స్వరతంత్రులకు కావాలి...సంగీత స్వరాలు!
శాస్త్రీయం
‘ఆయన గొంతు సింహంలా గంభీరంగా ఉంటుంది’
‘చూస్తే పులిలా కనబడతాడు. గొంతేమో పిల్లిలా ఉంటుంది’...ఇలాంటి మాటలు మనకు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. గొంతుకు సంబంధించిన ‘అసంతృప్తి’ ఒకప్పుడు మాటల వరకే పరిమితం అయ్యేది. ఇప్పుడు మాత్రం అసంతృప్తి చెందడం కంటే తమ గొంతును మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓకల్ థెరపిస్ట్‌లను సంప్రదిస్తున్నారు.
‘వాయిస్ లిఫ్ట్స్’ పేరుతో గొంతులోని వృద్ధాప్యాన్ని తుడిచి వేయడానికి కొందరు సర్జన్లు రకరకాల ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ‘‘నేను సింగర్‌ని కాదండి. బాత్‌రూమ్ సింగర్‌ని మాత్రమే’’ అని వినమ్రంగా అంటుంటారు కొందరు.
బాత్‌రూమే కాదు, కిచెన్‌రూమ్ సింగర్ అయినప్పటికీ... దానివల్ల ప్రయోజనమే అంటున్నారు బ్రిటన్‌లోని క్వీన్ ఎలిజేబెత్ హాస్పిటల్ చెవి, ముక్కు, గొంతు సర్జన్ డెక్లాన్ కోస్టెల్లో
‘‘కాలు, భుజ కండరాలు వయసు పైబడుతున్న కొద్ది బలహీనమైనట్లే స్వరతంత్రులు కూడా బలహీనమైపోతాయి’’ అంటున్న కోస్టెల్లో, గొంతులో యౌవ్వనాన్ని కాపాడుకోవడానికి పాటను మించిన సాధనం లేదు అని సలహా ఇస్తున్నారు.
పాటకు స్వరతంత్రులకు చాలా దగ్గరి సంబంధం ఉంది.
పాట అనేది స్వరతంత్రులకు వ్యాయామం లాంటిది.
‘‘ఉద్యోగ విరమణ పొందిన వారి గొంతులో కొద్ది కాలానికే మార్పు వస్తుంది. దీనికి కారణం వారు ఉద్యోగం చేస్తున్నప్పటితో పోల్చితే తక్కువ మాట్లాడమే’’ అంటారు కోస్టెల్లో. ఇలా తక్కువగా మాట్లాడడం వల్ల గొంతుకు వ్యాయామం తగ్గిపోతుంది. ఈ లోటు భర్తీ కావడానికి ఇంట్లోనే అటూ ఇటూ తిరుగుతూ రాగాలు తీయడమో, పాటలు పాడడమో చేయాలని ఆయన సూచిస్తున్నారు.
మరిక ఆలస్యమెందుకు... పదండి, పదం అందుకోండి, పాడండి!