
సైన్స్‌ను ప్రజలకు దగ్గర చేయాలి: గాదరి కిషోర్
మోత్కూరు: గ్రామాల్లో పేరుకపోయిన మూడనమ్మకాలను దూరంచేసి శాస్త్రసాంకేతిక రంగాలు అందజేస్తున్న విజ్ఞానాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు దగ్గర చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. ఆదివారం మోత్కూరులో జన విజ్ఞానవేదిక రెండో జిల్లా మహాసభలు ఎస్‌ఎం పంక్షన్‌హాల్‌లో జరిగాయి. డివిజన్ గౌరవ అధ్యక్షుడు జి.లక్ష్మీనర్సింహ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కిషోర్ మాట్లాడుతూ ప్రజల్లో సృజనాత్మకతను పెంచాలని అన్నారు. వ్యవస్థలో మమేకమై ప్రజల్లో నెలకొన్న రుగ్మతులను పారతోలడానికి కృషిచేస్తున్న జనవిజ్ఞాన వేదికను అభినందించారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మానవ ప్రగతి–సైన్స్ పాత్ర అనే అంశంపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటి రమేష్ మాట్లాడుతూ ప్రయోగశాలల్లో జరిగే ఫలితాలు, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరే విధంగా పాలకులు విద్యావంతులు కృషిచేయాలని అన్నారు. ఆధునిక శాస్త్రసాంకేతిక విజ్ఞాన ఫలాలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా తమ వేదిక పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రొఫెసర్ కోయ వెంకటేశ్వర్‌రావు, ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందె సత్యం, ఎంపీపీ ఓర్సులక్ష్మీపురుషోత్తం, జెడ్పీటీసీ చింతల వరలక్ష్మీవిజయభాస్కర్‌రెడ్డి, సింగిల్‌విండోచైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ జంగ శ్రీను తదితరులు పాల్గొన్నారు.