![Kishan Reddy Chief Guest At Mega Science Festival Held In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/27/KISHAN-REDDY.jpg.webp?itok=adh8eIZy)
సైన్స్ ప్రదర్శనలో క్షిపణులను పరిశీలిస్తున్న కిషన్‌రెడ్డి
లాలాపేట (హైదరాబాద్): మన శాస్త్రవేత్తలు కనుగొన్న వ్యాక్సిన్ కారణంగానే కరోనాపై భారత్ విజయం సాధించగలిగిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో శాస్త్రవేత్తల కృషి ఎంతో గొప్పదని, అధికారులు, ప్రజల సహకారం కూడా దీనికి తోడైందని పేర్కొన్నారు. తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్)లో 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు, ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న సైన్స్ వారోత్సవాల కార్యక్రమంలో శనివారం కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోసం 150 దేశాలు ఎదురు చూస్తున్నాయని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దేశంలో 170 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేసినట్లు వివరించారు. కరోనా కాలంలో దేశంలో పదివేల స్టార్టప్ కంపెనీలు ప్రారంభమైనట్లు తెలిపారు. శాస్త్రజ్ఞులు, మేధావుల కృషివల్ల నేడు మనదేశం వ్యాక్సిన్, పీపీఈ కిట్లను ఎగుమతి చేయగలుగుతోందన్నారు.
కాగా, ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులందరినీ సురక్షితంగా మన దేశానికి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత మాట్లాడుతూ.. దేశంలో పోషకాహార లోపాలను అధిగమించేందుకు ఎన్‌ఐఎన్ చేస్తున్న పరిశోధనలను వివరించారు. తర్వాత కిషన్‌రెడ్డి ఎన్‌ఐఎన్‌లో సైన్స్ ప్రదర్శనను తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment