Moderate
-
అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నా.. భారత్ భేష్
న్యూఢిల్లీ: రాజకీయ, ఆర్థిక అస్థిరతల మధ్య వచ్చే సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని చాలా మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే 90 శాతం కంటే ఎక్కువ మంది దక్షిణాసియా, ముఖ్యంగా భారతదేశంలో మధ్య తరహా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని విశ్వసిస్తున్నారు. ఈ మేరకు తమ అధ్యయనంలో అభిప్రాయాలు వ్యక్తం అయినట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తాజా ‘చీఫ్ ఎకనమిస్ట్ ఔట్లుక్’ నివేదిక పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో తీవ్ర ప్రతికూలతల నేపథ్యంలో చైనా అవుట్‌లుక్ మసకబారింది. ► ప్రపంచం రాజకీయ, ఆర్థిక అస్థిరతతో పోరాడుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి నిర్దేశిస్తున్న సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) చేరుకోవడంలో పురోగతి బలహీనంగా ఉంటుందని దాదాపు 10 మందిలో ఆరుగురు విశ్వస్తున్నారు. ► ప్రత్యేకించి ఆహార భద్రత, వాతావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణతో సహా ఎస్డీజీకి సంబంధించి పలు లక్ష్యాల్లో మందగమనం ఉంటుంది. 2030లో అర బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తీవ్ర పేదరికంలో జీవిస్తారు. ► ఇటీవల అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినప్పటికీ కఠిన ఫైనాన్షియల్ పరిస్థితులు కొనసాగుతాయని మెజారిటీ (86 శాతం) అంచనా. ఆయా అంశాల నేపథ్యంలో వ్యాపార రుణాలపై ఒత్తిడి, కార్పొరేట్ రుణ ఎగవేతలలో పెరుగుదల, ఆస్తి–ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర దిద్దుబాట్లు తప్పదు. ► 74 శాతం మంది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరికొన్ని సంవత్సరాలు తప్పదని భావిస్తున్నారు. ► అమెరికాలో మే నుండి అవుట్‌లుక్ బలపడింది. ప్రతి 10 మందిలో ఎనిమిది మంది 2023, 2024 అమెరికా ఒక మోస్తరు లేదా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నారు. ► యూరోప్ విషయంలో ఎకానమీ బలహీనం లేదా మరీ బలహీన పరిస్థితులు ఈ ఏడాది ఉంటాయని 77 శాతం మంది భావిస్తున్నారు. 2024లో పరిస్థితులు కొంత మెరుగుపడవచ్చని అంచనా. -
రాష్ట్రంలో మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం వాయవ్య మధ్యప్రదేశ్ నుంచి, ఈశాన్య రాజస్తాన్‌పై వరకు, దక్షిణ చత్తీస్‌గఢ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 4.5కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈనెల 12వ తేదీన వాయవ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ, మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉండడంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి వానలు వరుసగా నమోదవుతాయని తెలిపింది. అదేవిధంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆదివారం రాష్ట్రంలో సగటున 6.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 22శాతం అధికవర్షపాతం నమోదు ప్రస్తుత సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 63.15 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... ఆదివారం సాయంత్రానికి 76.82 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 22శాతం అధికవర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 22 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా... 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆదివారం రాష్ట్రంలో అత్యధికంగా సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు బలంగా వీస్తున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. -
మెరుగుపడుతున్న రాష్ట్రాల ఆదాయాలు!
ముంబై: రాష్ట్రాల ఆదాయాలు క్రమంగా మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్ రా)తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల ద్రవ్యలోటు (ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) 4.1 శాతానికి (రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తిలో) పరిమితి కావచ్చని అంచనా వేసింది. చదవండి: భారీగా పుట్టుకొస్తున్న సాస్ స్టార్టప్‌లు, ఐపీఓకి జోష్ ఇంతక్రితం వరకూ ఈ అంచనాను సంస్థ 4.3 శాతంగా పేర్కొంది. ఇక రాష్ట్రాల జీడీపీలో రుణ నిష్పత్తి కూడా 34 శాతం నుంచి 32.4 శాతానికి తగ్గుతుందన్న అంచనాలను వెలువరించింది. వ్యాక్సినేషన్ విస్తృత స్థాయిలో కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో ఆర్థిక రికవరీ కూడా ఊపందుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని వివరించింది. ఆయా అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల మెరుగుపడ్డానికి దోహపడతాయని పేర్కొంది. కరోనా ప్రేరిత మూడవ వేవ్ భయాలు తొలిగిపోతే వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలపై ఆంక్షలను ప్రభుత్వాలు మరింత సడలించే అవకాశం ఉందని ఏజెన్సీ అంచనావేస్తోంది. ఆయా పరిస్థితుల్లో రెవెన్యూ లోటు క్రితం అంచనాలను కూడా 1.5 శాతం నుంచి (రాష్ట్రాల జీడీపీల్లో) 1.3 శాతానికి మెరుగుపరుస్తున్నట్లు తెలిపింది. నివేదికకు సంబంధించి కీలక అంశాలను పరిశీలిస్తే.. ►2021–22 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 14 రాష్ట్రాల నుంచి అందిన సమాచారం విశ్లేషణ ప్రకారం ఈ కాలంలో ఆయా రాష్ట్రాల ఆదాయం 30.8 శాతం పెరిగి రూ.3.95 లక్షల కోట్లకు చేరింది. ►2020 ఇదే కాలంలో పోల్చి చూసినా సమీక్షా కాలంలో వృద్ధిరేటు 1.5 శాతంగా ఉంది. ► పన్ను, పన్నుయేతల ఆదాయాలు వరుసగా 77 శాతం, 46 శాతం చొప్పున ఎగశాయి. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాల ఆదాయాలపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపలేదని భావించవచ్చు. ►రాష్ట్రాల స్థూల మార్కెట్ రుణాలు 2020–21లో రూ.7.88 లక్షల కోట్లు. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య స్థూల మార్కెట్ రుణాలు రూ.1.94 లక్షల కోట్లు. ► 2020 ఏప్రిల్–జూలై మధ్య స్థూల మార్కెట్ రుణాలు రూ.2.1 లక్షల కోట్లు. ►అయితే 2020–21తో పోల్చితే స్థూల మార్కెట్ రుణాలు రూ.8.2 లక్షల కోట్లకు పెరుగే అవకాశం ఉంది. ఇది క్రితం క్రితం రూ.8.4 లక్షల కోట్ల అంచనాకన్నా తక్కువ. ఇక నికర మార్కెట్ రుణాలు 2020–21లో రూ.6.45 లక్షల కోట్లుకాగా, ఇది 2021–22 నాటికి 6.2 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉంది. -
అతిగా వ్యాయాయం చేస్తే..
లండన్ : మెరుగైన మానసిక, శారీరక ఆరోగ్యానికి తగినంత వ్యాయామం అవసరమని, అయితే అతి వ్యాయామంతో మేలు కన్నా చేటు అధికమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారానికి ఐదు సార్లు, రోజుకు మూడు గంటలు మించి వ్యాయామం చేసేవారి మానసిక ఆరోగ్యం వ్యాయామం అసలు చేయని వారితో పోలిస్తే మెరుగ్గా లేదని 12 లక్షల మందిపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది. యేల్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అథ్యయనంలో రోజుకు 45 నిమిషాలు, వారంలో ఐదు రోజులు వ్యాయామం చేస్తే మెరుగైన ఫలితాలు చేకూరుతాయని, ఇంతకన్నా ఎక్కువగా వ్యాయామం చేయడం ద్వారా ఈ ప్రయోజనాలు దరిచేరవని స్పష్టమైంది. అతి వ్యాయామం అసాధారణ ప్రవర్తనకు దారితీస్తుందని పరిశోధకులు గుర్తించారు. అయితే తగిన మోతాదులో వ్యాయామం మెరుగైన ఫలితాలు అందిస్తుందని వారు వెల్లడించారు. నలుగిరితో కలిసి చేసే బృంద వ్యాయామంతో కుంగుబాటు, ఒత్తిడిని దూరం చేయవచ్చని మానసికి ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చని తమ పరిశోధనలో వెల్లడైందని యేల్ వర్సిటీ సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఆడమ్ చెక్రూడ్ చెప్పారు. రోజు విడిచి రోజు 45 నుంచి 60 నిమిషాల వరకూ వ్యాయామం చేయడం మెరుగైన మానసిక ఆరోగ్యానికి సరిపోతుందని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ సైకియాట్రీ హెడ్ ప్రొఫెసర్ స్టీఫెన్ ల్యారీ తెలిపారు. కాగా ఈ అథ్యయన వివరాలు లాన్సెట్ సైకియాట్రీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
తవ్వేస్తున్నారు..!
తీరంలో జోరుగా చేపల చెరువుల తవ్వకాలు అధికారులను మచ్చిక చేసుకుని అక్రమ వ్యాపారం అసైన్డ్, దేవాలయ, మడ అడవుల భూముల్లోనూ తవ్వకాలు కాసుల వర్షం కురిపించే చేపల సాగు కోసం అక్రమారులు అడ్డగోలుగా చెరువులు తవ్వేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు ‘పచ్చ’నోట్లు పుచ్చుకుని నోరు మెదపడంలేదు. కార్యాలయాల నుంచి కాలు కదపడంలేదు. ఫలితంగా తీరం వెంబడి భారీగా చేపల చెరువులు వెలుస్తున్నాయి. మడ అడవులు, దేవాలయాల భూములు కూడా చెరువులుగా మారుతున్నాయి. మచిలీపట్నం : తీరంలో చేపల చెరువులను తవ్వే మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఎకరం, రెండు ఎకరాలకు అనుమతులు తీసుకుని వందలాది ఎకరాలను చెరువులుగా మార్చేస్తున్నారు. అధికారులను మంచి చేసుకుని అసైన్డ్, దేవాదాయ శాఖ భూములను చేపల చెరువులుగా తవ్వేస్తున్నారు. ఈ వ్యవహారం తమ కళ్ల ఎదుటే జరుగుతున్నా రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. చెరువులు తవ్వే సమయంలో డ్రెయినేజీ శాఖకు సంబంధించిన భూములు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇటీవలే అధికారం చేజిక్కించుకున్న కొందరు నాయకులు చేపల చెరువుల తవ్వకాల్లో తలమునకలవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్) నిబంధనలను సైతం అతిక్రమించి మడ అడవులను చేపల చెరువులుగా మారుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. గ్రామస్థాయి వీఆర్వో నుంచి డివిజన్ స్థాయి వరకు ఎవరికి వెళ్లాల్సిన మామూళ్లు వారికి చేరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బందరు మండలంలో చిన్నాపురం, కోన, కానూరు, పెదపట్నం తదితర ప్రాంతాల్లో చేపల చెరువుల తవ్వకాలు వేగవంతంగా జరుగుతున్నాయి. తమకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని అక్రమార్కులు బాహాటంగానే చెబుతున్నారు. వనామీ రొయ్య అధిక ధర పలుకుతుండటం, సాగు బాగుండటంతో సముద్రపు కరకట్ట పక్కనే ఉన్న మడ అడవులను రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. కెపీటీపాలెం, కమ్మవారిచెరువులో రొయ్యల చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయి. కోన, చిన్నాపురం తదితర ప్రాంతాల్లో చేపల చెరువుల తవ్వకాలు జోరందుకున్నాయి. పెడన మండలంలో బల్లిపర్రు, దేవరపల్లి, నందమూరు తదితర ప్రాంతాల్లో అక్రమంగా చెరువుల తవ్వకం వేగవంతంగా సాగుతోంది. లజ్జబండ డ్రెయిన్‌ను సైతం ఆక్రమించేస్తున్నారు. పెడన మండల శివారు ముదినేపల్లి మండలం శింగరాయపాలెంలో 90 ఎకరాలకు పైగా చేపల చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయి. కృత్తివెన్ను మండలంలో పీతలావ, కృత్తివెన్ను, వాలంక, పల్లెపాలెం తదితర ప్రాంతాల్లో ఇటీవల చేపలు, రొయ్యల చెరువుల తవ్వకం ఊపందుకుంది. వందలాది ఎకరాల అసైన్డ్ భూమిని చెరువులుగా మార్చేస్తున్నారు. బంటుమిల్లి మండలం పెందుర్రు, చోరంపూడి, నాగన్నచెరువు తదితర ప్రాంతాల్లో చెరువుల తవ్వకాలు వేగవంతంగా జరుగుతున్నాయి. వర్షం కురిస్తే పనులు నిలిచిపోతాయని భారీ యంత్రాలను తీసుకువచ్చి శరవేగంగా చురువులు తవ్వేస్తున్నారు. నందివాడలో కోదండరామస్వామి దేవస్థానానికి చెందిన వ్యవసాయ భూమిని ఎటువంటి అనుమతులు లేకుండా చేపల చెరువుగా మారుస్తున్నారు. సర్వే నంబర్ 9, 10లో సుమారు 10.14ఎకరాల సాగు భూమిలో రెండు పొక్లేయిన్లతో గత రెండు రోజులుగా చెరువు తవ్వకం పనులు కొనసాగిస్తున్నారు. వరిసాగు చేస్తామని వేలంపాట ద్వారా భూములు దక్కించుకున్న రైతు చేపల చెరువులుగా ఈ భూమిని మార్చటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కోడూరు మండలం ఉల్లిపాలెం, పాలకాయతిప్ప వి.కొత్తపాలెం, రామకృష్ణాపురం, మందపాకల తదితర ప్రాంతాల్లో ఇటీవల చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలు ప్రారంభమయ్యాయి. అధికారుల కనుసన్నల్లోనే ఈ తతంగమంతా నడుస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు అక్కడకు రావటం.. వెళ్లిపోవటం మినహా పనులు నిలిపివేసింది లేదని ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. అవనిగడ్డ మండలం పులిగడ్డలో సొసైటీ పేరుతో అక్రమంగా రొయ్యల చెరువుల తవ్వకాలు ఇటీవలే పూర్తిచేశారు. అధికారులకు విషయం తెలిసినా పట్టించుకోకపోవటం గమనించదగ్గ అంశం. అశ్వారావుపాలెంలో ఇటీవల చెరువుల తవ్వకాలు చేసిన అనంతరం రెవెన్యూ అధికారులు హడావుడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి.