పరిశోధనల సులభతరం ఇలాగా! | A recent notice to IIT Delhi and some other educational institutes in the country | Sakshi
Sakshi News home page

పరిశోధనల సులభతరం ఇలాగా!

Published Wed, Sep 18 2024 4:04 AM | Last Updated on Wed, Sep 18 2024 4:04 AM

A recent notice to IIT Delhi and some other educational institutes in the country

ఐఐటీ ఢిల్లీతో పాటు దేశంలోని మరికొన్ని విద్యా సంస్థలకు ఇటీవల ఓ నోటీసు వచ్చింది. గడచిన ఐదేళ్ల కాలంలో పరిశోధనల కోసం అందుకున్న నిధులపై జీఎస్టీ ఎందుకు చెల్లించలేదని అందులో ప్రశ్నించారు. జీఎస్టీ సకాలంలో చెల్లించనందుకు జరిమానా, వడ్డీ కలిపి రూ.120 కోట్లు కట్టమని కూడా ఆదేశించారు. రెండేళ్ల క్రితమే సాంకేతిక పరిజ్ఞాన పరికరాలపై జీఎస్టీని 5 నుంచి 18 శాతానికి పెంచారు. ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలు ఎదుర్కొంటున్న ఇంకో సమస్య రెడ్‌ టేపిజమ్‌. 

ప్రతిష్ఠాత్మక సైన్సు అవార్డులను కూడా నగదు బహుమతి లేకుండానే అందిస్తున్నారు. ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిశోధనలను తగ్గించేందుకు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే వీటిని చూడాలి. ఐఐటీ ఢిల్లీతో పాటు దేశంలోని మరికొన్ని విద్యా సంస్థలకు వచ్చిన జీఎస్టీ చెల్లింపుల నోటీసుపై శాస్త్రవేత్తలు స్పందించలేదు కానీ, ‘ఇన్ఫోసిస్‌’ మాజీ సీఎఫ్‌వో, ఇన్వెస్టర్‌ టీవీ మోహన్ దాస్‌ పై మాత్రం దీన్ని ‘అతి నీచమైన పన్ను తీవ్రవాదం’ అని వ్యాఖ్యానించారు.

నెల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  పరిశోధనల కోసం ఉపయోగించే రసాయనాలపై కస్టమ్స్‌ డ్యూటీని 10 నుంచి 150 శాతానికి పెంచడం... అకస్మాత్తుగా పెరిగిన ప్రాజెక్టు ఖర్చులతో శాస్త్రవేత్తలు, విద్యా సంస్థలు బెంబేలెత్తడం తెలిసిన విష యమే. పరిశోధనలకు అవసరమైన ఎంజైములు, రీజెంట్లు చాలా వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవే. కస్టమ్స్‌ డ్యూటీ పెంచ డమంటే వాటిని దాదాపుగా అడ్డుకోవడమే. శాస్త్రవేత్తల నిరసనల నేప థ్యంలో ప్రభుత్వం దిగి వచ్చింది. సృజనాత్మక ఆలోచనలు వృద్ధిచెందాలంటే, ‘రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’(ఆర్‌ అండ్‌ డీ)కి మరిన్ని నిధులు ఇవ్వాల్సి ఉండగా... కేంద్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం గమనార్హం.

జీఎస్టీ నోటీసులు, కస్టమ్స్‌ డ్యూటీ పెంపులు ఏవో చెదురు ముదురు సంఘటనలు కావచ్చునని అనుకునేందుకూ అవకాశం లేదు. ఉన్నత విద్యా రంగంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిశోధనలను తగ్గించేందుకు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే వీటిని చూడాల్సి ఉంది. రెండేళ్ల క్రితమే సాంకేతిక పరిజ్ఞాన పరికరాలపై జీఎస్టీని 5 నుంచి 18 శాతానికి పెంచడం, తాజాగా నిధు లపై జీఎస్టీ నోటీసులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ రెండు నిర్ణయాల వల్ల పరికరాలను సమకూర్చుకోవడం, పరిశోధనల నిర్వహణ ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. 

ఈ విషయంపై ఆందో ళనతోనే కేంద్ర ప్రభుత్వానికి శాస్త్ర అంశాల్లో సలహా ఇచ్చే విభాగంకేంద్రానికి ఒక నోట్‌ను పంపింది. జీఎస్టీ వసూళ్లు, పన్నుల పెంపుల ప్రభావం నుంచి ప్రైవేట్‌ సంస్థలు సర్దుకోవచ్చుననీ, ప్రభుత్వ సంస్థల్లో ఇందుకు అవకాశాలు తక్కువనీ ఈ నోట్‌లో స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నోట్‌పై స్పందిస్తూ, సంస్థలకు కేటాయించే నిధు లను ఎక్కువ చేస్తున్నాము కాబట్టి జీఎస్టీతో నష్టమేమీ ఉండదని నమ్మబలికే ప్రయత్నం చేసింది. కానీ పరిస్థితిని సరిచేసేందుకుచేసింది మాత్రం శూన్యం. 

పరిశోధనలకు ఊతం ఇలా కాదు...
ఏ దేశంలోనైనా స్వేచ్ఛగా పరిశోధనలు చేసుకునే వాతావరణం ఉన్నప్పుడు కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. తగినన్ని నిధులు సమకూర్చడం, భాగస్వామ్యాలను ప్రోత్సహించడం.... పన్నులు, నిబంధనల విషయంలో ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఈ అన్ని అంశాలు భారత్‌లో ఇప్పుడు కొరవడ్డాయనే చెప్పాలి. నిధుల విషయాన్ని చూద్దాం. జాతీయ స్థూల ఉత్పత్తిలో ఒక శాతం కంటే తక్కువ. 

అన్ని రకాల ప్రాజెక్టులకు ఒకే ఛత్రం కింద నిధులిస్తామని ‘అనుసంధాన్  నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్ ’ (ఏఎన్ ఆర్‌ఎఫ్‌) ఒకటి ఏర్పాటు చేసేందుకు ఐదేళ్లుగా ప్రయత్నాలు సా...గుతూనే ఉన్నాయి. మరోవైపు పరిశోధనలకు తాము నిధులు ఎక్కువ చేశామని ప్రభుత్వం బాకా ఊదుతూనే ఉంది. ఐదేళ్ల కాలంలో కొత్త సంస్థ ద్వారా 50 వేల కోట్ల రూపాయలు ఇస్తామని పదే పదే సంకల్పం చెప్పుకుంటోంది. ఈ మొత్తం కూడా వట్టి మాటే. 

తామిచ్చేది 30 శాతమనీ, మిగిలిన 70 శాతాన్ని ఆయా సంస్థలు ప్రైవేట్‌ రంగంలో సేకరించుకోవాలనీ ప్రభుత్వమే తేల్చి చెప్పింది. అంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తం ఏడాదికి రూ.30,000 కోట్లు మాత్రమే అవుతుంది. ఇది ప్రస్తుత కేటాయింపుల కంటే చాలా తక్కువ. 2024–25లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖకు రూ.16,628 కోట్లు కేటాయించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. 

ఏఎన్ ఆర్‌ఎఫ్‌ ఏర్పాటు ఆలోచన వెనుక ‘ఆర్‌ అండ్‌ డీ’ బరువును తగ్గించుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని స్పష్టం అవుతోంది. అదెలా చేయాలో మాత్ర స్పష్టత కనిపించడం లేదు. దేశంలో ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలు ఎదుర్కొంటున్న ఇంకో సమస్య రెడ్‌ టేపిజమ్‌. నిధులు పొందేందుకు, పంపిణీ, స్కాలర్‌షిప్, ఫెలోషిప్‌ల నిర్ధారణ వంటి అనేక అంశాల్లో అధికారుల జోక్యం ఉంటోంది. 

మేకిన్  ఇండియా వంటి వాటికి అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన ఇంకో సమస్య. వీటన్నింటి మధ్య తాము పరిశోధనలపై దృష్టి ఎలాకేంద్రీకరించగలమని ఐఐటీ కాన్పూర్‌ శాస్త్రవేత్త ఒకరు ‘ఎక్స్‌’ వేదికగా వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పరిశోధనలకు అడ్డంపడే ఇలాంటి విషయాలు ఇంకా అనేకమున్నాయి. అంతర్జా తీయ ప్రయాణాలకు అందించే నిధులపై నియంత్రణ వాటిల్లో ఒకటి. కీలకమైన శాస్త్ర అంశాల్లో పలు దేశాలు కలిసి పని చేయడం ఎక్కువ అవుతున్న ఈ కాలంలో కాన్ఫరెన్సులకు వెళ్లేందుకు ఇలాంటి వంకలు పెట్టడం గమనార్హం.

సైన్ ్స వ్యవహారాల్లో సౌలభ్యమెంత?
గత ఏడాది ఫౌండేషన్  ఫర్‌ అడ్వాన్సింగ్‌ సైన్ ్స అండ్‌ టెక్నాలజీ (ఫాస్ట్‌) ఒక సర్వే చేసింది. టాప్‌–10 పరిశోధన సంస్థల్లో పని చేస్తున్న శాస్త్రవేత్తలను ప్రశ్నించి దేశంలో పరిశోధనలు చేసేందుకు అనువైన వాతావరణం ఎలా ఉందో అంచనా కట్టింది. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ మాదిరిగా ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ సైన్ ్స’ అన్నమాట. 2015లో ప్రధాని నరేంద్ర మోదీనే ఈ పదాన్ని పరిచయం చేశారు. ‘ఫాస్ట్‌’ చేసిన సర్వేలో స్థూలంగా, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ సైన్స్‌ బాగుందని ఆరు శాతం మంది కితాబిచ్చారు. 

నిధులు పొందే విషయంలో మాత్రం యావరేజ్‌ కంటే తక్కువని తేల్చారు. నిధులిచ్చే సంస్థలు గ్రాంట్లు ఇచ్చేందుకు తీసుకునే సమయం, నిధుల మొత్తం, ప్రాజెక్టు ఉద్దేశం వంటి అంశాల ఆధారంగా పనిచేస్తున్నాయని వీరు చెప్పారు. ఇకఅందించిన నిధులను స్వేచ్ఛగా వాడుకునే అవకాశం ఉందా?  విదే శాల్లో జరిగే సదస్సులకు వెళ్లగలుగుతున్నారా? పరిశోధనలకు అవస రమైన వనరులు, పరికరాలు అందుబాటులో ఉన్నాయా? అన్న ప్రశ్న లకు శాస్త్రవేత్తల సమాధానం ‘అధ్వాన్నం’ అని!

ప్రతిభను ఎప్పటికప్పుడు గుర్తించి ప్రోత్సహించడం, ‘ఆర్‌ అండ్‌ డీ’ వాతావరణం బాగుందని అనేందుకు ఇంకో గుర్తు. కానీ శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ పేరిట ఇస్తున్న ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా ‘విజ్ఞాన్  పురస్కార్‌’ పేరిట నగదు బహుమతి లేకుండానే అందిస్తు న్నారు. 2022లో సైన్ ్స అవార్డులను నిలిపివేసిన ప్రభుత్వం నోబెల్‌ స్థాయిలో ‘విజ్ఞాన రత్న’ అవార్డు ఒకదాన్ని అందిస్తామని చెప్పింది. 

గత నెలలో ఈ అవార్డును ప్రకటించారు కూడా. ఇందులోనూ నగదు ప్రస్తావన లేదు. ఆసక్తికరంగా ఉత్తర ప్రదేశ్, హరియాణా ప్రభుత్వాలు అందించే రాష్ట్ర స్థాయి అవార్డులైన ‘విజ్ఞాన్‌ గౌరవ్‌’, ‘విజ్ఞాన్  రత్న’ (జాతీయ అవార్డుకు ముందే అమల్లో ఉన్న రాష్ట్ర స్థాయి అవార్డు)లకు రూ. 5 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు!

ఒకవైపు భారత్‌లో సైన్సును సులభతరం చేయడం తగ్గిపోతూండగా, చైనా మున్ముందుకు దూసుకెళుతోంది. భారత్‌ తన జీడీపీలో 0.66 శాతం పరిశోధనలకు వెచ్చిస్తూండగా, చైనా 2.4 శాతం ఖర్చు పెడుతోంది. చైనాలోని పెకింగ్, ట్సింగ్‌హువా యూనివర్సిటీల పరి శోధన బడ్జెట్‌ మనం విద్యకు పెడుతున్న దాని కంటే ఎక్కువ ఉండటం చెప్పుకోవాల్సిన అంశం. 

ఈ విషయాన్ని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ వి. రాంగోపాల్‌ రావు ఇటీవలే ఒక సమావేశంలో తెలిపారు. పరిశోధనల నిధుల విషయంలో యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలను పస్తు పెట్టడం అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మార్చాలన్న ఆకాంక్షను నెరవేర్చేది ఎంతమాత్రం కాదన్నది గుర్తించాలి.

- రచయిత సైన్ ్స అంశాల వ్యాఖ్యాత
- (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) దినేశ్‌ సి. శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement