తవ్వేస్తున్నారు..!
- తీరంలో జోరుగా చేపల చెరువుల తవ్వకాలు
- అధికారులను మచ్చిక చేసుకుని అక్రమ వ్యాపారం
- అసైన్డ్, దేవాలయ, మడ అడవుల భూముల్లోనూ తవ్వకాలు
కాసుల వర్షం కురిపించే చేపల సాగు కోసం అక్రమారులు అడ్డగోలుగా చెరువులు తవ్వేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు ‘పచ్చ’నోట్లు పుచ్చుకుని నోరు మెదపడంలేదు. కార్యాలయాల నుంచి కాలు కదపడంలేదు. ఫలితంగా తీరం వెంబడి భారీగా చేపల చెరువులు వెలుస్తున్నాయి. మడ అడవులు, దేవాలయాల భూములు కూడా చెరువులుగా మారుతున్నాయి.
మచిలీపట్నం : తీరంలో చేపల చెరువులను తవ్వే మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఎకరం, రెండు ఎకరాలకు అనుమతులు తీసుకుని వందలాది ఎకరాలను చెరువులుగా మార్చేస్తున్నారు. అధికారులను మంచి చేసుకుని అసైన్డ్, దేవాదాయ శాఖ భూములను చేపల చెరువులుగా తవ్వేస్తున్నారు.
ఈ వ్యవహారం తమ కళ్ల ఎదుటే జరుగుతున్నా రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. చెరువులు తవ్వే సమయంలో డ్రెయినేజీ శాఖకు సంబంధించిన భూములు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇటీవలే అధికారం చేజిక్కించుకున్న కొందరు నాయకులు చేపల చెరువుల తవ్వకాల్లో తలమునకలవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్) నిబంధనలను సైతం అతిక్రమించి మడ అడవులను చేపల చెరువులుగా మారుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
గ్రామస్థాయి వీఆర్వో నుంచి డివిజన్ స్థాయి వరకు ఎవరికి వెళ్లాల్సిన మామూళ్లు వారికి చేరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బందరు మండలంలో చిన్నాపురం, కోన, కానూరు, పెదపట్నం తదితర ప్రాంతాల్లో చేపల చెరువుల తవ్వకాలు వేగవంతంగా జరుగుతున్నాయి. తమకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని అక్రమార్కులు బాహాటంగానే చెబుతున్నారు. వనామీ రొయ్య అధిక ధర పలుకుతుండటం, సాగు బాగుండటంతో సముద్రపు కరకట్ట పక్కనే ఉన్న మడ అడవులను రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. కెపీటీపాలెం, కమ్మవారిచెరువులో రొయ్యల చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయి. కోన, చిన్నాపురం తదితర ప్రాంతాల్లో చేపల చెరువుల తవ్వకాలు జోరందుకున్నాయి.
పెడన మండలంలో బల్లిపర్రు, దేవరపల్లి, నందమూరు తదితర ప్రాంతాల్లో అక్రమంగా చెరువుల తవ్వకం వేగవంతంగా సాగుతోంది. లజ్జబండ డ్రెయిన్‌ను సైతం ఆక్రమించేస్తున్నారు. పెడన మండల శివారు ముదినేపల్లి మండలం శింగరాయపాలెంలో 90 ఎకరాలకు పైగా చేపల చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయి.
కృత్తివెన్ను మండలంలో పీతలావ, కృత్తివెన్ను, వాలంక, పల్లెపాలెం తదితర ప్రాంతాల్లో ఇటీవల చేపలు, రొయ్యల చెరువుల తవ్వకం ఊపందుకుంది. వందలాది ఎకరాల అసైన్డ్ భూమిని చెరువులుగా మార్చేస్తున్నారు.
బంటుమిల్లి మండలం పెందుర్రు, చోరంపూడి, నాగన్నచెరువు తదితర ప్రాంతాల్లో చెరువుల తవ్వకాలు వేగవంతంగా జరుగుతున్నాయి. వర్షం కురిస్తే పనులు నిలిచిపోతాయని భారీ యంత్రాలను తీసుకువచ్చి శరవేగంగా చురువులు తవ్వేస్తున్నారు.
నందివాడలో కోదండరామస్వామి దేవస్థానానికి చెందిన వ్యవసాయ భూమిని ఎటువంటి అనుమతులు లేకుండా చేపల చెరువుగా మారుస్తున్నారు. సర్వే నంబర్ 9, 10లో సుమారు 10.14ఎకరాల సాగు భూమిలో రెండు పొక్లేయిన్లతో గత రెండు రోజులుగా చెరువు తవ్వకం పనులు కొనసాగిస్తున్నారు. వరిసాగు చేస్తామని వేలంపాట ద్వారా భూములు దక్కించుకున్న రైతు చేపల చెరువులుగా ఈ భూమిని మార్చటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కోడూరు మండలం ఉల్లిపాలెం, పాలకాయతిప్ప వి.కొత్తపాలెం, రామకృష్ణాపురం, మందపాకల తదితర ప్రాంతాల్లో ఇటీవల చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలు ప్రారంభమయ్యాయి. అధికారుల కనుసన్నల్లోనే ఈ తతంగమంతా నడుస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు అక్కడకు రావటం.. వెళ్లిపోవటం మినహా పనులు నిలిపివేసింది లేదని ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు.
అవనిగడ్డ మండలం పులిగడ్డలో సొసైటీ పేరుతో అక్రమంగా రొయ్యల చెరువుల తవ్వకాలు ఇటీవలే పూర్తిచేశారు. అధికారులకు విషయం తెలిసినా పట్టించుకోకపోవటం గమనించదగ్గ అంశం. అశ్వారావుపాలెంలో ఇటీవల చెరువుల తవ్వకాలు చేసిన అనంతరం రెవెన్యూ అధికారులు హడావుడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి.