సాధన.. శోధన.. వికాసం... విజ్ఞానం | story of meditation and knowledge | Sakshi
Sakshi News home page

సాధన.. శోధన.. వికాసం... విజ్ఞానం

Published Sat, Jul 2 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

సాధన.. శోధన.. వికాసం... విజ్ఞానం

సాధన.. శోధన.. వికాసం... విజ్ఞానం

కృష్ణయజుర్వేదం తైత్తరీయ ఆరణ్యకానికి చెందినదే ఈ ఉపనిషత్తు. ఆరణ్యకంలోని చివరి మూడు ఖండాలను (ఏడు, ఎనిమిది, తొమ్మిది) ైతె త్తరీయోపనిషత్తు అంటారు.

తైత్తిరీయోపనిషత్తు

కృష్ణయజుర్వేదం తైత్తరీయ ఆరణ్యకానికి చెందినదే ఈ ఉపనిషత్తు. ఆరణ్యకంలోని చివరి మూడు ఖండాలను (ఏడు, ఎనిమిది, తొమ్మిది) ైతె త్తరీయోపనిషత్తు అంటారు. ఇది శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి అనే మూడు అధ్యాయాలుగా ఉంది. మొదటి అధ్యాయం శిక్షావల్లిలో పన్నెండు అనువాకాలు ఉన్నాయి. ఇది గురుశిష్య సంబంధానికి, పఠనానికీ, బోధనకూ, వ్యక్తిత్వ వికాసానికీ, సాధనకూ, శోధనకూ పనికి వచ్చే ఎన్నో సూచనలు చేసే సుప్రసిద్ధమైన ఉపనిషత్తు.

ఓం సహనావవతు! సహనౌ భునక్తు!
సహవీర్యం కరవావహై
తేజస్వినావ ధీతమస్తు మా విద్విషావహౌ
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః

 (గురుశిష్యులమైన మా ఇద్దరినీ పరమాత్మ రక్షించుగాక! కలిసి భుజింతుము గాక! కలిసి వీరోత్సాహంతో అధ్యయనం చేయుదుముగాక! ఇద్దరమూ తేజోవంతులు అగుదుముగాక! మా ఇద్దరికీ ద్వేషం లేకుండుగాక !) ఈ అనువాకం ప్రార్థనగా పిల్లలూ, పెద్దలూ అందరూ చేస్తూ ఉంటారు. దీనిలో శిక్షావల్లి ప్రారంభం అవుతోంది. శిక్షను వైదిక సంస్కృతంలో ‘శీక్షా’ అంటారు. శిక్ష అంటే విద్యాభ్యాసం. అక్షరం, స్వరం, హ్రస్వదీర్ఘఫ్లుతాలు, స్పష్టమైన ఉచ్చారణ ఎలా ఉండాలో దీనిలో వివరిస్తారు. ఇది ప్రాథమిక విద్య. శరీరంతో సాధించేది. మానవుడు తనకు ఉన్న అయిదు అనుబంధాలను గురించి తెలుసుకోవాలి. అవి అధిలోకం (ప్రపంచజ్ఞానం) అధి జ్యోతిష్యం (విశ్వతేజస్సు), అధివిద్యామ్ (విద్యాభ్యాసం) అధిప్రజమ్ (సంతానాన్ని కనటం) అధ్యాత్మమ్ (వేదోపనిషత్తులతో ఆత్మజ్ఞానాన్ని పొందటం) ఇది వ్యక్తిత్వ వికాసంతో కూడిన సంపూర్ణ విద్య.

భూమి, ఆకాశాలను కలిపే అంతరిక్షాన్ని, వాయువును గూర్చి తెలుసుకుని ప్రపంచజ్ఞానాన్ని పొందాలి. అగ్ని, సూర్యుడు, వారిని కలిపే నీరు, మెరుపులను గమనించి విశ్వతేజస్సును తెలుసుకోవాలి. గురువు, శిష్యుడు విద్యలను కలిపే ప్రవచనం ద్వారా విద్యావంతులు కావాలి. తల్లి, తండ్రి, సంతానం ఏర్పడే సంయోగం ద్వారా పునరుత్పత్తి జరుగుతోందని తెలుసుకోవాలి. కింది దవడ, పై దవడ, నాలుక కదలికల వల్ల వాక్కు పుడుతోందని తెలుసుకుని ఈ శరీరం ద్వారా ఆత్మను గురించి తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకున్నవాడు మంచి సంతానాన్ని, పశుసంపదను, బ్రహ్మవర్ఛస్సును, అన్నోదకాలను, స్వర్గాది ఉత్తమ లోకాలను పొందుతాడు. ఆచార్యుని ఆకాంక్ష, మనోభావాలు ఇలా ఉన్నాయి.

పరమాత్మ జీవుల హృదయాకాశంలో ఉంటాడు. ఆత్మనాశనం లేకుండా ప్రకాశిస్తూ ఉంటుంది. నోటిలోని కొండనాలుక ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చు. దాని నుండి ఒకనాడి కపాలంలోకి పోతోంది. ఓం భూః, భువః, సువః, మహః అనే నాలుగు వ్యాహృతులనూ (పేర్లు) ఏకాగ్రతతో ధ్యానించడం వల్ల అగ్ని, వాయువు, సూర్యుడు, పరమాత్మలతో లీనమై పరబ్రహ్మమౌతాడు. ఆకాశం శరీరంగా, సత్యం ఆత్మగా, ఆనందం మనస్సుగా, శాంతితో అమృతమూర్తిగా పరిపూర్ణుడు అవుతాడు. ధ్యానమే సరైన మార్గం.

 సమస్త శబ్దజాలానికీ ప్రథమం ఓంకారం. అది మేధనూ, బ్రహ్మజ్ఞానాన్నీ, ఆరోగ్యాన్నీ, ప్రసాదించుగాక! నాలుక మధురంగా మాట్లాడుగాక! చెవులు మంచిమాటలే వినుగాక! కూడు, గూడు, గుడ్డ, నీరు, పశుసంపద నాకు లభించుగాక! సత్‌ప్రవర్తన  గల విద్యార్థులు అన్ని దిక్కుల నుండి నా దగ్గరకు వత్తురు గాక! శమదమాది క్రమశిక్షణగల శిష్యులు నాకు లభింతురుగాక! ప్రణవరూపుడైన పరమాత్మా! నేను నీలో లీనమై పాఠాలను బోధిస్తాను. నీరు పల్లానికి పారినట్లు ఉత్తములైన బ్రహ్మచారులు నన్ను చేరుదురుగాక!

 భూః భువఃసువః అనే మూడు భూమి, ఆకాశం, పరలోకం. వీటిని అందరూ తలచుకుంటారు. ‘మహా చమస్యుడు’ అనే రుషి ‘మహః’ అనే నాలుగోదాన్ని కనుక్కున్నాడు. మహః అంటే పరబ్రహ్మమైన వెలుగు. భూః అంటే అగ్ని. భువః అంటే వాయువు. సువః అంటే సూర్యుడు. మహః అంటే చంద్రుడు అని ఒక నిర్వచనం చెబుతారు. చంద్రకాంతిలోని ఓషధులవల్ల జీవులు బతుకుతున్నాయి. మరోనిర్వచనం భూః= ఋగ్వేదం, భువః=సామవేదం, సువః= యజుర్వేదం. మహః= ఓంకారం. ఓంకారమే వేదాలకు మూలం. ఇంకో నిర్వచనం భూః= ప్రాణం. భువః= అపానం. సువః= వ్యానం, మహః= అన్నం. అన్నంతోనే అన్ని ప్రాణులూ జీవిస్తున్నాయి. ఆ నాలుగు నిర్వచనాలను తెలుసుకున్నవాడు పదహారు విధాలుగా జ్ఞానాన్ని పొందుతాడు. దేవతలు అతనికి ఎన్నో కానుకలు ఇస్తారు.

 భూమి, ఆకాశం, ఖగోళం, దిక్కులు, విదిక్కులు, ఒక విభాగం, అగ్ని, వాయువు, సూర్యచంద్రులు, నక్షత్రాలు ఒక విభాగం. నీరు, ఔషధులు, చెట్లు, ఆకాశం, ప్రపంచం ఒక విభాగంగా ఇవన్నీ బాహ్య వస్తువులు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు, కన్ను, చెవి, మనస్సు, వాక్కు, స్పర్శజ్ఞానం, లోపలి చర్మం, మాంసం, నరాలు, ఎముక, మజ్జ, లోపల ఉండేవి. అయిదుగా ఉండే అంతర్బాహ్యాలు కలిపి ఒకటి అవుతాయి. సమ్మతికీ, అసమ్మతికీ, ఆరంభానికీ, ముగింపుకీ, వేదాలకు, యజ్ఞమంత్రాలకూ అన్నింటికీ ఓంకారమే ముఖ్యం. ఓంకారజపంతో పరబ్రహ్మాన్ని చేరుకుంటాడు.

 మానవ జీవితంలో తప్పనిసరిగా ఉండవలసినవి ఏమిటనే విషయంలో నాకమహర్షి ఏం చెప్పాడో వచ్చేవారం చూద్దాం..
- డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement