ఇతరత్రా ప్రేమలకిది సందర్భం కాదు. అబ్బాయి తన నుదుటిని అమ్మాయి పాదాలకాన్చి ‘నువ్వు నాక్కావాలి’ అని కన్నీళ్లతో వేడుకునే ప్రేమకు, అమ్మాయి తన శక్తినంతా కూడగట్టుకుని చెయ్యి కందిపోయేలా అబ్బాయి ఆ చెంపా ఈ చెంపా పగలగొడుతూ, ‘‘నువ్వు నా జీవితంలోకి రాకుండా నేన్నొక్కదాన్నీ ఎలా బతికేస్తాననుకున్నావురా బుద్ధిహీనుడా’’ అని రోదిస్తూ మూర్ఛిల్లి పడిపోయే ప్రేమకు ఇది పుట్టినరోజు. అలాగైతే జర్మన్ తాత్వికుడు నీషే ప్రస్తావనకు ఇది సందర్భం కాదేమో.
‘దేవుడు చనిపోయాడు’ అని ప్రకటించినవాడు నీషే! పందొమ్మిదో శతాబ్దపు ఐరోపా ఉలిక్కిపడడానికి ఈ మాట చాలదా! ‘నీషేకు మతి చలించింది’ అన్నారు మతాధికారులు, రాజ్యాధినేతలు. ‘ఏమైనా అనండి, మీ విలువలకు విలువ లేదు, మీ విశ్వాసాలకు విశ్వసనీయత లేదు’ అన్నాడు నీషే. అతడేం చెప్పినా అందులో కవిత్వం ఉండేది. తత్వం ఉండేది. అవి రెండూ ఎవరికీ అర్థమయ్యేవి కావు! ‘‘ఏది నువ్వు కాదో అదే దైవం, అదే ఆదర్శం’’ అనేవాడు నీషే. ‘ఏమిటంటాడూ’ అన్నట్లు చూశారే తప్ప ఎవరూ అతడిని అర్థం చేసుకోలేదు.
నిజానికి అతడే అర్థమయ్యే రూపంతో, రంగుతో, రుచితో లేడు. తండ్రికి మతిపోయినట్టే కొడుక్కీ పోయినట్లుంది అన్నారు కొందరు. నీషే తండ్రి మతి స్థిమితం తప్పి ముప్పై ఐదేళ్ల వయసుకే చనిపోయాడు. నీషేకీ అదే గతి పడుతుందనుకున్నారు. పట్టింది కానీ మరీ ముప్పై ఐదేళ్లకు పట్టలేదు. చివరి పదేళ్లూ మానసిక వైద్యుల చుట్టూ తిరిగాక తన 55వ యేట అన్ని విధాలా శల్యమై, శిథిలమై చనిపోయాడు నీషే.
నీషే పూర్తి పేరు ఫ్రీడ్రిక్ విల్హెల్మ్ నీషే. ప్రష్యాలో పుట్టాడు. ఫ్రీడ్రిక్ విల్హెల్మ్ అన్నది అప్పటి ప్రష్యా రాజు పేరు. ఆయన పుట్టిన రోజే (అక్టోబర్ 15) నీషే కూడా పుట్టడంతో తండ్రి అతడికి రాజుగారి పేరు జోడించాడు. తర్వాత రాజుగారు మతి చలించి మరణించడం, నీషే తండ్రి, నీషే కూడా మతిస్థిమితం కోల్పోయి చనిపోవడం ఒక చారిత్రక విచిత్రం.
పెద్దయ్యాక చూడ్డానికి దున్నపోతు కొమ్ముల్లాంటి బలిష్ఠమైన మీసాలతో కరుకుగా కనిపించేవాడు కానీ... చిన్నప్పుడు నీషే కోమలంగా, కౌమారంలోని బాలికలా ఉండేవాడు. ఆడితే చెల్లితో, లేదంటే బయటి ఆడపిల్లలతో. వాళ్లూ ఖాళీగా లేకపోతే పుస్తకాలు.
పోర్టా స్కూల్లో అతడు చదువుకున్నది గ్రీకు, లాటిన్, సైన్స్. బాన్, లీప్జిగ్ యూనివర్శిటీలలో భాషా శాస్త్రం. జీవితంలో పడ్డాక షోపెన్‌హోవర్ నిరాశావాదం. తర్వాత కొన్నాళ్లు బలవంతంగా సైన్యంలో. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చాక బేసిల్ (స్విట్జర్లాండ్) విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం. తర్వాత తన 39 వ ఏట ‘దజ్ స్పేక్ జరతూస్త్ర’ గ్రంథ రచన. దీనర్థం ‘జరతూస్త్ర ఇలా అన్నాడు’ అని. నీషే తను చెప్పదలచుకున్నవన్నీ జరతూస్త్ర చెప్పినట్లుగా చెప్పాడు. జరతూస్త్ర ప్రాచీన పర్షియన్ మత ప్రవక్త. ‘నేను చెబుతాను మీరు వినండి’ అంటే ఎవరూ వినరని అలా ఆ ప్రవక్తను అడ్డం పెట్టుకున్నాడు.
‘సాధనేచ్ఛే చోదకశక్తి’ అన్నది నీషే సిద్ధాంతం. కానీ అతడు మాత్రం తన ప్రేమను సాధించుకోలేకపోయాడు! (చూ: ఆండ్రూ షాఫర్ రాసిన ‘గ్రేట్ ఫిలాసఫర్స్ హూ ఫెయిల్డ్ ఎట్ లవ్’). జీవితమంతా ఒంటరిగానే గడిపాడు నీషే. స్నేహితులు లేరు. బంధువులు లేరు. ఉన్న ఒక్కగానొక్క స్నేహితుడు వాగ్నర్‌తో గొడవ పెట్టుకుని మాట్లాడ్డం మానేశాడు. వాగ్నర్ అకస్మాత్తుగా ఆస్తికుడిగా మారినందుకు నీషే పడిన గొడవ అది! శారీరకంగా కూడా నీషే బలహీనుడు. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం.
ఒక దశలో అతడు స్త్రీ ప్రేమ కోసం పరితపించాడు. ఒకరి తర్వాత ఒకరుగా నలుగురు అమ్మాయిలను ప్రేమించాడు. తన ప్రేమ విషయం తెలియజేశాడు. ఒక్కరు కూడా అతడి ప్రేమను అంగీకరించలేదు. అందరికన్నా ఎక్కువగా అతడు ప్రేమించినది లూవాన్ సెలోమీ ని. చాలా అందంగా ఉండేది. ఫిన్లాండ్ అమ్మాయి. నీషే రోమ్‌లో ఉండగా ఆమె పరిచయం అయింది. ‘నిన్ను ప్రేమిస్తున్నా’ అన్నాడు. కానీ ఆమె అతడి రచనలను మాత్రమే ప్రేమించానని చెప్పి, ఒక సాదాసీదా యువకుడిని పెళ్లి చేసుకుని, ఈ తత్వవేత్తను వదిలేసింది.
ఆ తర్వాత నీషే ఎవ్వర్నీ ప్రేమించలేదు. పైగా మొత్తం స్త్రీ జాతినే ద్వేషించడం మొదలు పెట్టాడు. స్త్రీలు మనుషులు కాదు.. పిల్లులు, పక్షులు అన్నాడు. వారిని నమ్మకూడదని ప్రబోధించాడు. నీషే భావాలలో కొన్ని నాజీల విశ్వాసాలకు దగ్గరగా ఉండేవి. అందుకేనేమో నీషే మరణించినప్పుడు వీమర్ నగరంలోని ఆయన ఇంటికి వెళ్లి మరీ హిట్లర్ నివాళులు అర్పించాడు. కనీసం ఒక్క అమ్మాయైనా నీషే ప్రేమను అంగీకరించి, బాహువులలోకి తీసుకుని ఉంటే తన స్నేహితుడు వాగ్నర్‌లా నీషే కూడా నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం వైపు మళ్లి ఉండేవాడేమో!
ప్రేమ దక్కని తాత్వికుడు
Published Thu, Feb 13 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
Advertisement