ప్రశ్నించేతత్వమే పరిశోధనలకు పునాది
ప్రశ్నించేతత్వమే పరిశోధనలకు పునాది
Published Wed, Jan 4 2017 10:20 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో 16 ప్రాజెక్టుల ప్రదర్శన
విద్యార్థులకు పలువురి అభినందన
రాయవరం : విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, నమ్మకం, ప్రశ్నించే తత్వం, ప్రయోగాత్మక వైఖరిని పెంపొందించాలి. అప్పుడే నూతన ఆవిష్కరణకు ఆస్కారం కలుగుతుంది. కొత్త విషయాలను, పరిశోధనలను ఆవిష్కరించిన శాస్త్రవేత్తల్లో అత్యధికులు సామాన్యులే. కేవలం ప్రశ్నించే తత్వం... నిశితంగా పరిశీలించే లక్షణమే వారిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దింది. యాపిల్ పండు కింద పడడాన్ని పరిశీలించి..పరిశోధించడం ద్వారా ఐజాక్ న్యూటన్ భూమికి గురత్వాకర్షణ శక్తి ఉందని ప్రపంచానికి తెలియజేశాడు. ఇలా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి ప్రపంచానికి అత్యంత విలువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించారు. జిల్లాలో కూడా శాస్త్రవేత్తలను భావితరాలకు అందించేందుకు..విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించేందుకు జాతీయ సైన్స్ కాంగ్రెస్‌ను 1914లో ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా జిల్లాలో కూడా సైన్స్ పట్ల విద్యార్థుల్లో పరిశీలన, పరిశోధనా భావజాలాన్ని నింపేందుకు జిల్లా సైన్స్ కాంగ్రెస్ ఉపయోగపడుతోంది.
సమాజంలో మార్పు కోసం..
పాఠశాలలు కేవలం మార్కుల కోసమే కాదు...సమాజ మార్పు కోసం కృషి చేయాలని సైన్స్ కాంగ్రెస్ సూచిస్తోంది. 2008లో విశాఖపట్నంలో నిర్వహించిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఎంఎస్‌ఎన్ చార్టీస్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కేసరి శ్రీనివాసరావు మడ అడవుల్లో పీతల పెంపకంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఆయన ప్రస్తుతం జిల్లా చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. 2013లో కాశ్మీర్‌లో నిర్వహించిన జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో రాజమండ్రికి చెందిన షిర్డీసాయి విద్యార్థులు పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. గత ఏడాది మైసూర్‌లో నిర్వహించిన జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో శ్రీప్రకాష్ విద్యానికేతన్ (రాజమండ్రి), శ్రీగౌతమి స్కూల్ (రాజమండ్రి) విద్యార్థులు పరిశోధనాత్మక ప్రాజెక్టులు సమర్పించారు.
ప్రస్తుత సైన్స్ కాంగ్రెస్‌కు...
తిరుపతిలో ప్రస్తుతం నిర్వహిస్తున్న సైన్స్ కాంగ్రెస్‌కు జిల్లా నుంచి 16 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వివిధ పాఠశాలల నుంచి 16 మంది విద్యార్థులు తాము తయారు చేసిన వివిధ పరిశోధనలను అక్కడ ప్రదర్శిస్తున్నారు. టెర్రరిస్టు దాడుల నుంచి ఎలా రక్షించుకోవాలనే అంశాన్ని కాకినాడ ఏపీఎస్‌పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, సహజ పద్ధతుల్లో దోమలను ఎలా నివారించాలనే అంశాన్ని మలికిపురం మండలం పడమటిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, గుర్రపుడెక్క నుంచి ఇంధనం తయారు చేసే విధానాన్ని కపిలేశ్వరపురం మండలం అంగరకు చెందిన ఆదిత్య యూపీ స్కూల్ విద్యార్థులు ప్రాజెక్టులు తయారు చేశారు. ఇలా పలు పాఠశాలల నుంచి వివిధ ప్రాజెక్టులు జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పరిశీలించిన పలువురు ప్రముఖులు విద్యార్థులను అభినందిస్తున్నారు.
ప్రయోజనకరంగా ఉంటుంది..
జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో జిల్లా విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ప్రదర్శిస్తుండడం హర్షణీయం. ఇది విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథం పెంపొందించడానికి దోహదపడుతుంది. సైన్స్ పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. - కె.శ్రీకృష్ణసాయి, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జీవిత కాలపు సభ్యుడు, జెడ్పీహెచ్‌ఎస్, మాచవరం, రాయవరం మండలం
ఏటా జిల్లా నుంచి ప్రాతినిథ్యం
జాతీయ సైన్స్ కాంగ్రెస్‌కు ఎంపికైన 16 ప్రాజెక్టుల్లో 15 ప్రాజెక్టులు ఇన్‌స్పైర్ జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికై, ఢిల్లీలో ప్రదర్శించిన ప్రాజెక్టులను తీసుకుని రావడం జరిగింది. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఎంపికైన ఒక ప్రాజెక్టును కూడా తిరుపతిలో ప్రదర్శిస్తున్నారు. ఏటా జిల్లా నుంచి జాతీయ సైన్స్ కాంగ్రెస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాం.
- కేసరి శ్రీనివాసరావు, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా కో-ఆర్డినేటర్, కాకినాడ
Advertisement