‘పట్టు’ సాధించేందుకు ప్రయోగం | 'Hold' the experiment in order to | Sakshi
Sakshi News home page

‘పట్టు’ సాధించేందుకు ప్రయోగం

Published Thu, May 8 2014 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

'Hold' the experiment in order to

  • సైన్స్‌పై విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు  
  •  శ్రీకారం చుట్టిన జిల్లా విద్యాశాఖ
  •  బాల శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు దోహదం  
  •  90 మందికి ఉచిత భోజనం, వసతి, శిక్షణ
  • విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి పెంపొందించడానికి జిల్లా విద్యాధికారి పూనుకున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను బాల శాస్త్రవేత్తలుగా తయారు చేసేందుకు.. కనీసం వారికి సైన్స్‌లో ఓనమాలు నేర్పించేందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో హన్మకొండలోని న్యూత్రివి హైస్కూల్‌లో బాల శాస్త్రవేత్తల ఆవాస వేసవి శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు.

    ఈనెల 2 నుంచి ప్రారంభమైన శిబిరంలో పదో తరగతిలోని ఫిజికల్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులపై ప్రభుత్వ, జెడ్పీ హైస్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న సుమారు 15 మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. మూడు నెలల క్రితం జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన చెకుముఖి టాలెంట్ టెస్టులో ప్రతిభ చూపిన వారినే బాల శాస్త్రవేత్తల ఆవాస శిక్షణా శిబిరానికి ఎంపిక చేశారు.

    వివిధ మండలాల నుంచి సుమారు 90 మంది విద్యార్థులకు ఉచిత వసతితోపాటు భోజన సౌకర్యం కల్పిస్తూ శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు యోగాలో సునీత శిక్షణ ఇస్తున్నారు. అనంతరం విద్యాబోధన, రిసోర్స్ పర్సన్లు సైన్స్‌లోని పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ ప్రయోగాత్మకంగా అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారు. సాయంత్రం ప్రముఖులతో విద్యార్థులకు ఉపయోగపడేలా, వారికి కెరీర్ గెడైన్స్ పెంపొందించేలా అవగాహన కల్పిస్తున్నారు. గెస్ట్ లెక్చర్లు రమాదేవి, సుహాసిని, శంకర్‌నారాయణ పలు అంశాలపై వివరించారు.

    రాత్రివేళ కొంతసేపు మానసికోల్లాసానికి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సైన్స్ పరికరాల కొనుగోలు, స్నాక్స్ కోసం ఓరుగల్లు సేవా సమితి నుంచి కలెక్టర్ రూ.36వేలు ఇచ్చారు. భోజన వసతి కోసం ప్రైవేటు కళాశాలల యాజమన్యాలు సహకరిస్తున్నాయి. స్కూల్ అసిస్టెంట్ శ్యాంసుందర్‌రెడ్డి ప్రోగ్రాం ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. రిసోర్స్ పర్సన్లుగా స్కూల్ అసిస్టెంట్లు విజయపాల్‌రెడ్డి, ఏ.జ్ఞానేశ్వర్, ఎస్.రామనాథం, వి.సురేశ్, రాము, శ్రీనివాస్‌స్వామి, శంకర్, శశికళాధర్, దయాకర్, సదానందం, అనితాలత విద్యాబోధన చేస్తున్నారు.
     
    ఎంతో ఉపయోగపడుతుంది..
    లింగాలఘణపురం మండలం వనపర్తి జెడ్పీఎస్‌ఎస్‌లో 9వ తరగతి పూర్తిచేసి టెన్త్‌లోకి ప్రవేశించాను. ఇక్కడ మాకు ఉచిత వసతితోపాటు సైన్స్‌పై అనేక అంశాలను బేసిక్స్ నుంచి ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో టెన్త్ క్లాస్‌లోని అంశాలను ఇప్పుడే నేర్చుకుంటున్నాం. ఈ శిక్షణతో బట్టీపట్టాల్సిన అవసరం లేకుండా సైన్స్ సబ్జెక్టులోని అనేక అంశాలు ప్రయోగపూర్వకంగా చెబుతున్నారు.
     వాగ్దేవి, జెడ్పీఎస్‌ఎస్ వనపర్తి
     
     ప్రయోగాత్మకంగా చెబుతున్నారు..
     రాయపర్తి మండలం కొండూరు జెడ్పీఎస్‌ఎస్‌లో 9వ తరగతి పూర్తి చేశాను. సైన్స్‌లో ప్రోత్సహించే విధంగా ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్టులపై బేసిక్స్‌తో సహా టీచర్లు చెప్పడమే కాకుండా ప్రయోగాల ద్వారా చూపడంతో స్పష్టంగా అర్థమవుతోంది. శిక్షణా శిబిరంలో చదువుతోపాటు క్రమశిక్షణ నేర్పుతున్నారు. యోగా చేయిస్తున్నారు. ఇది నైపుణ్యాలను పెంపొందించేందుకు కూడా దోహదం చేస్తుంది.
     - జి.శ్రీకాంత్, జెడ్పీఎస్‌ఎస్ కొండూరు
     
     ఆసక్తి కనబరిచేలా విద్యాబోధన
     నరేందర్ నగర్‌లోని ప్రభుత్వ హైస్కూల్‌లో 9వ తరగతి పూర్తి చేశాను. బాల శాస్త్రవేత్తల ఆవాస వేసవి శిక్షణా శిబిరంలో మాకు టెన్త్‌లోని ఫిజికల్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లోని అనేక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. పలు అంశాలను ప్రయోగాత్మకంగా చూపిస్తున్నారు. ఉపాధ్యాయులు చెబుతున్న  సైన్స్ అంశాలు, గెస్ట్ లెక్చర్లు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపజేస్తున్నాయి.
     - ఈ.రాణి, నరేందర్ నగర్, వరంగల్
     
     ఇదొక ప్రయోగం
     ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ ఉంటుంది. వారికి విద్యార్థి దశలోనే సైన్స్ పట్ల ఆసక్తి కలిగిస్తే వారు భవిష్యత్‌లో బాల శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంది. వేసవిలో విద్యార్థులు ఇంటివద్ద ఉంటే వేరే వ్యాపకాల్లో ఉంటారు. అందువల్ల వారికి రెసిడెన్షియల్‌గా ఉదయం టిఫిన్, భోజన వసతితోపాటు మధ్యలో స్నాక్స్ కూడా ఇస్తున్నాం. మానసికోల్లాసానికి యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. వివిధ అంశాల్లో గెస్ట్ లెక్చరర్లతో గ్రూప్ డిస్కషన్ చేయిస్తున్నాం. ఫిజికల్ సైన్స్, బయాలజీలోని పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. శిబిరం నిర్వహణకు కలెక్టర్ కిషన్, ప్రైవేటు యాజమాన్యాలు సహకరిస్తున్నాయి. శిక్షణను ఈనెల 11వ తేదీ వరకు కొనసాగిస్తాం.
     - డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్, డీఈఓ
     
     సంతృప్తిగా ఉంది
     వేసవి సెలవులు వస్తే కుటుంబాలతో ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్తుంటారు కొందరు ఉపాధ్యాయులు. అయితే విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు టెన్త్‌లోని  సైన్స్‌పై నైపుణ్యాలను, మహనీయుల స్ఫూర్తి కలిగించే అంశాలను బోధించడం సంతృప్తిగా ఉంది. సెలవులు పోయినా విద్యార్థులకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నామనే భావన ఉంది.
     - విజయపాల్‌రెడ్డి, స్కూల్ అసిస్టెంట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement