విజ్ఞాన శాస్త్రం రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. దాంతో ప్రమాదాలు, ప్రమోదాలూ సమంగా ఉంటాయి. దాన్ని విధ్వంసానికి ఉపయోగించాలో, వికాసానికి వినియోగించుకోవాలో తేల్చుకోవాల్సింది మనిషే.
విజ్ఞాన శాస్త్రం రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. దాంతో ప్రమాదాలు, ప్రమోదాలూ సమంగా ఉంటాయి. దాన్ని విధ్వంసానికి ఉపయోగించాలో, వికాసానికి వినియోగించుకోవాలో తేల్చుకోవాల్సింది మనిషే. ఒక్కోసారి అసలు మన ఉద్దేశాలతో ప్రమేయం లేకుండా కూడా అది పెనుముప్పునకు కారణం కావొచ్చు. ఒకటి రెండు రోజుల్లో భూమ్మీద అమాంతం పడిపోనున్న ఉపగ్రహం చెబుతున్న పాఠమిదే. గురుత్వాకర్షణ క్షేత్రాలు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేసిన... సాగరాల తీరుతెన్నులెలా ఉంటున్నాయో పసిగట్టి చెప్పిన ఉపగ్రహం ఇప్పుడు అన్ని నియంత్రణలనూ ధిక్కరించి కిందకు దూసుకొస్తున్నది.
యూరోపియన్ అంతరిక్ష సంస్థ సరిగ్గా నాలుగేళ్ల క్రితం ప్రయోగించిన ఈ ఉపగ్రహం గత కొన్నాళ్ల నుంచి శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. అంతరిక్షంలో తిరుగాడుతున్న ఉపగ్రహం ఉన్నట్టుండి కనుమరుగెలా అయిందని వారంతా గందరగోళంలో పడిపోయారు. ఈ ధూర్త ఉపగ్రహం ఆచూకీ వారికి పెద్ద పజిల్‌గా మారిపోయింది. వారం క్రితం మాత్రమే అది భూమివైపుగా దూసుకొస్తున్నదని శాస్త్రవేత్తలు గ్రహించారు. అది ఎప్పుడు, ఎక్కడ పడుతుందన్న అంశంలో ఇంకా స్పష్టత రాలేదు. భూవాతావరణంలోకి ప్రవేశించాక మాత్రమే సమయాన్ని నిర్ధారించడం సాధ్యమవుతుంది. ఆదివారం లేదా సోమవారం అది కూలుతుందని తాత్కాలికంగా అంచనాకొచ్చారు.
1,100 కిలోల బరువున్న ఈ ఉపగ్రహంలో కొంత భాగం భూవాతావరణంలోకొచ్చిన వెంటనే ఆ రాపిడికి భగ్గున మండుతుందని చెబుతున్నారు. మండేది మండగా అది దాదాపు 45 శకలాలుగా విడివడుతుందట. ఈ శకలాలు ఒక్కోటి 90 కిలోలకుపైగా బరువు ఉండొచ్చని అంచనా. అయిదున్నర దశాబ్దాల క్రితం అంతరిక్షంపై ఆధిపత్యం సాధించడానికి రెండు అగ్రరాజ్యాలు అమెరికా, సోవియెట్ యూనియన్‌లు చేసిన ప్రయత్నం అంతకంతకు విస్తరించి ఇప్పటి ఈ స్థితికి చేరింది. 1957లో మొట్టమొదటి మానవ నిర్మిత ఉపగ్రహం స్పుత్నిక్-1ను సోవియెట్ యూనియన్ అంతరిక్షంలోకి పంపింది. అటు తర్వాత ఏకంగా చంద్రుడిపైకి మరో ఉపగ్రహం లూనా-2ను పంపి పరుగు పందెంలో తానే ముందున్నానని నిరూపించుకుంది. మరో పదేళ్లకు...అంటే 1969 జూలై 30న చంద్రమండలంలో అమెరికా మనుషులనే దింపింది.
మన దేశం 1962లో భారత అంతరిక్ష పరిశోధనా సంఘాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఈ పోటీ మరింతగా పెరిగిపోయింది. ఒకర్ని మించి ఒకరు అంతరిక్ష విజయాలను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉపగ్రహాల వల్ల ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది. మనుషుల మధ్య దూరం తరిగిపోయింది. భూగోళంలో ఏమూలనున్నా ఒకరితో ఒకరు దృశ్యమాధ్యమం ద్వారా సంభాషించుకునేంతగా సాంకేతిక విజ్ఞానం విస్తరించింది. టీవీ ప్రసారాల దగ్గర నుంచి సెల్‌ఫోన్ల వరకూ... వాతావరణ స్థితిగతులు తెలుసుకోవడం నుంచి ప్రమాద హెచ్చరికల వ్యవస్థ వరకూ అన్నిటికీ అంతరిక్షంలో నిరంతరం తిరుగాడే ఉపగ్రహాలే ఆధారమవుతున్నాయి.
ఇదంతా నాణేనికి ఒకపక్క మాత్రమే. ఆసక్తి అనాలో, అత్యుత్సాహం అనాలో... మొత్తానికి మనిషిలో పెరుగుతున్న తృష్ణ ముప్పునూ కొనితెస్తోంది. అంతరిక్షం క్రమేపీ పెద్ద చెత్త కుప్పగా మారుతోంది. అప్పుడప్పుడు దారితప్పి వచ్చే గ్రహ శకలాలను మించి ఆ చెత్త కుప్ప భయపెడుతోంది. ఎప్పుడు మిన్ను విరిగి మీద పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మూడున్నర దశాబ్దాల క్రితం నేల రాలిన స్కైలాబ్ అంతరిక్ష నౌక మానవాళిని అప్పట్లో తీవ్రంగా కలవరపరిచింది. ఇంకేముంది... యుగాంతమే అనుకున్నారందరూ. అది సముద్రంలో పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారుగానీ ఆ బాపతు ప్రమాదం అంతరించలేదు. సరిగదా ఇంతకింతా పెరిగింది. అప్పగించిన పనిని మానుకుని మొరాయించే ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు మృత ఉపగ్రహాలుగా వ్యవహరిస్తారు. రెండేళ్ల క్రితం అమెరికా ప్రయోగించిన ఆర్స్ ఉపగ్రహం నేలపైకి దూసుకొచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ హడలెత్తాయి.
ఎక్కడ ఎలాంటి ముప్పు కలిగిస్తుందోనని వణికిపోయాయి. కానీ, అదృష్టవశాత్తూ అది పసిఫిక్ మహా సముద్రం సమీపంలో కూలింది. గత ఏడాది రష్యా అంగారకుడిపైకి పంపిన ఫోబోస్‌గ్రంట్ ఉపగ్రహం మధ్యలోనే మొరాయించి వెనక్కు దూసుకొచ్చింది. అది కూడా పసిఫిక్ మహా సముద్రాన్నే నమ్ముకోవడంతో పెనుముప్పు తప్పింది. అంతరిక్షంలో తిరుగాడే ఒక ఉపగ్రహాన్ని చైనా 2007లో క్షిపణి ద్వారా ధ్వంసం చేసింది. అది అనుకోకుండా జరిగిందేనని ఆ దేశం సంజాయిషీ ఇచ్చుకున్నా ఫలితం మాత్రం తీవ్రంగానే ఉంది. ఆ ఉపగ్రహం తాలూకు శకలాలు ఇప్పుడు అంతరిక్షంలో గిరికీలు కొడుతున్నాయి. మన దేశంతో సహా ఎందరెందరి ఉపగ్రహాలకో ముప్పుగా పరిణమించాయి.
2009లో రష్యా ఉపగ్రహం దారితప్పి అమెరికా ఉపగ్రహాన్ని ఢీకొట్టి నుగ్గునుగ్గు చేసింది. అది కూడా భారీయెత్తున వ్యర్థాలను మిగిల్చింది. అసలు అంతరిక్షంలో చిన్నా పెద్దా శకలాల సంఖ్య దాదాపు 4 కోట్లుంటుందని అంచనా. ఇందులో నట్లు, బోల్టులు మొదలుకొని పెద్ద పెద్ద శకలాల వరకూ ఉంటాయి. ఈ పరిస్థితిని గమనించే ఇకపై ప్రయోగించే ఉపగ్రహాల న్నిటికీ ‘సేఫ్ మోడ్’ విధానం ఉండాలని, పనికిరావనుకున్నప్పుడు వాటిని సురక్షితంగా దించేందుకు ఇది అవసరమని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. కానీ, పట్టించుకునేదెవరు? ఇప్పుడు కూలిపోతున్న ఉపగ్రహంలో అలాంటి ఏర్పాటున్నా, అది కూడా పనిచేయడం మానేసింది.
ఏడాదికి 40 టన్నుల అంతరిక్ష వ్యర్థాలు భూమ్మీద పడుతున్నాయని అంచనా. ఈ ఏడాదైతే ఆ బాపతు వ్యర్థాలు 100 టన్నుల వరకూ పడ్డాయని చెబుతున్నారు. ఉపగ్రహ నిర్మాణంలో ఉపయోగించే రసాయనాలు, లోహాలు, ఆ పరికరాల్లో ఉండే రేడియోధార్మిక పదార్థాలు ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి. విజ్ఞాన శాస్త్ర ప్రగతి ‘పులి మీద స్వారీ’లా మారినప్పుడు ఇంతకన్నా మెరుగైన ఫలితాలు ఎలా వస్తాయి?