సో... సొరచేపలకు థ్యాంక్స్!
సైన్స్
సొరచేపలు సముద్రంలో ఏంచేస్తాయి? అనే ప్రశ్నకు-
‘‘ఏం చేస్తాయండీ...తమ పనేదో తాము చేసుకుంటాయి’’ అనే సరదా సమాధానమైతే రావచ్చుగానీ, వాటి గురించి మాట్లాడుకోవడానికి సీరియస్ విషయాలే ఉన్నాయి. తమ పనేదో తాము చేసుకోవడమే కాదు మానవాళికి అవసరమైన మంచి పని కూడా చేసి పెడుతున్నాయి.
వివిధ స్థాయులలో నీటి ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి గత దశాబ్దకాలంగా యూనివర్శిటీ ఆఫ్ మియామి(అమెరికా) పరిశోధకులు సొరచేపలను ఉపయోగించుకుంటున్నారు. వాటికి ఏర్పాటు చేసిన శాటిలైట్-లింక్‌డ్ ట్యాగ్‌ల ద్వారా సమాచార సేకరణ సాధ్యమవుతోంది.
తాజా విశేషం ఏమిటంటే, కేవలం నీటి ఉష్ణోగ్రతలు మాత్రమే కాదు... గాలివానలు, తుపానుల గురించి తెలుసుకునే వీలుందని చెబుతున్నారు పరిశోధకులు. సొరచేపలు అందించే సమాచారంలో ఎన్నో హెచ్చరికలు నిక్షిప్తమై ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
ఒకవేళ ప్రమాదవశాత్తు సొరచేపలకు అమర్చిన ట్యాగ్‌లు వాటి నుంచి విడిపోయినా... అప్పటివరకు అది సేకరించిన సమాచారం మాత్రం మాయం కాదు. దానికి సంబంధించిన డాటా రికార్డ్ అవుతూనే ఉంటుంది.
‘‘కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడంలో వాటికి మించి సాధనాలు లేవు. ఆధునిక పరికరాలు చేయలేని పనిని కూడా అవి చేసి పెడుతున్నాయి. ఖచ్చితమైన సమాచారమే కాదు కీలక సమాచారాన్ని ఇస్తున్నాయి’’ అంటున్నాడు సముద్రజీవజాల శాస్త్రవేత్త జెరాల్డ్ ఆల్ట్.
సొరచేపల నుంచి సేకరించిన సమాచారం తుపానుల బలాబలాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.
‘‘ఇది ప్రారంభం మాత్రమే... సొరచేపలు మనకు అందించే సమాచారంతో విపత్తుల గురించి తెలుసుకోవడమే కాదు.. ఎన్నో కొత్త విషయాలు కూడా తెలుసుకోవచ్చు’’ అంటున్నారు పరిశోధకులు.