సాక్షి, అమరావతి: విజయవాడలో నిర్వహిస్తున్న ‘సదరన్ సైన్స్ ఎగ్జిబిషన్’ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ విద్యార్థుల్లో దాగివున్న శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాలను ఎలుగెత్తి చాటుతోంది. ఏపీ పాఠశాల విద్యాశాఖ, విశ్వేశ్వరయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ మ్యూజియం, కర్ణాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్వంలో ఫిబ్రవరి 1వ తేదీ వరకు 6 రోజులపాటు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రూపొందించిన 210 ప్రాజెక్ట్‌లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.
అత్యుత్తమ ప్రదర్శనలను జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 8 నుంచి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలకు ఇక్కడ అవకాశం కల్పించారు. రాష్ట్రం నుంచి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రూపొందించిన 30 నమూనాలు సైతం ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోమవారం సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎగ్జిబిషన్‌కు తరలివచ్చారు. తమ వయసు విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను తిలకించి, ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకే..
సైన్స్ రంగంలో విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతో ఉపయోగపడుతుందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సదరన్ సైన్స్ ఎగ్జిబిషన్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్, భూమి/అంతరిక పరిజ్ఞానం, పర్యావరణం, ఇంజినీరింగ్, అగ్రి, బయో సైన్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే అంశాలకు చోటు కల్పించామన్నారు. న్యాయ నిర్ణేతలు ఉత్తమ ప్రదర్శనలను గుర్తించి జాతీయ పోటీలకు ఎంపిక చేస్తారని వివరించారు.
తక్కువ ఖర్చు.. ఆదాయం హెచ్చు
ఈ చిత్రంలో కనిపిస్తున్న కె.హేమమాధురి, పి.పావని చిత్తూరు జిల్లా పెదపంజానిలోని మహత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ రైతుకు మేలు చేసే సమగ్ర వ్యవసాయ (ఇంటిగ్రేటెడ్ పారి్మంగ్) విధానాన్ని రూపొందించారు. తక్కువ ఖర్చుతో పంటలు పండిస్తూనే.. ఎరువుల ఖర్చు లేకుండా అదనపు ఆదాయంతో పాటు ఎక్కువ లాభాలు వచ్చే ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను అనర్గళంగా వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని, ఇంగ్లిష్ ప్రావీణ్యం ప్రదర్శిస్తూ.. సదరన్ సైన్స్ ఫెయిర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
ఆపదలో ఆదుకునే తుపాకీ
సైనికులు, ఫారెస్ట్ సిబ్బంది, అగ్నిమాపకదళ సిబ్బంది విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తుంటారు. ఒక్కోసారి దారి తప్పడమో, మంచులో కూరుకుపోవడమో జరుగుతుంది. అలాంటప్పుడు వారున్న చోటును తెలిసేలా అద్భుతమైన తుపాకిని రూపొందించాడు మంగుళూరుకు చెందిన విద్యార్థి పి.తేజస్. ఓ వైపు శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపించడంతోపాటు సైనికుడి ఉనికిని తన బృందానికి చేరవేసేలా సెన్సార్‌ను బిగించాడు. ఇది బయటి వారికి సిగ్నల్స్‌ను పంపించి ఆచూకీ చెబుతుంది. తేజస్ తయారు చేసిన తుపాకి ఒక్కసారి వినియోగానికి రూ.30 మాత్రమే ఖర్చవుతుంది. మంటల్లో కాలిపోతున్న ఎత్తయిన భవనాల్లోకి ఈ తుపాకి ద్వారా ఆక్సిజన్ బాల్స్‌ను ఫైర్ చేసి మంటలను సైతం ఆర్పేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment