుంచి కనిపించేది. వాట్సాప్‌ డిస్లే్ప ఫోటోగానూ జష్నీత్‌ కనిపించడం విశేషం. ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లల్ని చేర్పించమని.. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. మంచి విద్యను అందిస్తున్నాం అని ప్రభుత్వం తరుపున ప్రచారం చేస్తోంది జష్నీత్‌. ఈచ్‌ వన్, బ్రింగ్‌ వన్‌ (ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచే కార్యక్రమం), ఘర్‌ బైటే శిక్షా(ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌), లైబ్రరీ లాంగర్, మిషన్‌ సాత్‌ పరిషత్‌ వంటి కార్యక్రమాల్లో గత మూడేళ్లుగా జష్నీత్‌ ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? ఎంత అదృష్ట వంతురాలో అని అందరు అనుకుంటుంటే..జష్నీత్‌ తల్లి తెగ మురిసిపోతున్నారు.

‘‘జష్నీత్‌ పుట్టినప్పుడు అమ్మాయి పుట్టిందని చాలా బాధపడ్డాను. కన్నతల్లిగా కూతుర్ని అప్యాయంగా చూడలేకపోయాను. ఇప్పుడు మాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఎక్కడ చూసిన నా చిట్టి తల్లి ఫోటోలు కనిపిస్తున్నాయి. అందరికి జష్నీత్‌ ఎవరో తెలిసిపోయింది. నాకు కొడుకు వద్దు జష్నీతే అబ్బాయి తో సమానం’’ అని ఆమె చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement