
పుట్టినరోజు ఇలా జరుపుకోవాలి!
పుట్టినరోజు జరుపుకోవడానికి శాస్త్రం ఒక విధిని నిర్ణయించింది. పుట్టినరోజు జరుపుకొనే వ్యక్తి ఆ రోజు తెల్లవారు ఝామున నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి.
పుట్టినరోజు జరుపుకోవడానికి శాస్త్రం ఒక విధిని నిర్ణయించింది. పుట్టినరోజు జరుపుకొనే వ్యక్తి ఆ రోజు తెల్లవారు ఝామున నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. ఒంటికి నూనె రాసుకుంటే అలక్ష్మి పోతుంది. నూనె అంటుకొని తలస్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఇష్టదేవతారాధన చేయాలి. ఇంట్లో కులదైవం, ఇష్టదైవం ఉంటారు. వారిరువురినీ పూజించాలి. దీపం వెలిగించి, దీపం దగ్గర గట్టుమీద అక్షతలో, ఒకపువ్వో వేసి నమస్కారం చేస్తే, అది ఇంట కాంతి నింపుతుంది. జీవితాన్ని నిలబెడుతుంది.
గురువుకి, తల్లిదండ్రులకి, పెద్దలకి నమస్కారం చేసి, ఆశీర్వాదాన్ని పొందాలి. దేవాలయానికి వెళ్ళి గోత్రనామాలతో పూజ చేయించుకోవాలి. లేదా కనీసం ఇంటిలో అయినా ఈశ్వరుడి అర్చన చెయ్యాలి. అపమృత్యు దోషం కబళించకుండా ఉండడానికి నల్లనువ్వులు, బెల్లం, ఆవుపాలు కలిసిన పదార్థాన్ని మూడుమార్లు పుచ్చుకోవాలి.ఆ తర్వాత పుట్టుకతో చిరంజీవులైన అశ్వత్థామ బలిర్వా్యసో హనూమాంశ్చ విభీషణః! కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః!!
ఈ ఏడుగురి పేర్లు మనసులోనన్నా స్మరించాలి. పైకి కూడా చెప్పవచ్చు. ఆరోజు తల్లిదండ్రులకి, గురువుగారికి నమస్కిరించి ఆశీర్వచనం అందుకోవాలి. ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయాన్ని దర్శనం చేయాలి. చక్కగా మృష్టాన్న భోజనం చేయాలి. శక్తికొలదీ దానధర్మాలు నిర్వహించాలి. స్తోమత లేకపోతే చేతినిండా కాసిని పచ్చగడ్డిపరకలు పట్టుకెళ్ళి ఒక ఆవుకి తినిపించి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే చాలు. ఇవి పుట్టినరోజు నాడు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకొని చేయవలసిన విషయాలు.