ఒక విప్లవకారుడు | Funday special story on Venkatesa Subramanya Iyer | Sakshi
Sakshi News home page

ఒక విప్లవకారుడు

Published Sun, Jan 27 2019 12:30 AM | Last Updated on Sun, Jan 27 2019 12:30 AM

Funday special story on Venkatesa Subramanya Iyer - Sakshi

విజ్ఞానం, విప్లవం మేళవించిన విశిష్ట చరిత్రపురుషుడు వీవీఎస్‌. సంప్రదాయం, సమరం, సాహితీ పిపాస కలగలసిన  అద్భుత జీవితం ఆయనది.

‘వీవీఎస్‌’ – ఈ పేరుతో టెలిగ్రామ్‌ వచ్చింది, ఓడలోకి. అదే పేరున్న వ్యక్తి ఆచూకీ కోసం నిఘా వేసిన స్కాట్‌ల్యాండ్‌ యార్డ్‌ గూఢచారి జాగరూకుడయ్యాడు. టెలిగ్రామ్‌ అందుకున్న వ్యక్తి సూట్‌కేసు మీద కూడా వీవీఎస్‌ అనే ఉంది. ఇక అనుమానం లేదనుకుని అడిగాడా గూఢచారి, ‘మీ పూర్తి పేరు ఏమిటి?’ సమాధానం వచ్చింది, స్థిరంగా ‘వీర్‌ విక్రమ్‌ సింగ్‌’ అని. మరొకసారి ఆమ్‌స్టర్‌డ్యామ్‌ వెళుతున్న ఓడలో రోజుకు ఐదుసార్లు నమాజు చేసే ఒక ముస్లింను కూడా పోలీసులు అనుమానించారు. కానీ ఆయన విజిటింగ్‌ కార్డు తీసి ఇచ్చి తాను కలకత్తాకు చెందిన వ్యాపారవేత్తనని చెప్పారు. ఇంగ్లండ్‌ పోలీసులు, బ్రిటిష్‌ ఇండియా పోలీసులు వెతుకుతున్న వ్యక్తి వీవీఎస్‌ అయ్యర్‌. నిజానికి సిక్కు వీర్‌విక్రమ్‌ సింగ్, కలకత్తా ముస్లిం వ్యాపారవేత్త కూడా నిజం కాదు. ఆ వేషాలలో ఉన్న వ్యక్తి వీవీఎస్‌ అయ్యరే. విజ్ఞానం, విప్లవం మేళవించిన విశిష్ట చరిత్రపురుషుడు వీవీఎస్‌. సంప్రదాయం, సమరం, సాహితీ పిపాస కలగలసిన అద్భుత జీవితం ఆయనది. కానీ, చెప్పుకోవడానికి ఎంతో ఘన చరిత్ర ఉన్నా, చరిత్రపుటలలో చోటు దగ్గర అన్యాయానికి గురైన వారు అయ్యర్‌. 

వరాహనేరి వేంకటేశ సుబ్రహ్మణ్య అయ్యర్‌ (ఏప్రిల్‌ 2, 1881–జూన్‌ 1, 1925) తిరుచురాపల్లి సమీపంలోని వరాహనేరి అనే గ్రామంలో పుట్టారు. తండ్రి వేంకటేశ అయ్యర్‌. శోత్రియ కుటుంబంలో పుట్టినా, ఆ రోజుల్లోనే ఎఫ్‌ఏ చదివారు. ఇంగ్లిష్‌ చదివినా ఆయన సంప్రదాయవాదిగానే ఉన్నారు. కొడుకును కూడా ఇంగ్లిష్‌ చదివించారు. వీవీఎస్‌ అయ్యర్‌ పద్దెనిమిదేళ్లకే బీయ్యే పూర్తి చేశారు. చరిత్ర, సాహిత్యం, లాటిన్‌ ఆయన ఐచ్ఛికాంశాలు. వర్జిల్, హోమర్, షేక్‌స్పియర్, స్పెన్సర్, హాక్స్‌లీ, షోపెనార్, ఎమర్సన్‌ వంటివారిని క్షుణ్ణంగా చదివారాయన. అయితే మాతృభాష తమిళమంటే మాత్రం మహా గౌరవం. కంబ రామాయణం కరతలామలకం. అలాగే సంస్కృతం కూడా. కాళిదాసును లోతుగా చదివారు. ఎమర్సన్‌ కవిత్వం మీద ఉన్న అభిమానంతో ఆయన రచనలను తమిళంలోకి అనువదించారు. 
చదువు అయిన తరువాత అయ్యర్‌ మొదట తపాలాశాఖలో చేరారు. ఆ ఉద్యోగం వదిలేసి, తిరుచ్చికి సమీపంలోనే ఉన్న వడవూర్‌లో బ్యాంకింగ్‌ వ్యాపారం ఆరంభించారు. ఇందులో రాణించారు కూడా. మళ్లీ అది కూడా వదిలేసి న్యాయశాస్త్రం చదివి, తిరుచిరాపల్లి జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రవేశించారు. దీనితో ఆయనకి కావలసినంత డబ్బు, వెసులుబాటు దొరికాయి. మళ్లీ సాహిత్యం చదవడం ఆరంభించారు. ఎంతో ఇష్టమైన చదరంగం ఆడుకునేవారు. ఆ దశలోనే తన సమీప బంధువు  పశుపతి అయ్యర్‌ బర్మా (మైన్మార్‌) నుంచి వచ్చారు. అక్కడ పెద్ద బట్టల వ్యాపారి.  రంగూన్‌ వచ్చి ప్రాక్టీస్‌ పెట్టవలసిందని అయ్యర్‌కి ఆయనే సలహా ఇచ్చారు. అలా రంగూన్‌ వెళ్లిన అయ్యర్‌ జీవితం పెద్ద మలుపు అంచుకి ప్రవేశించింది. 

రంగూన్‌లో ఒక ఆంగ్ల బారిస్టర్‌ దగ్గర సహాయకునిగా చేరారు అయ్యర్‌. అప్పుడే ఇంగ్లండ్‌ వెళ్లి బారెట్లా చదవాలన్న ఆకాంక్ష కలిగింది. లండన్‌ వెళ్లి లింకన్‌ ఇన్‌ అనే సంస్థలో చేరారు. ఇంగ్లండ్‌ చేరిన తరువాత ఆయన పాశ్చాత్య సంగీతం, బాల్‌రూం డ్యాన్స్‌ నేర్చుకోవడం మొదలుపెట్టారు. అచ్చంగా ఒక పాశ్చాత్యుడిలా వేషధారణ ఉండేది. ఆయన పాశ్చాత్యుడు కాదని ఆయన దగ్గర ఉండే పెట్టి తెరిస్తే తప్ప తెలిసేది కాదు. అందులో తమిళ కావ్యాలు, సంస్కృత కావ్యాలు ఉండేవి. వేషధారణ ఎలా ఉన్నా కూడా ఆయన సంప్రదాయం వీడలేదు. ఆ సమయంలోనే శాకాహార భోజనం కోసం అన్వేషిస్తూంటే ఒక సమాచారం తెలిసింది. ఉత్తర లండన్‌లో హైగేట్‌ అనే చోట భారతీయ విద్యార్థులకు ఉద్దేశించిన ఒక వసతిగృహం ఉంది. అందులో శాకాహార భోజనం దొరుకుతుంది. గుజరాత్‌కు చెందిన పండితుడు, బారిస్టర్‌గా లండన్‌లో స్థిరపడిన శ్యామ్‌జీ కృష్ణవర్మ దానిని నెలకొల్పారు. మాతృదేశ విముక్తిని కోరుకుంటున్న కృష్ణవర్మ హోమ్‌రూల్‌ సొసైటీ పేరుతో ఒక సంస్థను స్థాపించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. భారతదేశం ఇంగ్లండ్‌ పాలన నుంచి విముక్తం కావాలన్న ఆశయం ఉన్న యువకులను సమీకరించేవారు. అందులో భాగంగానే ఆ వసతిగృహం ఏర్పాటు చేశారు. దాని పేరు ‘ఇండియా హౌస్‌’. అది విద్యార్థి వసతి గృహమే కానీ, వాస్తవానికి  భారతీయ విప్లవకారులకు కేరాఫ్‌ అడ్రస్‌. ఈ హౌస్‌కు రాజపోషకురాలు మేడమ్‌ భికాజీ కామా.

1906లో అయ్యర్‌ ఇండియా హౌస్‌లో చేరారు. ఆ సంవత్సరమే ‘హౌస్‌’కి చేరుకున్నారు–  వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌. ఎందుకో మరి కొద్దికాలం తరువాత అంటే, 1907లోనే మొదటిసారి ఆ ఇద్దరు కలుసుకున్నారు. అయ్యర్‌ కంటే సావర్కర్‌ రెండేళ్లు చిన్న. కానీ సావర్కర్‌ అంటే అయ్యర్‌కు గొప్ప గురి. అయ్యర్‌ అన్నా కూడా సావర్కర్‌కి చాలా అభిమానం. సావర్కర్‌ హౌస్‌లోని విద్యార్థులకు విప్లవం గురించి చెబుతూ ఉండేవారు. భారత్‌ నుంచి ఇంగ్లండ్‌ వలస పాలకులను తరిమి కొట్టాలంటే హింసామార్గం తప్ప మరొకటి లేదని ప్రవచించేవారు. ఇటలీ ఏకీకరణ ఉద్యమకారులు మేజినీ, గారిబాల్డి గురించి చర్చించేవారు. సావర్కర్‌ రాసిన ‘భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం’ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించడానికి ఏర్పడిన భారతీయ యువకుల బృందానికి నాయకుడు అయ్యరే. మిగిలిన ఆ యువకులంతా ఐసీఎస్‌ చదవడానికి లండన్‌ వచ్చినవారే. అయ్యర్‌ గారిబాల్డి జీవిత చరిత్రను తమిళంలో రాసి, పుదుచ్చేరి నుంచి వెలువడుతున్న ‘ఇండియా’ పత్రికకు పంపారు. విప్లవభావాలకు వేదికగా ఉపయోగపడిన ఆ పత్రిక సంపాదకుడు సి. సుబ్రహ్మణ్య భారతి. ఇంగ్లండ్‌లో భారతీయుల, వారి రాజకీయ, సామాజిక కార్యకలాపాల గురించి ‘లండన్‌ లెటర్‌’ పేరుతో అయ్యర్‌ ‘ఇండియా’ పత్రికలోనే ఒక శీర్షిక నిర్వహించారు కూడా. అప్పుడే కృష్ణవర్మ, మేడమ్‌ కామా పోలీసు నిఘా కారణంగా ఇండియా హౌస్‌ బాధ్యతను సావర్కర్‌కు అప్పగించి పారిస్‌ ప్రవాసం వెళ్లిపోయారు. అప్పుడే సావర్కర్‌ అభినవ్‌ భారత్‌ శాఖను ఆరంభించారు. దానికి అధ్యక్షుడు సావర్కర్‌. ఉపాధ్యక్షుడు అయ్యర్‌. అలా అయ్యర్‌ విప్లవపథానికి మళ్లారు.

ఒకసారి దసరా ఉత్సవాలు జరిపినప్పుడు దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ ఇండియా హౌస్‌ను సందర్శించారు. అహింసా సిద్ధాంతం గొప్పదనం గురించే అక్కడి యువకులకు చెప్పారు. అందరిలాగే అయ్యర్‌ కూడా గాంధీ వాదనను ‘చాదస్తం’గా కొట్టి పారేశారు. ఇంతలో సావర్కర్‌ మీద కూడా నిర్బంధం పెరిగింది. ఆయన కూడా పారిస్‌ వెళ్లిపోయారు. అంతకు ముందు ఒక ఘటన జరిగింది. మహారాష్ట్రకు చెందిన కీర్తికార్‌ అనే డెంటిస్ట్రీ విద్యార్థి ‘హౌస్‌’లో చేరాడు. ఆ హౌస్‌లోనే రాజన్‌ అని అయ్యర్‌ మిత్రుడు, వైద్యుడు ఉండేవారు. ఆయనకు కీర్తికార్‌ మీద అనుమానం వచ్చింది. ఈ సంగతి సావర్కర్, అయ్యర్‌ల దృష్టికి తీసుకువెళ్లాడాయన. కీర్తికార్‌ తన స్నేహితురాలి నృత్య ప్రదర్శనకు వెళ్లాడని నిర్ధారించుకున్న తరువాత నకిలీ తాళం చెవితో అయ్యర్‌ తదితరులు కీర్తికార్‌ గది తెరిచి చూశారు. అనుమానం నిజం. అతడు పోలీసు ఏజెంట్‌. హౌస్‌లో వారం వారం జరిగే రహస్య సమావేశాల గురించి పోలీసులకు నివేదికలు ఇస్తున్నాడు. కీర్తికార్‌ కణతకు రివాల్వర్‌ గురిపెట్టి నిలదీశారు అయ్యర్‌. నిజం ఒప్పుకున్నాడు కీర్తికార్‌. కానీ ఇతడిని బయటకి పంపినా వేరొకరిని ఇలాగే హౌస్‌లో ప్రతిష్టించక మానరు పోలీసులు. అందుకే అతడు హౌస్‌లో ఉండటానికే కాదు, నివేదికలు పంపేందుకూ ఒప్పించారు. కానీ ఆ నివేదికలన్నీ ముందు అయ్యర్‌ చూడాలి. అలా కొద్దికాలం పోలీసులను తప్పుతోవ పట్టించారు. 

 ఆ తరువాతే ఇండియా హౌస్‌ను తాత్కాలికంగా మూసివేయవలసిన పరిస్థితి ఎదురయింది.  భారత్‌ నుంచి వచ్చిన మదన్‌లాల్‌ థీంగ్రా అనే విప్లవకారుడు కర్జన్‌ వైలీ అనే ఆంగ్ల అధికారిని కాల్చి చంపాడు. హౌస్‌ మీద నిఘా పెరిగింది. అంతా చెల్లాచెదురయ్యారు. థీంగ్రాకు ఉరిశిక్ష విధించి లండన్‌ జైలులోనే ఉరి తీశారు. ఆయన భౌతికకాయాన్ని స్వాధీనం చేసుకుని సగౌరవంగా అంత్యక్రియలు జరిపించినవారు అయ్యర్‌. ఒక ముఖ్య విషయం చర్చించేందుకు లండన్‌ రావలసిందని సావర్కర్‌కు అయ్యర్‌ సమాచారం ఇచ్చారు. ఆ పనిలో పారిస్‌ నుంచి లండన్‌ వస్తుండగానే సావర్కర్‌ అరెస్టయ్యారు. ఆ అరెస్టు ఆయన జీవితాన్ని, భారత విప్లవోద్యమాన్ని దారుణమైన మలుపులోకి మళ్లించింది. లింకన్‌ ఇన్‌ అధికారులు చెప్పినట్టు ప్రమాణం చేయడానికి అయ్యర్‌ అంగీకరించలేదు. దీనితో  బారెట్లా పూర్తయినా డిగ్రీ ఇవ్వలేదు. పైగా ఈ చర్యతో అయ్యర్‌ ఎంత బ్రిటిష్‌ వ్యతిరేకో వెల్లడైంది. దీనితో అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. దాని నుంచి తప్పించుకోవడానికే ఆయన సిక్కు వేషంలో లండన్‌ వదిలి ఓడ ఎక్కారు. పారిస్‌లో మేడమ్‌ కామా, కృష్ణవర్మల దగ్గర చేరారు. అప్పుడే పోలీసులు సావర్కర్‌ను భారత్‌కు తరలిస్తున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఆయన కామా తదితరులకు సమాచారం అందించారు. తాను మార్సెయిల్స్‌ ఓడ రేవులో తప్పించుకుంటానని, అక్కడ నుంచి తనను తప్పించాలని ఆ సమాచారం సారాంశం. కామా, అయ్యర్‌ తదితరులు మార్సెయిల్స్‌ రేవుకు వెళ్లారు. చెప్పినట్టే సావర్కర్‌ తప్పించుకున్నారు. మరుగుదొడ్డి నుంచి సముద్రంలోకి ఉండే సన్నని గొట్టం ద్వారా సావర్కర్‌ సముద్రంలోకి జారారు. ఈ సాహస చరిత్ర సుప్రసిద్ధం కూడా. కానీ నిషేధం ఉన్నా మార్సెయిల్స్‌ రేవులోకి  బ్రిటిష్‌ పోలీసులు చొరబడి సావర్కర్‌ను మళ్లీ ఓడలోకి తీసుకుపోయారు. ఇదంతా కామా, అయ్యర్‌ చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. తరువాతే ఆయన ఇండియాకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ముస్లింలా ఉండటం ఎలాగో నేర్చుకున్నారు. పార్సీ జాతీయుడిలా కనిపించడానికి కామా దగ్గర వారి ప్రార్థనలు అభ్యసించారు. కొద్దికాలం శ్రద్ధగా గెడ్డం పెంచారు. మొత్తానికి భారత్‌  చేరుకున్నారు. ఆ ఓడ శ్రీలంక రాజధాని కొలంబోకు వెళుతూ తమిళనాడులోని కడలూరులో ఆగింది. అయ్యర్‌ అక్కడే దిగి, చిన్న పడవలో గట్టుకు వచ్చారు. అక్కడ నుంచి జట్కాలో  పుదుచ్చేరి చేరుకున్నారు.  ఫ్రెంచ్‌వారి అధీనంలోని పుదుచ్చేరిలో, అరవిందుని సమక్షంలో ఉండేవారు. అక్కడ కూడా ఆయన తను నమ్మిన విప్లవ పథం గురించి యువకులను ఉత్తేజపరిచేవారు. ఈ బోధనలతో వాంచా అయ్యర్‌ అనే ఆయన ఐష్‌ అనే ఒక ఆంగ్ల అధికారిని చంపాడు కూడా.

