3 నుంచి జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్
3 నుంచి జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్
Published Tue, Nov 1 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM
భానుగుడి (కాకినాడ) : జిల్లాస్థాయి ఇన్‌స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ ఈ నెల మూడు నుంచి ప్రారంభిస్తున్నట్లు డీఈఓ ఆర్.నరసింహారావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఇన్‌స్పైర్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా శాలిపేట బాలికోన్నత పాఠశాలలో మంగళవారం సమావేశం నిర్వహించారు. డీవైఈఓ డి.వాడపల్లి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీఈఓ మాట్లాడుతూ కాకినాడ ఏఎంజీ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహణకు ఏర్పా ట్లు చేశామని, జిల్లా స్థాయిలో కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. రాజమండ్రిలో రేపటి నుంచి కాకినాడలో 3 నుంచి నిర్వహించబోయే కార్యక్రమంలో 25 మండలాల నుంచి 560 ప్రాజెక్టులు రానున్నాయని, రాజమండ్రిలో 500 ప్రాజెక్టులలో మొత్తం 1,060 ప్రాజెక్టులు ప్రదర్శితమవుతాయన్నారు. ప్రతి ప్రాజెక్టును మండల స్థాయిలో ప్రత్యేక స్క్రూట్నీ నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ ఎగ్జిబిషన్ న్యూఢిల్లీ, ఎస్‌సీఆర్టీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో ప్రాజెక్టు తయారీకి రూ.5 వేలు విద్యార్థులకు ఇస్తారన్నారు. విజేతలుగా ఎంపికైన వారు రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపికవుతారని, రాష్ట్రస్థాయి విజేతలు జాతీయ స్థాయిలో తమ ప్రాజెక్టులను ప్రదర్శిస్తారన్నారు. జాతీయ స్థాయిలో బెస్ట్ ప్రాజెక్టుగా నిలిస్తే వారికి ఐదేళ్లపాటు ఉన్నతవిద్యతో పాటు, ప్రత్యేక ఉపకార వేతనాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. చెవ్వూరి రవి, పుల్లయ్య, టి.రంగరావు, కేసరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
నేడు బీవీఎం స్కూల్‌లో ప్రారంభం
కంబాలచెరువు : రాజమహేంద్రవరంలోని బీవీఎం స్కూల్లో ఇన్‌స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని ఉపవిద్యాశాఖాధికారి ఎస్.అబ్రహాం తెలిపారు. స్థానిక బీవీఎం స్కూల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 26 మండలాల నుంచి సుమారు 524 పైగా ప్రదర్శనలు వస్తాయని, వీటిని మూడు రోజలు పాటు వీక్షించేలా రోజువారీ టైంటేబుల్ ఆయా స్కూళ్లకు ఇస్తామన్నారు. డీఐ అయ్యంకి తులసీదాస్, పరస జగన్నాథరావు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
Advertisement
Advertisement