స్కిల్స్ పెంచుకుంటే కొలువు సులువే!
భారత్‌లో ప్రతిఏటా 30 లక్షల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తిచేసుకొని, ఉద్యోగాన్వేషణ ప్రారంభిస్తున్నారు. వారిలో దాదాపు 25 శాతం మంది మాత్రమే ఉద్యోగార్హతలను కలిగి ఉంటున్నారు. ప్రతిభావంతుల్లో ఎక్కువ మంది ఐటీ, ఐటీఈఎస్ రంగాలను ఎంచుకున్నారు. మిగిలిన 75 శాతం మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉద్యోగ సాధనకు అవసరమైన విజ్ఞానం, నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించాల్సిన బాధ్యత కళాశాలలపై ఉంది. విద్యార్థులను మెరికలుగా తీర్చిదిద్దడంలో పారిశ్రామిక రంగం పాత్ర కూడా ఎంతో కీలకం. కార్పొరేట్ కల్చర్ అవేర్‌నెస్, ఇంటర్న్‌షిప్ ప్రాజెక్టుల్లో వారిని భాగస్వాములను చేయాలి. తగిన శిక్షణ ఇవ్వాలి. ఒక ఇంజనీరింగ్ విద్యార్థి తాను తరగతి గదిలో నేర్చుకున్నదాన్ని పరిశ్రమలో ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టినప్పుడే సుశిక్షితుడైన మానవ వనరుగా ఎదుగుతాడు. తన భవిష్యత్తుకు బాటలు వేసుకోగలుగుతాడు.
ఆంగ్ల భాషపై పట్టు
టెక్నికల్ విద్యార్థులు ఆంగ్ల భాషపై తగినంత పట్టు సాధించలేకపోతే.. వారికి ఎంత విజ్ఞానం ఉన్నా నిరర్థకమే. కాల్‌సెంటర్లు, బీపీఓ, కేపీఓ, ఐటీఈఎస్, ఐటీ తదితర రంగాల్లో రాణించాలంటే మంచి ఇంగ్లిష్ నేర్చుకోవాల్సిందే. ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆంగ్లాన్ని మొదటి సంవత్సరం నుంచే బోధించాలి. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరిన తర్వాత ఆంగ్ల భాష విషయంలో ఎన్నో ఇబ్బందులెదుర్కొంటున్నారు. వారిలో ఆంగ్ల భాషా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. భాష ఏదైనా చదవడం, రాయడం, మాట్లాడడం సంపూర్ణంగా వచ్చినప్పుడే దానిపై పూర్తి పట్టు సాధించినట్లు భావించాలి. ఇటీవల కొత్తగా ఏర్పడుతున్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు ఆంగ్లంలో మెలకువలు నేర్పడంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజంటేషన్ స్కిల్స్ వంటి వాటిలో శిక్షణ ఇస్తున్నారు. ఇది ప్రశంసనీయమైన ప్రయత్నం.
అప్‌డేట్ నాలెడ్జ్ తప్పనిసరి
ఆధునిక పారిశ్రామిక అవసరాలకు తగిన సిలబస్‌ను ఇంజనీరింగ్ కరిక్యులమ్‌లో తప్పనిసరిగా చేర్చాలి. లేకపోతే పరిశ్రమలకు కావాల్సిన మానవ వనరులు లభించవు. యూనివర్సిటీల్లోని అకడమిక్ కౌన్సిల్‌లో ఉండే సబ్జెక్టు నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు కలిసి సిలబస్‌ను నిర్ణయిస్తుంటారు. ఈ విషయంలో పరిశ్రమల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఆండ్రాయిడ్ టెక్నాలజీ, బిగ్‌డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, డాట్‌నెట్ టెక్నాలజీస్, క్యాడ్ క్యామ్, ఆటోక్యాడ్, మెట్‌ల్యాబ్ నిపుణుల అవసరం ఎక్కువగా ఉంది. కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల కరిక్యులమ్‌లో ఆయా అంశాలు లేకపోవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో వాటిని వాల్యూ యాడెడ్ కోర్సులుగా బోధించాలి. ఆయా టెక్నాలజీలను ఉపయోగించే సంస్థల నుంచి నిపుణులను పిలిపించి, వారు తమ అనుభవాన్ని విద్యార్థులతో పంచుకొనే విధంగా ప్రత్యేక సదస్సులు నిర్వహించవచ్చు. అంతేకాకుండా విద్యార్థులతో వివిధ రకాలైన సర్టిఫికేషన్స్ చేయించాలి. సిస్కో సర్టిఫికేషన్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్, ఎస్‌ఏపీ(శాప్) సర్టిఫికేషన్ వంటి వాటి ద్వారా విద్యార్థులకు అప్‌డేట్ నాలెడ్జ్ సొంతమవుతుంది. ఈ సర్టిఫికేషన్స్ పూర్తిచేసిన విద్యార్థులను ఆయా రంగాలకు చెందిన సంస్థలతో అనుసంధానం చేయడం ద్వారా వారికి ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న కోర్సులపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. సీ++, కోర్‌జావాలో నైపుణ్యం పెంచుకుంటే జావా డెవలపర్‌గా స్థిరపడేందుకు అవకాశాలుంటాయి.
టి.వి. దేవీ ప్రసాద్
హెడ్- ప్లేస్‌మెంట్
ఐఐఐటీ- హైదరాబాద్