ఒకసారి గాంధీజీ పుదుచ్చేరి వచ్చారు. అయ్యర్‌ మర్యాదపూర్వకంగా కలసి మాట్లాడారు. ఒక్కసారిగా గాంధేయవాదిగా మారిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. బ్రిటిష్, ఫ్రెంచ్‌ సంబంధాలలో మార్పు వచ్చింది. అయ్యర్‌ అరెస్టయి, కొద్దికాలం బళ్లారి జైలులో గడిపారు. విడుదలైన తరువాత జాతీయ కాంగ్రెస్‌లో పనిచేశారు. కానీ 1922 నాటి గాంధీజీ సహాయ నిరాకరణ  ఉద్యమానికి పిలుపునిచ్చి, తరువాత ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలు జరిగాయి. అయ్యర్‌ దాదాపు రాజకీయాలు వదిలేసి విద్య వైపు, సాహిత్యం వైపు మరలారు. సర్మాదేవి అనే చోట ఒక విద్యాలయం ఏర్పాటు చేశారు. దీనికి నలువైపుల నుంచి మద్దతు వచ్చింది. కాంగ్రెస్‌ కూడా ఆర్థిక సాయం చేసింది. కానీ ఇందులో వచ్చిన ఒక గొడవ బ్రాహ్మణ, బ్రాహ్మణేతర వివాదంగా ముదిరి ఆయనను కలత పెట్టింది. కాంగ్రెస్‌లోని బ్రాహ్మణేతర నాయకులు సాయం ఆపేశారు. అయినా ఆయన విద్యాలయం నడిపారు. ఆ సమయంలోనే ఒకసారి పిల్లలను తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉన్న పాపనాశం అనే జలపాతం దగ్గరికి విహార యాత్రకు తీసుకువెళ్లారు. అక్కడికే ఆయన భార్య, కూతురు వచ్చారు. ప్రవాహం చిన్నగా ఉన్నచోట మగపిల్లలంతా దూకి అవతలికి వెళ్లిపోయారు. కూతురు సుభద్ర కూడా దూకుతానని అడిగింది. అయ్యర్‌ వారించాడు. దానికి ఆ బాలిక, ‘ఝాన్సీ లక్ష్మీబాయిలా ఉండాలని నిరంతరం చెప్పే మా నాన్న నోటి నుంచే ఈ మాట వచ్చింది?’ అంది. అంటూనే దూకింది. పరికిణీ అడ్డం పడి నీళ్లలో ప్రవాహంలో పడిపోయింది. కూతురుని రక్షించడానికి అయ్యర్‌ దూకారు. ఇద్దరూ చనిపోయారు. ప్రపంచమంతా సముద్రం మీద తిరిగి వచ్చిన ఆ మహా విప్లవకారుడు, సొంత రాష్ట్రంలో చిన్న నీటి పాయలో పడి చనిపోవడం చాలా విచిత్రం. అన్ని మతాల వారితో, ప్రాంతాల వారితో కలసి పనిచేసిన ఆ విప్లవకారుడు చిన్న కులం గొడవతో కుంగిపోవలసి రావడం ఇంకా చిత్రం.   
- డా. గోపరాజు నారాయణరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement